ᐅఅమృతవర్షిణి




అమృతవర్షిణి 

ప్రేమకి పుట్టిల్లు తల్లి. 

సృష్టిలో తొలిప్రేమ తల్లినుంచే లభిస్తుంది. అందుకే తల్లి తొలి దైవం. తల్లిదండ్రులు లేనివాడిగా అభివర్ణించే భగవంతుడు కూడా తల్లిప్రేమను పొందడం కోసం తనయుడిగా అవతారం ధరించినట్లు చదువుకున్నాం. యశోద నుంచి కృష్ణపరమాత్మ ఎంత ప్రేమను పొందాడో మనందరికీ తెలుసు.
ప్రేమను మించి ఈ సృష్టిలో మనం ఇవ్వగల విలువైన కానుక మరోటి లేనేలేదు. ప్రేమతోనే పరమాత్మ విశ్వాన్ని సృష్టించాడంటారు. ఎవరు ఆ పరమాత్మ? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు! ఈ ప్రశ్నలు జిజ్ఞాసువుల్ని సృష్ట్యారంభం నుంచీ వేధిస్తూనే ఉన్నాయి.

పరమాత్మ తన ప్రేమను పంచభూతాలుగా సృష్టించాడు. భూమి ప్రాణులకు నిలువటానికి ఆధారం అయితే, మిగతా నాలుగూ జీవనాధారంగా ఉంటున్నాయి. ఇవి లేకుండా ప్రపంచమే లేదు.

ప్రేమ అనేది పరమాత్మనుంచి నిరంతరం ప్రసరించే అమృత కిరణాల సముదాయం. సూర్యచంద్రుల దివ్యకాంతిలా అది అందరి మీద, అన్నివైపులా ఒకేరీతిలో ప్రసరిస్తుంటుంది. కేవలం మన అశక్తత, అనాసక్తత, నిర్లక్ష్యం వల్ల ఆ అమృతానుభూతిని పొందలేకపోతుంటామన్నది పెద్దల మాట.

ఆస్తికులైనా, నాస్తికులైనా పరమాత్మ దృష్టిలో సమానులే. ఒక విధంగా నాస్తికుల పట్లనే పరమాత్మ ఎక్కువ దృష్టి కలిగి ఉంటాడేమో! కారణం- నిజమైన నాస్తికులు, నిజాయతీతో కృషినే దైవంగా భావిస్తారు. ఆస్తికులు జరిపే వివిధ పూజా పురస్కారతంతులను ఏవగించుకుంటారు. వాటిలో స్వార్థమే తప్ప భక్తి లేకపోవడమే అందుకు కారణం.

భగవంతుడు తానేమి ఆశిస్తున్నాడో వేదాల ద్వారా తెలియజెప్పాడంటారు. మనిషి ఎలా జీవించాలో, తనను ఎలా పొందగలడో ఉపనిషత్తుల్లో చెప్పాడు. ఇవి అందుబాటులో లేనివారికి ఇతర దైవగ్రంథాల ద్వారా తన వాణిని వినిపించాడు.

అన్నింటి సారాంశమూ ఒక్కటే.

అదే, షరతుల్లేని నిస్వార్థ ప్రేమ!

ప్రేమ, మనసులోని అనేక కాలుష్యాలను కడిగేస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది పాషాణ విషాలను సునాయాసంగా తొలగించి వేస్తుంది. మనసు అమృతమయమవుతుంది.

ఆ స్థితికి చేరాక- దేహంలో సూర్యచంద్ర నాడుల ప్రసార స్థానాలైన నేత్రాల నుంచీ అమృతమే వర్షిస్తుందన్నది ఆధ్యాత్మికవాదుల వాక్కు.

మనసును 'అమృతవర్షిణి'గా మార్చడమే ఆధ్యాత్మికతకు అసలు ప్రయోజనం. ఆ ప్రయత్నమే ప్రతి సాధకుడి కర్తవ్యం కావాలి.

ప్రేమను పొందాలంటే ప్రేమను ఇవ్వాలి. భూమికి ఒక విత్తనం ఇచ్చి ప్రేమగా సాకితే, తిరిగి ఎన్నో విత్తనాలు ఇస్తుంది.

ప్రేమ విత్తనాలూ అంతే.

ప్రేమ ద్వేషాగ్నినీ చల్లబరుస్తుంది.

విష హృదయాల్ని సైతం అమృతీకరిస్తుంది.

అందుకే ప్రేమ... అమృతవర్షిణి.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్