ᐅదేహ సవనాలు
మానవ శరీరంకన్నా ఆత్మ గొప్పదని అంటారు. శరీరం అనిత్యమైంది, ఆత్మ నిత్యమైందనీ పురాణాలు తెలుపుతున్నాయి. ఆత్మకు ఆశ్రయమిచ్చేది దేహం. ఈ దేహానికీ ప్రాముఖ్యముంది. దేహం అధర్మాన్ని అనుసరిస్తే దేహంలోని ఆత్మ ముక్తిమార్గాన్ని వీడిపోతుంది. దేహం ధర్మంగా ప్రవర్తిస్తే ఆత్మ అంతర్యామివైపు సాగుతుంది. దేహం పాత్ర కీలకమైంది. శరీరం అంటూ లేకపోతే మనిషి ముముక్షువు కాలేడు. భగవంతుని మాయలు తెలియతరం కానివి. దేవదేవుడు గొప్ప మాయావి. దేహాన్ని పాంచ భౌతికం చేశాడు. త్రిగుణాత్మకంగా మార్చాడు. ప్రపంచంలోని అన్ని లౌకిక ఆనందాలూ శరీరంవైపు పయనించేలా ఈ దేహం చుట్టూ సూదంటురాయి వలయాన్ని ఏర్పరచాడు. నిశ్చలత్వాన్ని నిర్మోహత్వాన్ని సాధించలేని అశక్తుడిగా మార్చాడు.
ఆకలి వేస్తుంది. అన్నంకోసం అన్వేషించాలి. కోటి విద్యలు ప్రదర్శించాలి. ఆకలి అనేది మనిషి తప్పొప్పుల విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. కడకు దొంగగా కూడా మారుస్తుంది. ఆకలి తీరగానే దేహం సౌఖ్యాలను కోరుతుంది. ఆ సుఖాల వెతుకులాటలో నీతి, న్యాయం, ధర్మ మార్గాలను విస్మరించి దుర్మార్గాలను ఆశ్రయించే పరిస్థితులు కలుగుతాయి.
దేహానికున్న మరో నైజం అనురాగం. శరీరానికి తనపై తనకు ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ అక్కడితో ఆగదు. మేనుతో సంబంధం ఉన్న వారందరిపైనా ఎడతెగని అనుబంధాన్ని అనురాగాన్ని పెంపొందిస్తుంది. శరీరానికి అవసరమైన అన్ని సదుపాయాలు లభించిన తరవాతనైనా బుద్ధి మార్చుకుంటుందా? లేనేలేదు! ఈ శరీరం ధర్మసాధనకు మాత్రమే తండ్రీ... అని ఎవరైనా జ్ఞాని చెబితే వింటుందా? ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తుంది.
అవయవాలన్నీ ఉన్నాయి. ఆనందాల వేటలో అవన్నీ సహకరిస్తాయి. ఇంద్రియాలున్నాయి. సుఖాలను ఆస్వాదింపజేస్తాయి. విశ్వవ్యాప్తంగా మానవ దేహాలు సర్వసంగ పరిత్యాగం చేయకుండా సతతం పరితపిస్తూ జీవించడం ఆశ్చర్యకరమని సౌర్యాయణి అనే తార్కికుడు సుకేశుడు అనే మహర్షితో అంటాడు. ప్రశ్నోపనిషత్తులో ఈ ఉదంతం ఉంది. మాయను అధిగమించడంకన్నా మరో మార్గం లేదని మానవుడు గ్రహించాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైనంత వరకే వనరులను ఉపయోగించుకోవాలి. ఆకలి తీరేంత వరకే ఆహారం తీసుకోవాలి. రుచికరమైన ఆహారం లభించడం లభించక పోవడమనేది ముఖ్యం కాదు. దాహం తీర్చుకోవడానికి నదీ తీరం చేరి దాహం తీరేంతవరకే నీళ్లు తాగుతాం. నదిలోని నీరంతా తాగలేం. నిద్రా మైథునాలు దైవ సృష్టికి అవసరమైనంతవరకే!
ఈ దేహంపై మోహాన్ని వీడటంవల్ల మాయను అధిగమించవచ్చని ఆదిశంకరుడు పలికాడు. మాయతెరలు తొలగిన కొద్దీ సర్వవ్యాపకుడైన పరమాత్మతో బంధం ఏర్పడుతుంది. దేహంలోని ఆత్మ ఉనికి మనకు విశదం అవుతుంది. నిప్పును ముట్టించాలంటే రెండు కొయ్యలను ఉపయోగించాలనే జ్ఞానం కలగాలి. ఆ కొయ్యల రాపిడివల్ల అగ్ని (వెలుగు) పుడుతుంది. ఆత్మ, ఓంకారమనే రెండు కొయ్యల కలయికవల్ల శరీరంలోని ఆత్మతత్వం అవగతమవుతుంది.
మానవుడి ఆయుర్దాయానికి భాష్యం చెప్పింది చాంద్యోగ్యోపనిషత్తు. దానిద్వారా శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవచ్చు. దేహానికి మూడు సవనాలు (కాలాలు) ఉంటాయి. ప్రాతః సవనం, మాద్యందిన సవనం, సాయం సవనమని జీవన త్రికాలాలకు పేరు. మనిషి జీవితంలో మొదటి ఇరవై అయిదు సంవత్సరాలకు (పైలా పచ్చీస్‌కి) ప్రాతః సవనమని పేరు. ఈ ప్రాయంలో ఉండే శక్తిమంతమైన ప్రాణాలే వసువులు. ఈ సమయంలో విద్యను అధ్యయనం చేయాలి. అకార్యాలు చేయకుండా మనసును నియంత్రించాల్సిన కీలకమైన కాలం ఇదే సుమా! ఆ తరవాతి పాతిక సంవత్సరాల కాలాన్ని మాధ్యందిన సమయం అంటారు. ఈ సవనంలో దేహంలోని ప్రాణాలను రుద్రులు అంటారు. గృహస్తు జీవితం గడుపుతూ రాగద్వేషాలను విడిచి క్రతువులు (మంచి కార్యాలు) చేయాలంటారు. ఆ తరవాత వచ్చే కాలాన్ని సాయం సవనం అంటారు. ఈ వయసులోని ప్రాణాన్ని ఆదిత్యుడని పేర్కొన్నారు. సాయం సవనంలో పరబ్రహ్మను ఆరాధించాలని, నారాయణుని ఉపాసించాలని చెబుతారు.
మానవ దేహంతో ధర్మార్థ కామ మోక్షాలను సాధించవచ్చని మనకు తెలియపరచేందుకే శ్రీరాముడు మనిషిగా జన్మించాడు. మానవ హితమైన కార్యాలను నిర్వహించి తన శరీరం ధర్మానికి ప్రతీక అని నిరూపించుకున్నాడు. నాశనం కాగల ఈ దేహంతో నాశనం లేని పరమాత్మను చేరుకోవచ్చని తెలుసుకోగలిగితేనే- మనిషి కాయానికి అర్థం, పరమార్థం!
- అప్పరుసు రమాకాంతరావు