ᐅఅమృత ఘడియలు
దేనికీ భయపడని మనిషైనా మరణానికి భయపడతాడు. పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదని తెలిసినా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయే ఘడియలు ఆసన్నమవుతున్న విషయం గ్రహించగానే- గుండెల్లో భయోత్పాతం ఏర్పడి తీరుతుంది.
అన్నీ వదలుకొని పోతున్నామన్న బాధ! బంధాలు, మమకారాలు విడిచి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నామన్న వేదన!
ఆయుఃకాలమంతా క్షణంలో కరిగిపోయిందన్నట్లుగా చెప్పలేని దిగులు, విచారం. చివరి మజిలీ శ్మశానభూమి రమ్మని పిలుస్తున్నట్టుగా భయానక భావన! కనికరం లేని మృత్యుదేవత కౌగిలిలో బూడిదగా మిగిలిపోతామన్న వైరాగ్యం! ఆ క్షణంలో జీవిత రంగస్థలంపై తాను నిర్వహించిన పాత్ర తాలూకు మంచి చెడ్డల విచారణలు మనోపటలంపై తారాడతాయి.
వెరసి, అంతిమకాలం అంతులేని వైరాగ్యాన్ని వికలమయ్యే మనోస్థితిని కలిగించి సంఘర్షణకు గురిచేస్తుంది.
ఎందుకు కలుగుతుంది మరణ వేదన? ప్రశాంతత ఎందుకు దూరమవుతోంది?
సువ్యవస్థీకృతమైన జీవన విధానంతో, యోగి దృక్పథంతో జీవన కాలాన్ని గడిపిన మహాపురుషులు మరణాన్ని నవ్వుతూ ఆహ్వానించారు.
పుట్టుకను ప్రేమించే మనసు- మరణాన్నీ ప్రేమించాలంటారు. ఇది సమత్వ భావన. మనో పరిణతికి నిదర్శనం. ఏ వాసనలూ అంటని తత్వం, తామరాకుపై నీటిబొట్టు చందం.
మహా రుషులు, యోగులు, మహనీయులు అందించిన జ్ఞాన వైరాగ్య భావనలు, ప్రబోధాలు- మరణాన్ని, మహాప్రళయాలను సైతం తృణప్రాయంగా ఎంచే చిత్తాన్ని ప్రసాదించే దీపికలు. కోర్కెల వలయాల్లో కొట్టుకుపోతూ, ఆశాపాశాల కోరల్లో నలిగిపోయేవారి అజ్ఞానాన్ని పోగొట్టే సత్యప్రకాశికలు. గొప్ప మానసిక పరిపక్వతకు, మనోస్త్థెర్యానికి దోహదపడే జ్ఞాన కాంతిపుంజాలు!
రంగస్థలంపై పాత్రధారి నటించేంతసేపు పాత్రలోనే లీనమవుతాడు. తన పాత్రను సమర్థంగా పోషించానన్న తృప్తి ఆత్మానందాన్ని కలిగిస్తుంది. నూరేళ్ల ఆయుఃకాలం ఓ సుదీర్ఘ ప్రయాణం. అతి గొప్ప వేదికపై పాత్ర పోషణ. ఈ వేదికపై తన వంతు బాధ్యత, కర్తవ్యం, పాత్ర పోషణ ఔచిత్యం, ధర్మాచరణతో గడిచాయన్న తృప్తి ఉండాలి. ఆ తృప్తి మనోవేదనలను, మరణ భయాలను దరి చేరనీయదు.
తన ధర్మాచరణ జీవనయానం ఓ నిధిలా తరవాతి తరాలవారికి ఉపకరిస్తుందన్న భావన మనోవైకల్యాన్ని దూరం చేస్తుంది. వేదనలను అణచివేస్తుంది. అంతేకానీ- ధనం మూటల యావ పనికిరాదు. ఆ యావే ఉంటే యాతన తప్పదు.
తాను ఇంతకాలం పొందిన సాహచర్యపు తీపిదనం, తానందించిన అమృతత్వం- మార్గదర్శకంగా ఉందన్న ఆత్మతృప్తి ఉండాలి.
పుట్టుక, జీవన విధానాలు ఓవైపు ఆనందానికి సంకేతాలుగా ఉన్నా- భుజాల పైనే ఉన్న మరణాన్ని గమనిస్తూనే ఉండాలి.
నీడలా వెన్నంటి ఉండే మృత్యువును- 'కంట చూస్తూనే ఉన్నానులే... నా జీవన మార్గాన్ని ఎప్పటికప్పుడు సరిజేసుకునేందుకు సాయపడుతున్న నీ ఉనికికి జోహార్లు... నా సహచరిగా ఉంటున్న నీకు ధన్యవాదాలు!' అంటూ స్పందిస్తూనే ఉండాలి.
పండిన కాయ నేలరాలక తప్పదు. పండు పండేంతవరకు నవనవలాడుతూనే ఉంటుంది. నేలరాలిన పండు- తినేవారికి అమృత సమానంగా ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంతో ముడివడి ఉన్న మానవాళి ధర్మమూ ఇలానే ఉండాలి.
జీవించినంతకాలం ఈర్ష్యాసూయల వలయాల్లో కొట్టుకుపోతూ, 'నేను-నాది' అనే తమకంతో ఈదులాడటం- అంతిమ ఘడియల్లో వేదనకే గురిచేస్తుంది.
నిత్యతృప్తుడిగా జీవిస్తూ, ధర్మం తప్పక జీవన ప్రయాణం సాగిస్తే- అంతిమ క్షణాలు సైతం అమృత ఘడియలే.
అంతిమ ఘట్టపు మలి అడుగులు ప్రశాంత తపోవాటికకేసి సాగాలి.
- దానం శివప్రసాదరావు