ᐅదేవుడు అదృశ్యుడా?



దేవుడు అదృశ్యుడా? 

భగవంతుడు అదృశ్యుడు కాడు, దృశ్యుడే. భగవంతుడు మనకు విస్పష్టంగా కనిపిస్తున్నాడు. అది ఆయన మంచితనం. అది ఆయన సుగుణం. అందరిలో ఆయన కనిపించడం లేదా? 'భగవంతుణ్ని మీరు చూశారా?' అని అడిగిన వివేకానందునితో రామకృష్ణ పరమహంస 'నిన్నెంత స్పష్టంగా చూస్తున్నానో దేవుణ్ని కూడా అంతే స్పష్టంగా చూస్తున్నాను' అన్నారు.
ప్రతిచోటా ఆయన్ని కలుసుకోవచ్చు. నువ్వు ఎదురుచూడని క్షణంలో, స్థలంలో ఆయన కనిపిస్తాడు. నిద్రలో, మెలకువలో, రాత్రివేళ, పగటివేళ, సముద్రంపై, జీవిత ప్రయాణంలో, మాటల్లో, నిశ్శబ్దంలో- ఆయన ప్రకాశిస్తాడు. సందేహం లేని హృదయంగల ప్రతివ్యక్తికీ భగవంతుడు తప్ప మరేదీ లేదని నిశ్చయంగా తెలుసు. భగవంతుడు ఎప్పటినుంచో ఉన్నాడు. భగవంతుడు కోటానుకోట్ల నక్షత్రరాశులుగా మారాడు.

భగవంతుణ్ని చూస్తూనే ఉన్నాం. కాని, భగవంతుణ్ని చూస్తున్నామని మనకు తెలియదు. 'నువ్వు లేవు- ఉన్నది ఆయనే' ప్రతివ్యక్తిలో ఏదో ఉంది. అది లేకుండా విశ్వం లేదు. మన అస్తిత్వపు అమృతసారం ఆయనే! ఆ వెలుగుకు వర్ణించే పదాలు లేవు. అది స్వర్గలోకపు ఉచ్ఛ్వాసం. మహోన్నతమైనదేదో అది మనిషిలో నిక్షిప్తమై ఉంది. ఈ జీవితం, ఈ శరీరం, ఈ మనసు ఆయన ధరించిన అంబరాలే.

పదార్థం, పరమాత్మ మొదటి నుంచి ఒక్కటే. 'నేను స్రష్టను. పూర్వం ఏ విధంగా ఉన్నానో అలాగే నేను మారతాను' అని ప్రతి వ్యక్తీ తనలో తాను అనుకోవాలని ఉపనిషత్తులు ప్రవచిస్తున్నాయి. అనంతుని, శాశ్వతుని ప్రతివ్యక్తీ తనలోనే చూడాలి. తన ఆత్మ ఆలయంలో ఆయనను చూసినవారు ఈ ప్రపంచమనే ఆలయంలో కూడా చూస్తారు.

తాను ఆరాధించే దేవుడు విగ్రహం కాదని తెలిసిననాడు ప్రతి వ్యక్తీ ఆయన్ని మరింతగా ప్రేమిస్తాడు. భర్త భగవానుడే అని భావించిన భార్య అతణ్ని మరింతగా ప్రేమిస్తుంది. తన భార్య భగవంతుడే అని తెలుసుకున్న భర్త ఆమెను మరింతగా ప్రేమిస్తాడు. పిల్లలు భగవంతుని రూపాలని అనుకున్నప్పుడు తల్లి వారిని మరింతగా ప్రేమిస్తుంది. సాధువు భగవంతుడే అని తెలిసిన వ్యక్తి ఆయన్ని మరింతగా ప్రేమిస్తాడు. అటువంటి వ్యక్తి ప్రపంచాలనే కదపగల శక్తి పొందుతాడు. అతనిలోని చిన్న ఆత్మ చనిపోయి, ఆ స్థానంలో భగవంతుడే భాసిస్తాడు. విశ్వమే సత్యారామంగా మారి అతని పాదాలచెంత మోకరిల్లుతుంది. అప్పుడు ఈ విశ్వం క్రీడాస్థలం అవుతుంది. అప్పుడు విశ్వం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం సుందరమైనది, మధురమైనదని అనగల హక్కు ఆ వ్యక్తికే ఉంది. అతడే మానవాళికి నిస్వార్థంగా, నిరహంకారంగా సేవ చేయగలడు.

ఒక సంపన్న వ్యక్తికి ఇరువురు తోటమాలులు ఉన్నారు. వారిలో ఒకడు బహు బద్ధకస్తుడు. అసలేపనీ చేయడు. మొక్కలకు నీరు పోయడు. యజమాని వచ్చినప్పుడు అతను లేచి నిలబడి చేతులు జోడించి 'నా యజమాని ఎంత అందంగా ఉన్నారో' అంటూ పాటలు పాడుతూ ఆయన చుట్టూ నాట్యం చేస్తాడు. రెండో తోటమాలి అతిగా మాట్లాడడు. కాని, కష్టపడి పనిచేస్తాడు. మొక్కలకు రోజూ నీరుపోసి, మంచి ఆకుకూరలు, పండ్లు పండిస్తాడు. దూరంగా ఉన్న యజమానికోసం వాటిని మోసుకుని వెళ్తాడు. యజమానికి వారిలో ఎవరు ఇష్టమో తెలుస్తూనే ఉంది. శివుడే యజమాని. ఈ ప్రపంచం ఆయన తోడు. శివుడికి ఇద్దరు తోటమాలులు ఉన్నారు. శివుడికి అందమైన నేత్రాలున్నాయి. ఒంటినిండా పాములున్నాయి అని ఒకడు నిత్యమూ స్తోత్రాలు చేస్తుంటాడు. బీదవారికి, బలహీనులకు, దురదృష్టవంతులకు, జంతువులకు రెండోవాడు సేవ చేస్తుంటాడు. వారికై శ్రమిస్తుంటాడు.

ఏ వ్యక్తి అయినా స్వార్థపరుడైతే, అతను ఎన్ని ఆలయాలు సందర్శించినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, తానొక గొప్ప భక్తుణ్నని చిత్రించుకున్నా, అతడు శివుని కృపకు బహుదూరంలో ఉంటాడు!

- కె.యజ్ఞన్న