ᐅ'అతి' అనర్థం
'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు చెబుతుంటారు. మనం చేసే ప్రతి కార్యమూ మితంగానే, ఓ పద్ధతిగానే కొనసాగిస్తుండాలి. మన నిత్యకృత్యాలకూ ఇది వర్తిస్తుంది. లేకుంటే ఏ పనినీ పూర్తిగా చెయ్యలేం. ఎందులోనూ కృతార్థత పొందలేం. 'మడి' అనే పద్ధతిని పెద్దలు ఎందుకు ప్రవేశపెట్టారంటే- ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాకనే జపం, పూజ, నివేదన, వ్రతం, స్మరణం, భజన వంటివి చేయాలని. అంతేకాని- ఒకే పట్టుబట్టను ఉతకకుండా నెలల తరబడి కట్టుకుని పూజలు చెయ్యమని కాదు. మడిపేరుతో నిప్పుల మీద నీళ్లు చల్లాకే వంట చేసేవాళ్లున్నారు. మడిలో ఉన్నాను కనుక ఎవ్వరితోనూ మాట్లాడననేవాళ్లున్నారు. ఇలాంటివన్నీ మితిమీరిన ఛాందస భావాలు, ఛాందస భాషణలు. మన ఆహారంకూడా మితంగానే ఉండాలి. సంపూర్ణ సాత్వికంగానే ఉండాలి. ఆయుర్వేద నియమనిబంధనలను అనుసరించిన ఆహారమే తీసుకోవాలి. రుచిగా ఉందని అదే అదే పదేపదే ముక్కుకింది గోతిలోకి నెట్టేస్తూంటే, అది మనల్ని మళ్లీ కోలుకోలేని నూతిలోకి నెట్టేస్తుంది. తినడంకోసం బతకడం కాదు, బతకడం కోసమే తినాలన్నది గుర్తుంచుకోవాలి. సాత్వికాహారం సాత్విక స్వభావం అలవడేలా చేసి సన్మార్గంలో నడిపిస్తుంది. సాధుత్వ సులక్షణం ఒంటపడుతుంది. అప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది. మాట మంచిదవుతుంది. మర్యాద కాపాడుతుంది. మన్నన సంప్రాప్తిస్తుంది.
సంభాషణ విషయమే తీసుకుందాం. కొందరు అవసరమొచ్చినా మాట్లాడరు. అయోమయ సంకేతాలతో ఇబ్బంది పెడుతుంటారు. అత్యవసర సందర్భాల్లోనూ స్పందించరు. కాకుంటే విపరీతంగా వదరుతూంటారు. అర్థం పర్థంలేని వ్యర్థమైన మాటలతో ఎదుటివారికి విసుగు కల్పిస్తుంటారు. ఎదుటివారి అనాసక్తిని గమనించక వాగుతూనే ఉంటారు. సమయ సందర్భాలను కానకుండా విషయోచితం కాని భాషణం చేస్తూంటారు. ఈ రెండు 'అతి'గా అనిపించే దుర్లక్షణాలు అనర్థదాయకాలే.
సముద్రంలోని ఉప్పునీరెలా దాహార్తుడి దాహం తీర్చలేదో, పరమలోభివద్ద ఉన్న ద్రవ్యమూ అంతే! దానగుణమున్న దరిద్రుడివద్ద ఉన్న రూపాయి అయినా పేదవాడి కడుపు నింపగలుగుతుంది. దాహంతో తపిస్తున్న బాటసారికి గుక్కెడు మంచినీరందించే చిన్న చెలమలాంటిది దానగుణశీల మనసు! తమ శక్తితో, సంపదతో, సంపాదనతో సంబంధంలేకుండా అనాలోచితంగా అడిగినవాడికల్లా అడిగినంతా ఇచ్చేసి, ఆస్తినంతా కీర్తి కండూతికోసమో, ప్రశంసలకోసమో హారతి కర్పూరం చేసేసి కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడవేసేవారూ ఉన్నారు నేటి సమాజంలో. అతిలోభుల్ని కానీ, అతి వితరణగుణ సంభవుల్ని కానీ హర్షించేవారుండరు. అందుకే తన్నుమాలిన ధర్మం పనికిరాదన్నారు విజ్ఞులు.
వృత్తిలో, నడతలో అతివినయమో, అహంకారమో ప్రదర్శించి నవ్వులపాలయ్యేవాళ్లూ ఉన్నారు. తాము చేసే వృత్తిలోకాని, విధినిర్వహణలోకాని తాత్కాలిక స్వప్రయోజన సాధనకోసం, అక్రమార్జనా పథక శోధనకోసం డాబులు, దర్జాలు, డాంబి కాలు ప్రదర్శిస్తూ, ఇతరుల విషయాల్లో అతిగా జోక్యం తీసుకుని చిక్కుల్లో చిక్కుకునేవారూ ఉన్నారు.
ఆధ్యాత్మిక దిశలో మనకు కనిపించే అనర్థాలను పరిశీలిద్దాం. గురు, శుక్ర, శని, సోమ- ఏకాదశి పౌర్ణమి, అమావాస్య- అంటూ విపరీతంగా ఉపవాసాలు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుని, అనారోగ్యం పాలై తమ కుటుంబసభ్యుల్ని ఇబ్బంది పెట్టేవారు కొందరు. ఉపవాసాల పేరుతో రాత్రిపూటల్లో ప్లేట్లకొద్దీ, కేజీలకొద్దీ ఫలహారాలు ఆరగిస్తూ జిహ్వచాపల్యం ప్రదర్శించేవారు ఇంకొందరు. విపరీతంగా ఉపవాసాలు చేసి ప్రాణం మీదికి తెచ్చుకొమ్మని ఏ దేవుడూ చెప్పలేదు. ఉపవాసం అంటే దేవుడికి సమీపంలో ఉండటం. ఆహారం మీద ధ్యాస పెట్టకుండా దైవధ్యానం చేయడమన్నమాట.
పత్రం, పుష్పం, ఫలం, తోయం- నిర్మల హృదయంతో నిండైన భక్తితో సమర్పించుకుంటే చాలు, నీ క్షేమమంతా నేనే చూసుకుంటానన్నాడు వాసుదేవుడు. కానీ సంతలోని పూలన్నీ, పంచభక్ష్య పరమాన్నాలన్నీ, హారతి కర్పూరపు ప్యాకెట్లన్నీ ఎన్ని ఎక్కువ సమర్పించుకుంటే ఆ దామాషాలో నీకు ముక్తి ప్రసాదిస్తానని ఎన్నడూ చెప్పలేదు అంతర్యామి. వృత్తిని మానేసి భక్తిని చూపనవసరం లేదు. విధిని మానేసి, విధాతను కొలువ పనిలేదు. మానవ సేవను మానేసి మాధవ సేవే చెయ్యమని ఏ మతమూ చెప్పలేదు. దేవుళ్లను గుర్తు పట్టలేనంతగా- హారతి ధూపం, సాంబ్రాణి ధూపం విగ్రహాలకు, పటాలకు పట్టించమని ఏ పూజా విధానమూ చెప్పలేదు. 'చిత్తశుద్ధిలేని శివపూజలు' ఉత్తుత్తివే అన్న పోతన వంటి మహానుభావుల మాటలు విస్మరించకూడదు. మనం చేసే ఉపవాసాలు మనకు ఆరోగ్య హానికారకాలు కాకూడదు. బాపూజీ వారానికి ఒక్కరోజే ఉపవసించేవారు. ఒక్కరోజే మౌనం పాటించేవారు. మానవ సేవావ్రతానికి మాధవసేవ అవరోధం కాకుండా చూసుకోవాలి. మన ఉద్యోగాలను, విధి నిర్వహణలను, ప్రజాసేవా కార్యక్రమాలను కొగసాగిస్తూనే భగవచ్ఛింతనం చేసుకోవాలి. నిరంతరం ధర్మ, కర్మశీలురుగా ఉంటూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలి. దేనికోసమూ, దేన్నీ విడవనవరం లేదు. ఆసక్తి ఉన్నా, శక్తిని గమనించుకుని తగిన విధంగా, పరిమితమైన పద్ధతుల్లో పాత్రత నెరిగి దాన ధర్మాదికాలు చేయాలి. ఆచితూచి, సమయ సందర్భోచితంగా, ప్రసన్నంగా, శాంతంగా, పరులను ఆహ్లాదపరచే విధంగా మితంగా భాషించాలి. అతినిద్ర, అతి పరిశ్రమ, అతివేగం, అతినిదానం- ఇలా అతిగా చేసేవన్నీ అనర్థదాయకాలే!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి