ᐅహరిశయన ఏకాదశి




హరిశయన ఏకాదశి 

శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏడాదికి ఇరవైనాలుగు (అధిక మాసమైతే ఇరవై ఆరు) ఏకాదశులు. ప్రతి ఏకాదశికీ ఒక్కొక్క పేరు, ఒక్కో ప్రత్యేకత ఉన్నాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి 'తొలి ఏకాదశి' అని పేరు. సంవత్సరంలో తొలి మాసం చైత్రం. నాలుగోమాసం ఆషాఢం. అయినప్పటికీ ఆషాఢ (నాలుగో) మాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలవడానికి కారణం ఉంది. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. దక్షిణాయన ప్రవేశ దినాన్ని 'కర్కాటక సంక్రమణం' అని పిలుస్తారు. ఈ ఏకాదశికి కొద్ది రోజులు అటూ ఇటుగా (సౌరమాన గణన ప్రకారం) ప్రవేశిస్తుందది. అప్పటినుంచి మొదలయ్యే పండుగల పరంపరలో వచ్చే తొలి పండుగ ఈ ఏకాదశి. కాబట్టి దీనికీ పేరు వచ్చిందని చెబుతారు.
ఈరోజు మొదలు నాలుగు మాసాలపాటు విష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద నిద్రిస్తాడని, అందుకే దీనికి 'శయనైకాదశి' అని పేరు వచ్చిందని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలోనే 'దేవశయనం' అని, మహా ఏకాదశి, విష్ణుశయన ఏకాదశి, హరిశయన ఏకాదశి అనీ నామాంతరాలున్నట్లు చెబుతోంది బ్రహ్మవైవర్త పురాణం.

మానవ ప్రవర్తనను, ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించే తలంపుతో కొన్ని నియమనిబంధనలతో కూడిన చాతుర్మాస్యవ్రతం ప్రారంభమయ్యేది ఈ రోజునుంచే. స్కాందపురాణ కథనం ప్రకారం- ఈ లోకంలో పాపాలు చేస్తున్నవారిని సన్మార్గంలో పెట్టడానికి మార్గం చూపించమని విష్ణుమూర్తిని జ్ఞానసిద్ధుడు అనే ముని వేడుకున్నాడట. అప్పుడు- 'నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాలసముద్రంలో శేషశయ్యమీద పవళిస్తాను. ఈ నాలుగు మాసాల్లో యోగదృష్టితో ఎవరేమి చేస్తున్నదీ గమనించడానికే ఈ శయనం. ఈ నాలుగు మాసాల్లో నియమనిష్ఠలతో, ఆహారవిహారాది నియమాలతో, నిత్యపూజాదికాలతో నియమబద్ధ జీవనం గడిపేవారు నాకు ప్రీతిపాత్రులవుతారు. జన్మ, జరా, వ్యాధి, బాధలనుంచి విముక్తులవుతారు. ఈ విషయం నీ ద్వారా లోకంలో ప్రచారం కావాలి' అంటూ మానవులు ఆచరించలసిన నియమాలను తెలియజెప్పాడంటారు. లౌకికంగా ఆలోచిస్తే- ఆరోగ్య పరిరక్షణే ఆ నియమాల అంతస్సూత్రంగా ఉంటుంది. ఈ దినాన విష్ణ్వాలయాల్లో 'విష్ణుశయనోత్సవం' నిర్వహిస్తారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించి, జాజిపూలతో పూజించి పవళింపు ఉత్సవం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాలవారీగా రకరకాల ఉత్సవాలు చేస్తారీరోజు. ఉత్తరాంధ్రలో (ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో) 'ఆమిటి' అని ఈరోజును వ్యవహరిస్తారు.

గోదావరి జిల్లాల్లో ఈరోజును పాలేళ్ల పండుగగా నిర్వహిస్తారు. పాత పాలేళ్లను మార్చి కొత్తవారిని చేర్చుకోవడం ఈ పండుగలో ప్రధాన అంశం. వారికీరోజు పిండివంటలతో భోజనం పెట్టి, కొత్తబట్టలతో గౌరవించడం ఆనవాయితీ. వ్యవసాయంకోసం ఆరుగాలం కష్టించే శ్రామికులను, శ్రామిక వ్యవస్థను గౌరవించడం దీని ఆంతర్యం. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో పేలాపుపిండి పండుగగా జరుపుతారీ రోజును. ఆ పిండిని బెల్లంతో కలిపి దైవానికి నివేదనచేసి ఆరగించడం ఈ పండుగలో ప్రధాన అంశం. జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరించే ఆరోగ్యసూత్రాలే ఈ ప్రక్రియలో అంతర్భావన. నెల్లూరు ప్రాంతంలో సైతం ఉత్తరాంధ్ర మాదిరిగానే వ్యవసాయపు పనులు మొదలుపెట్టే రోజుగానే పాటిస్తారీ రోజును. ఏరు (నది) ముందా, ఏకాదశి ముందా అనుకుంటూ అప్పుడప్పుడే మొదలయ్యే తొలకరి ప్రభావంతో ఏరువాక సాగిస్తారు.

- అయ్యగారి శ్రీనివాసరావు