ᐅఇస్లామ్- విశిష్ట అంశాలు
అల్, ఇలాహ్ అనే రెండు పదాల కలయిక అల్లాహ్. అల్ 'ఆ' అని నిర్దేశించి చెప్పే ప్రత్యయం లాంటిది. 'ఇలాహ్' అంటే సృష్టికర్త, ఆరాధ్యుడు, స్వామి, మొర ఆలకించేవాడు, అంటే దేవుడు. రెండూ కలిపితే ఆ దేవుడు అని ఒకే దేవుని నిర్దేశించే పదం అల్లాహ్. అల్ చేరినప్పుడు వచనభేదం లింగభేదం లేని పదంగా రూపొందుతుంది. అల్లాహ్ అనే పదానికి లింగం లేదు. వచనం లేదు.
'సలిమ' 'అస్‌లమ' అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది ఇస్లామ్. సలిమ అంటే శాంతియుతంగా ఉండటం, అస్‌లన అంటే భక్తి వినమ్రత, విధేయతలతో ఉండటం. ఆ దేవుని ఆదేశాల్ని పాటించి భక్తి విధేయతలతో శాంతియుతంగా ఉండటానికి నియుక్తమైన విధానం ఇస్‌లామ్ అని స్పష్టమవుతోంది. 'ఖరా' అంటే చదవడం ఖుర్ఆన్ అంటే చదవవలసిన, పఠించదగిన అధ్యయనం చేయదగిన గ్రంథం అని అర్థం. పవిత్ర ఖుర్ఆన్ భాగాన్ని లేదా అధ్యాయాన్ని 'సూరహ్' అంటారు. ఖుర్ఆన్‌లో మొత్తం నూట పద్నాలుగు సూరహ్‌లు (అధ్యాయాలు) ఉన్నాయి. విషయాలకు అనుగుణంగా ఈ ఆధ్యాయాల విభజన ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) జీవితకాలంలోనే చేశారు. పవిత్ర ఖుర్ఆన్‌లోని వాక్యానికి ఆయత్ అని పేరు. ఆయత్‌కు శ్లోకం, చరణం, దివ్యసందేశం అనే అర్థాలున్నాయి. ఒక్కొక్క సూరహ్ పలు ఆయత్‌లుగా విభజితమైంది.
స.అ.సం- ఈ పుటాక్షరాలు 'సల్లల్లాహు అలైహి వ సల్లమ్' నకు సంకేతాలు. ఈ పద సముదాయానికి అల్లాహ్ అనుగ్రహం శాంతి అతనికి లభించుగాక అని అర్థం. ఈ ఆశీస్సు లేక ప్రార్థన కడపటి ప్రవక్త ముహమ్మద్‌ను ఉద్దేశించి ఆయన పేరు రాసేటప్పుడు ఇలా రాయడం పలికేటప్పుడు ఇలా పలకడం జరుగుతుంది.
'అమామ్' అంటే ముందు, ఎదుట అని అర్థాలు. 'ఇమామ్' అంటే ముందున్నవాడు నాయకుడు అని భావార్థం. సామూహిక ప్రార్థనల్లో ముందుండి ప్రార్థనచేసే వ్యక్తిని 'ఇమామ్' అంటారు. మత గురువును, ఖురాన్ వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తిని సైతం ఇమామ్ అంటారు.
సలాత్, నమాజ్- అరబ్బీ భాషలో 'సలాత్' అంటే ప్రార్థన. ఫారసీ భాషలోను నమాజ్ అంటే ప్రార్థన అనే విపులమైన అర్థం ఉంది. ఇస్‌లామ్‌ను అనుసరించి కడపటి మాసం 'జిల్‌హజ్'లో మక్కానగరానికి పుణ్యయాత్ర చేస్తారు. దీన్ని హజ్ అంటారు. మహమ్మద్ ప్రవక్త (స.అ.సం) తమ జీవిత చరమ దశలో ఒకేసారి చేసిన హజ్ (అదే ఆయన చేసిన తొలి తుది హజ్)ను 'హజ్అల్‌విదా' అంటారు. 'అల్‌విదా' అంటే వీడ్కోలు అని అర్థం. 'రుకూ' అంటే భూమికి సమాంతరంగా నమాజ్‌లో నడుము వంచి ఉండే తీరు. 'సిజ్దా' అంటే మోకరిల్లి రెండు అరచేతుల్ని నేలపై ఆన్చి నొసటిని నాసికను నేలకు ఆనించి ఉండే విధానం. సిజ్దాచేసే స్థలాన్ని మస్‌జిద్ అంటారు. అదే ముస్లిము ప్రార్థనా స్థలం. నమాజ్‌కు ముందు తప్పనిసరిగా ముఖం, చేతులు, కాళ్లు కడుక్కునే ప్రత్యేక విధానాన్ని 'వుజూ' అంటారు. అల్లాహ్ (ఆ దేవుడు) ఒక్కడే అని చిత్తశుద్ధి, అచంచల విశ్వాసం కలిగి ఉండటం 'ఈమాన్'. ఆ విశ్వాసం కలిగి ఉన్నవాడు 'మూమిన్'. అతనిది పరిణత దృష్టి.
'రహిమ' అంటే కరుణ, దయ, కనికరం. రహ్‌మాన్ లేక రహీమ్- ఈ పదాలకు కరుణామయుడు, కనికరించేవాడు అని అర్థం.
'అర్‌సల' అంటే పంపడం. 'రిసాల' అంటే సందేశం. దైవసందేశాన్ని కొనిపోయేవాడు, సందేశాన్ని స్వీకరించిన ప్రవక్త అని అర్థాలు 'రసూల్' పదానికి. 'దబా' అంటే విశిష్టమైన వార్త, సందేశం లేక ప్రకటన. సందేశాన్ని గ్రహించి ప్రజలకు అందజేసేవాడు 'నబీ' అంటే ప్రవక్త.
'జిన్' అంటే దయ్యం, పిశాచం. జిన్నులలోనూ, మానవుల్లోనూ దైవధిక్కారం చేసిన లేదా దైవ సందేశాల్ని పరిహసించిన దురహంకారుల్ని, దుష్టుల్ని షైతానులు అంటారు.
మహమ్మద్ ప్రవక్త (స. అ. సం) మక్కానుంచి మదీనాకు వలసపోవడాన్ని'హిజ్‌రత్' అంటారు. ఇస్లామ్ చరిత్రలో హిజ్‌రత్ అత్యంత విశిష్టమైన సంఘటన. ఆ సంఘటన(క్రీ.శ. 622)ను ఆధారం చేసుకొని ఇస్లామీయ శకం ప్రారంభమైంది. ఇస్లామీయ శకాన్ని విశ్వమంతా అల్‌హిజ్‌రిగా పేర్కొంటారు.
'దీన్' పదానికి దైవ నమ్మకం, మతం తీర్పు అని అర్థాలు. 'తక్‌బీర్' అంటే అల్లాహు అక్‌బర్ అని చెప్పడం. సడలని భక్తితో అల్లాహ్ స్తోత్రం చేయడం. అక్‌బర్ అంటే అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. సమస్త విశ్వంలో అంతకంటే గొప్పవాడు లేడని భావం. నమాజ్ ప్రారంభంలో అల్లాహు అక్‌బర్ అని చేతులు చెవులదాకా ఎత్తిదించడం జరుగుతుంది. అన్ని దురాచారాల్ని వీడి అల్లాహ్‌ను శరణు వేడుతున్నానన్న భక్తిపూర్వక భావాన్ని అది సూచిస్తుంది.
'సౌమ్' అంటే రమజాన్ నెలలో ఉపవాసం. 'తౌహీద్' ఏకేశ్వరవాదం. తలపుల నిండా పరోపకార భావాన్ని దైవభక్తిని నిలుపుకొని ఉత్కృష్టమైన నైతిక విలువలతో కూడింది ఇస్లామ్ ధర్మం. ఈ గౌరవాన్ని సంరక్షించడానికి ప్రతి ముస్లిమ్ ప్రయత్నించి ఇస్లామ్ ధర్మంలోని విశిష్టపదాల వివరణ జాతీయభావనను పరిఢవిల్లజేయగలదు. హృదయాలు మాధుర్యరేఖలతో శోభిల్లగలవు.
- షేక్ మహమ్మద్ ముస్తఫా