ᐅతిరుమలేశుని బ్రహ్మోత్సవ వైభవం



తిరుమలేశుని బ్రహ్మోత్సవ వైభవం 

వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పగా గరుడధ్వజంతో, కనకరథంపై ఆ తిరువీధుల్లో వైభవోపేతంగా విహరిస్తూ ఉండగా భక్తకోటి హర్షాతిరేకంతో తిలకించి పులకించిపోతారు. మలయప్ప అంగరంగ వైభోగంగా వివిధ వాహనాలపై, తన దేవేరులైన శ్రీదేవితో, భూదేవితో కమనీయంగా ఆశీనుడై కనుల పండువగా దర్శనమిచ్చే మహిమాన్విత ఉత్సవం శ్రీవారి బ్రహ్మోత్సవం! బ్రహ్మదేవుడు తొలిసారి నిర్వహించినట్లు చెప్పే ఈ ఉత్సవాలను 'బ్రహ్మోత్సవాలు'గా వ్యవహరిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించాక ద్వితీయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.
తిరుమల దేవాలయంలో శ్రీనివాసునికి నిత్య కల్యాణం, పచ్చతోరణం! ఆ స్వామికి దేవాలయంలో జరిగే కైంకర్యాలను వర్ణించాలంటే తనివి తీరదు. శ్రీనివాసునికి నిత్య కైంకర్యంలో జరిగే సేవలు కాక, నక్షత్రాన్ని బట్టి జరిగే సేవలు కొన్ని, పర్వదినాలను, మాసాలను బట్టి జరిగే సేవలు కొన్ని. పుష్పయాగం, పవిత్రోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, ఇలా... ఎన్నో సేవలు ఆ లక్ష్మీవల్లభునికి అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు.

తిరుమలలో ఎన్ని సేవలు, ఎన్ని ఉత్సవాలు జరిగినా... బ్రహ్మోత్సవాల సంరంభం వేరు. బ్రహ్మోత్సవ సమయాన తిరుమలేశుని సొబగులను ఎంత వర్ణించినా తక్కువే. అనంత సూర్యకాంతితో ప్రకాశించే, ఆ దనుజసంహారి రాజసాన్ని, తేజసాన్ని తిలకించినవారిదే భాగ్యం! బ్రహ్మోత్సవాలను తొలుత వేంకటేశ్వరుని సేనాధిపతి అయిన విష్వక్సేనుని పూజించి ప్రారంభిస్తారు. శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల తొలినాటినుంచీ దివ్యవాహనారూఢుడై విహరిస్తూ తన సన్నిధికి విచ్చేసిన భక్తులను తన్మయులను గావిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేష, చిన్న శేష, సూర్యప్రభ, చంద్రప్రభ, ముత్యాల పందిరి, హనుమంత, గరుడ, గజ, సింహ... ఇత్యాది వాహనాల మీద నయనానందకరంగా శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో వూరేగుతాడు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది బ్రహ్మోత్సవాల్లో స్వామి అయిదోనాడు గరుడుని అధిరోహించే మనోజ్ఞ ఘట్టాన్ని! ఆ రోజున జగన్మోహనాకారుడైన స్వామి సర్వాలంకారభూషితుడై భక్తకోటికి సాక్షాత్కరిస్తాడు.

బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదోనాడు స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణరథంలో కనుల పండువగా వూరేగిస్తారు. పదోనాడు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవ కైంకర్యం పరిపూర్ణమవుతుంది. చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో మంగళస్నానమొనరిస్తే, సమస్త పాపాలూ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.

పురాణాల ప్రకారం సకల దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించాలనే ఆకాంక్షతో తిరుమలగిరుల్లో వేంచేసి ఉంటారనేది ఐతిహ్యం. శ్రీవారి భక్తుల విశ్వాసం, భావన కూడా ఇదే! బ్రహ్మోత్సవాల సందడి సద్దుమణిగాక ఉత్సవాలకు విచ్చేసిన బ్రహ్మ రుద్రాది దేవతలకు, సూర్యచంద్రులకు, యమధర్మరాజువంటి దిక్పాలురకు పద కవితా పితామహుడు అన్నమయ్య తన సంకీర్తనలో వారి నిజనివాసాలకు వీడ్కోలు పలికే వైచిత్రి కమనీయంగా ఉంటుంది.

'హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు' అని బ్రహ్మరుద్రులను ఆత్మీయంగా సాగనంపి, 'జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవై రా సురల గూడి' అని యముడికీ, చంద్రుడికీ వీడ్కోలు పలికి దేవతలతో కలిసి వారిని మళ్ళీ విచ్చేయమని తరవాతి బ్రహ్మోత్సవాలకు సాదరంగా ఆహ్వానిస్తాడు.

శిఖరాయమానమైన శ్రీ వేంకటేశ్వరుని విభవానికి బ్రహ్మోత్సవాలే ప్రత్యక్ష తార్కాణం. మకుటాయమానంగా నిలిచే స్వామి వాహన సేవా వైభవానికి ప్రతి ఏటా అద్వితీయ ప్రభతో జరిగే ఈ ఉత్సవాలు నిజమైన దర్పణం!

- వెంకట్ గరికపాటి