ᐅనిన్ను నువ్వు మరచిపో!
మనిషి తనకు తాను తెలుసుకోవడం ఎలా? మనిషిలో దైవం అదృశ్యంగా అంతర్గత జ్యోతిస్సుగా దీపిస్తున్నాడని ద్రష్టలు ఎందరో చెప్పారు. సాధన చేస్తే లోపల ఉన్న దైవం ప్రత్యక్షంగా కనిపిస్తాడని వారు ప్రబోధించారు. అందరికీ అది సాధ్యమేనా? ఏ యుగానికో, ఏ ఒక్కడో సత్యాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ప్రపంచాన్ని, మనుషుల్ని చూస్తున్నప్పుడు ఎవరికీ దైవం వారిలోపల ఉన్న దాఖలాలు తారసపడవు. ఆదిమ మానవుడి బాహ్య జీవనశైలి, నేటి ఆధునిక మానవుడి ఆంతరంగిక జీవనసరళి ఒక్కటేలా కనిపిస్తాయి. అఖిల విజ్ఞాన శిఖరాల వైపు కదిలే బహుముఖ అజ్ఞాన తమస్సు మనిషి అనిపిస్తుంది. మరికొందరిని, బహుశా కొద్దిమందిని చూస్తుంటే- విజ్ఞానం, వివేకం, వినయం, మానవత మూర్తీభవించిన సౌజన్య తేజస్వులుగా కనిపిస్తారు. ఏమిటీ భిన్నధ్రువాలు? భగవంతుని లీల అనుకుందామా?
ఒక ఉపనిషత్తు సృష్టిక్రమాన్ని వివరించింది. పరమాత్మ జీవసృష్టి చేయాలని సంకల్పించిన పిమ్మట దేవతల సహకారం పొందాలని భావించాడు. దేవతలు మొదట భగవంతుని దివ్యవ్యక్తిత్వాలు, అప్రాకృత శక్తులు. వారు దృశ్య రూపాలుగా మారాలని భావించారు. భగవంతుడు మొదట ఆవులు, గుర్రాలవంటి మృగాలను పుట్టించాడు. దేవతలకు ఆ రూపాలు నచ్చలేదు. భగవంతుడు చివరికి మానవ రూపాన్ని సృజించాడు. అప్పుడు దేవతలు సంతృప్తిచెంది ఆ ఆకారాల్లో ప్రవేశించారు. అనంతరం వారు తమ సృష్టి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మానవ ఆకృతి అంత గొప్పది!
అటువంటి దివ్యత్వం ఇప్పుడు ఎక్కడా కనిపించదు. ఎంత శోధించినా అంతుచిక్కదు. ఈ ప్రశ్నపై వేలాది తాత్విక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.
వేదాలు, ఉపనిషత్తులు చదవగలిగితే మానవ స్వరూపం అర్థంకావచ్చు. వాటిలోని ప్రతీకలు, అంతరార్థాలు ఒక పట్టాన అంతుచిక్కవు. సైన్సు మనకు అర్థమయ్యే భాషలో పూర్తిగా విరుద్ధంగా చెప్పింది. ఏది నమ్మాలి? ఎవరి ఇష్టం వారిది.
చాలాకాలం కిందట విశ్వకవి రవీంద్రుడు నెలకొల్పిన శాంతినికేతనం చూడటానికి ఒక కాలేజీ విద్యార్థి వచ్చాడు. అతను రాగానే రవీంద్రుని ఆంతరంగిక కార్యదర్శి గురుదయాళ్ మాలిక్‌ను కలుసుకుని ఆటోగ్రాఫ్‌కోసం అర్థించాడు. మాలిక్ అందుకు అంగీకరించి 'నిన్ను నువ్వు తెలుసుకో' అని రాసి సంతకం చేశాడు. ఆ విద్యార్థి సమధికోత్సాహంతో తరవాత రవీంద్రుని కలుసుకుని ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చాడు. రవీంద్రుడు మాలిక్ రాసిన సందేశం చదివి తనలో తాను నవ్వుకున్నాడు. ఆటోగ్రాఫ్‌లో సంతకంచేస్తూ 'నిన్ను నువ్వు మరచిపో' అని రాశాడు.
ఈ రెండు ప్రాచీనసూక్తులు మహనీయమైనవే. మనం మనల్ని పూర్తిగా మరచిపోయిన క్షణాలే జీవితంలో అత్యంత ఆనందమయమైన అమృతక్షణాలని విశ్వకవి ఆంతర్యం కావచ్చు.
'మనిషిని గురించి, మనిషిలోని దైవం గురించి వెలువడిన వివిధ సిద్ధాంతాలు నాకు అవసరం లేదు. ఆత్మను గురించి రాసిన సూక్ష్మతర సిద్ధాంతాలపై చర్చిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? మానవాళికి ఉపకారం చెయ్యి. ధర్మవర్తనుడిగా జీవించు. ఇంతకు మించిన నిర్వాణం లేదు. ధనంకోసం, కీర్తికోసం, మరిదేనికోసమో ఆశించకుండా వినిర్మల జీవనం సాగించు. అదే అంతిమ శాంతి ధామం. అన్ని తాత్విక సిద్ధాంతాలను మూలకునెట్టే దివ్యసూత్రం' అని గౌతమ బుద్ధుడు చెప్పాడు.
అటువంటి మాటలే- ప్రపంచాన్ని నిజంగా పరివర్తన చెందించే అసలు మంత్రాలు, మానవాళికి దారిచూపే మణిదీపాలు.
- కె.యజ్ఞన్న