ᐅకలడు కలండనెడి వాడు...
మనం ఒక విజయాన్ని సాధించాలి. మంచిదే. అయితే కొంతమందికి ఓపిక ఉండదు. కొంతమందికి ఓపిక ఉన్నా, ఆత్మవిశ్వాసం ఉండదు. కొంతమందికి ఓపిక, తమ మీద తమకు విశ్వాసం ఉన్నా విషయం మీద విశ్వాసం, నమ్మకం ఉండవు. విజయం సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ అవసరం. ముందుగా మనం ఏ అంశం మీద విజయం సాధించాలనుకున్నామో దాని ఉనికి మీద విశ్వాసం ఉండాలి. దాని ఉపయోగం మీద విశ్వాసం ఉండాలి. దాని ఔన్నత్యం మీద విశ్వాసం ఉండాలి. అది భగవంతుడే అయితే.... 'కలడు కలండనెడి వాడు కలడో లేడో' అనే వూగిసలాట పనికిరాదు. అసలు విషయం మీదే విశ్వాసం లేనప్పుడు విజయం మీద పట్టు సాధించలేం. ప్రయత్నం మీద పట్టు కాదు కదా దాహార్తితో నీళ్ల కోసం ఎండమావుల వెంట పరుగు పెడుతున్నామా అనే అవిశ్వాసం, వూగిసలాట- ప్రయత్నాన్నే బలహీనపరుస్తుంది. ముఖ్యంగా సత్యాన్వేషణలో అవిశ్వాసం ఆత్మహత్యా సదృశం. ముందుగా భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. మన అన్వేషణకు, సాధనకు అక్కడే గట్టి పునాది పడుతుంది.
ప్రాపంచికమైన ఏ విషయాన్నైనా నమ్మకం లేకపోతే మనం వదిలివేయవచ్చు. కానీ నమ్మకం ఉన్నా లేకపోయినా వదలకూడని విషయం భగవంతుడు. బలవంతంగానైనా ఆ ఉనికి పట్ల విశ్వాసాన్ని కలిగించుకోక తప్పని విషయం భగవంతుడే. ఎందుకంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయిన ఆ దైవానికి అతీతంగా మనం జీవించలేం. అసలు ఆయనకు మించి, మినహాయించి మనకు వేరే ఉనికి లేదు. ఆయనలోనే మనం. మన లోపలంతా ఆయన. ఆయన రక్షణ, అనుగ్రహం, సర్వదా ఎల్లెడలా ఉన్నా- ఆయన అనుగ్రహ ఛత్రం కిందికి వెళ్లే ప్రయత్నం మనం చేయాలి.
భగవంతుని మీద విశ్వాసాన్ని ఎలా సాధించాలి? మనకు విశ్వాసం లేకపోయినా... భగవంతుడనేవాడు ఒకడున్నాడని జ్ఞానులు, మహాత్ములు, అనుభవజ్ఞులు అంటున్నారు, విశ్వసిస్తున్నారు. అదేదో ఓసారి ప్రయత్నించి చూస్తే నష్టమేముంది అనే జిజ్ఞాస ప్రారంభం కావాలి. ఆషామాషీగానో, ఆసక్తితోనో విశ్వాసం కలిగించుకునే దిశగా ప్రయత్నం ప్రారంభించాలి. అడుగులు వేయాలి. ఆయన వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన తొమ్మిది వందల తొంభై అడుగులు మన వైపు వేస్తాడనే విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే వూహాతీత శక్తిమంతుడు, అప్రమేయుడు అయిన ఆ సర్వప్రాజ్ఞుడి ముందు మనమెంత? ఆయనను మన ప్రయత్నంతో, మన ప్రయాణంతో చేరుకోవటమన్నది వూహకు కూడా అందని విషయం. అందువల్ల మన ఒక అడుగుకు అభిముఖంగా ఆయన కోటానుకోట్ల అడుగులు పడితేనే- మనం ఆయనకు చేరువ కాగలం. అందువల్ల మొదటి అడుగు ముఖ్యమైంది. బలిమినో, చెలిమినో అడుగులు వేసి చూద్దాం. ఆ తరవాత భగవంతుడి ఉనికిని గురించిన కొండంత సమాచారాన్ని, హామీని వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు దయతో వ్యాసపీఠం మీద ఉంచి మనకందిస్తాయి. గురువులు, మహాపురుషులు అరటిపండు ఒలిచి తినిపించిన చందాన భక్తి జ్ఞానాలను వాళ్ల అరచేతుల్లో దయ అనే ఉద్ధరిణితో పోసుకుని మనకు ఔపోసన పట్టించేందుకు సిద్ధంగా ఉంటారు.
ఇంత అద్భుతమైన సృష్టి సమస్తం యాదృచ్ఛికంగా ఏర్పడిందనటం అమాయకత్వమే అవుతుంది. ఈ సృష్టిలో ఎంత గొప్ప శైలి, శిల్పం, క్రమపద్ధతి, నియమం, క్రమశిక్షణ ఉన్నాయి! దీని వెనక మహత్తర సంకల్పం ఉంది. ఒక మహాశిల్పి, అద్భుత కళాకారుడు, అనంత శక్తిమంతుడు లేనిదే ఇంత సృష్టి సాధ్యం కాదు. ఆయనే భగవంతుడు. నియతి, క్రమశిక్షణ రీత్యా నిరంకుశంగా అనిపిస్తున్నా నిరవధిక దయాసాగరుడు. ప్రేమైక రస ఆకారుడు. అత్యంత ఆకర్షకమూర్తి. పొరపాటుగానైనా సరే ఒకసారి... ఒక్కసారి ఆ ఛాయలకు వెళ్ళగలిగితే ఉప్పుబొమ్మలమై ఆ ఉదధిలో కరిగి, కలిసిపోక తప్పదు.
- చక్కిలం విజయలక్ష్మి