ᐅగెలుపు



గెలుపు 

పరీక్షల్లో ప్రథమస్థానం, క్రీడల్లో విజయం, వ్యాపారంలో అగ్రగామిగా నిలవడం... ఇలాంటివే గెలుపు అనిపించుకుంటాయా!? జీవితాన్ని అతిసునాయాసంగా, శ్వాస పీల్చుకున్నంత సులువుగా, చిరుగాలి తాకినంత హాయిగా జీవించగలిగితే అదే అసలైన గెలుపు అని ఆధ్యాత్మికులు ప్రవచించారు.
సాలీడు సహనంతో గూడు నిర్మించుకుంటుంది. ఎవరో ఒకరు ఆ సామ్రాజ్యాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తారు. అయినా బాధ పడకుండా మళ్ళీ అల్లిక మొదలుపెడుతుంది. అంతేగాని ఎవరినీ ప్రశ్నించదు, ఘోషించదు.

ప్రళయవీచికలు మర్రిచెట్టును సైతం కూకటివేళ్లతో పెకలించినా పక్కనుంచి చిగుళ్లు తొడుగుతుంది. అదే ప్రకృతి నైజం... విజయం.

అణుబాంబు విస్ఫోటనం జరిగినా మళ్ళీ కూడదీసుకుని ప్రపంచదేశాల సరసన నిలిచిన జపాన్ అందరికీ స్ఫూర్తిదాయకమే.్క ఎన్నిసార్లు పడిపోయినా ఎన్ని ఓటములు చవిచూసినా జీవితంలో గెలవాలి అనే పట్టుదల, సంకల్పం చాలు- మనిషి ఎంత ఉన్నతస్థాయికైనా చేరుకోగలడు. ప్రపంచ చరిత్ర పరిశీలిస్తే- గాంధీ, అబ్రహాంలింకన్, అంబేద్కర్, ఐన్‌స్టీన్ వంటి మహానుభావులు జీవితంలో అవరోధాలు ఎదురైనా తిరుగులేని నేతలుగా నిలిచారు. ఎవరి జీవితం వారిదే, ఎవరి గెలుపు వారిదే. గెలిచినవారి స్ఫూర్తితో విజయం వైపు దృష్టి సారించాలి. ప్రతి ఓటమీ ఒక గెలుపునకు నాంది. సంకల్పమే ఆ గెలుపునకు పునాది. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుంటే ఎన్ని సమస్యలనైనా, మరెన్ని కష్టాలనైనా ధైర్యంగా అధిగమించగలం, చిరునవ్వులు చిందించగలం. అలా జీవితం చివరివరకూ చిరునవ్వుతో గడపగలిగితే ఎదుటివారి ముఖాల్లో చిరునవ్వులు నింపగలిగితే జీవితాన్ని గెలిచినట్లే!

ఓటమిని ఎదుర్కొనలేక, కష్టాలు భరించలేక విద్యాధికులు సైతం జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం చూస్తున్నాం. జీవితాన్ని అంతం చేసుకోవడం కాదు, సొంతం చేసుకోవాలి. జీవితంలో ఉద్భవించే సంఘటనలు ఎలా వస్తున్నాయి, ఏ మలుపులు తిరుగుతున్నాయి, చివరకు ఏ విధంగా ముగుస్తున్నాయో తెలుసుకుంటూ- జీవితాన్ని ఒక ఆటలా తెరమీద బొమ్మలా చూస్తూ ఆనందించాలి.

నది ఎక్కడో చిన్న బిందువులా పుట్టి ఎన్నెన్నో పాయలను కలుసుకొంటూ, కొండలు లోయలు దాటుకుంటూ ఉత్తుంగ జలపాతమై ఉత్సాహంతో ఉరకలేసుకుంటూ సాగుతుంది. భువిపై సాధుపుంగవుడిలా ప్రశాంతంగా ప్రవహిస్తూ, చివరకు భగవంతుడిలో ఐక్యమయ్యే భక్తునిలా పరమానందంతో సముద్రంలో కలిసిపోతుంది. అలాగే మనిషి జీవితమూ సాగిపోవాలి. జీవితాన్ని వైకుంఠపాళికి అన్వయిస్తే- మింగేసే పాములుంటాయి, పైకి తీసుకెళ్ళే నిచ్చెనలూ ఉంటాయి. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ తనలోని సమత్వస్థితిని కాపాడుకుంటూ పరమపద సోపానం చేరుకున్నవాడే- గెలుపొందినవాడు, స్థితప్రజ్ఞుడు.

కురిసే ప్రతి చినుకూ ముత్యపు చిప్పను చేరుకోవాలనుకుంటుంది. అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని మనచేతిలో ఉండవు. కాని, ప్రతిక్షణంలో ఆనందాన్ని నింపుకొనే శక్తి, సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉన్నాయి. అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైనా సుఖమైనా ఆహ్వానించగలగాలి. నూతన అధ్యాయాలకు నాంది పలకాలి. అదే గెలుపు సూత్రం. అది తెలుసుకుని పాటించినవారే విజేతలు. వారి అడుగు జాడలే వెలుగు బాటలు. వారే తరవాతి తరాలవారికి మార్గదర్శకులు!

- డాక్టర్ డి.చంద్రకళ