ᐅసార్థక జీవనం
మానవ జీవితం ఎంతో విలువైనది. మనం ఈ ధరిత్రి మీద మిగతా జంతురాశికన్నా ఎంతో తెలివైనవాళ్లం. నాగరికత నేర్చుకున్నవాళ్లం. ఈ భూమ్మీద ఎన్ని రోజులు మనగలం అన్నది మన చేతుల్లో లేదు. బతికినన్నాళ్లూ జీవితాన్ని ఎంతో కొంత మంచి పనులకు ఉపయోగించి, జనహితానికి పాటుపడితే మనం సార్థక జీవనులమే! ఎల్లవేళలా జనహితాన్ని కోరేవాణ్ని సురభిళ పరిమళాన్నిచ్చే మల్లెపువ్వుతో, స్వార్థమే పరమావధిగా నిరర్థక జీవితం గడిపేవాణ్ని వాసన లేని గడ్డిపువ్వుతో పోలుస్తారు.
'నేను ప్రత్యేకించి ఈ సమాజానికి చేసేదేమీ లేదు... అంతా ఎవరో చేసేశారు' అనుకుంటే- అంతకన్నా తప్పు మరొకటి ఉండదు. ఈ చరాచర జగతిలో ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంతో కొంత సృజనాత్మకతా ఉంటుంది. చెయ్యవలసింది ఒక్కటే! మన తెలివికి పదును పెట్టడం, సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకోవటం.
నేను అనుకున్న పనిలో విజయం సాధించగలనా, అపజయం నన్ను వెంటాడుతుందా వంటి ఆలోచనలు- మనిషిని ప్రగతి ప్రస్థానంలో ముప్పిరిగొంటాయి. అనుక్షణం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అక్కడే ఎవరైనా తన సంకల్పబలంతో, జనహితం కోసం ముందుకు నడవాలి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఆదర్శ పురుషుల చరితాలను ఉదాహరణలుగా తీసుకుంటే- మనమూ సమధికోత్సాహంతో 'నేను సైతం' అన్న రీతిలో ముందుకు సాగగలం. నలుగురికి ఉపకరించే కార్యం సంకల్పించినప్పుడు వాళ్లందరి ఆశీస్సులూ అభినందనలూ మనకు వెన్నుదన్నుగా ఉంటాయనేది తలచుకుంటే మరింత బలంగా కార్యోన్ముఖులం కాగలం.
మానవాళి హితం కోసం ఘనకార్యాలు చేసినవారు, నూతన విషయాలు కనుగొన్నవారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా వారికి సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే. తాము కలలుగన్నదాన్ని మానవాళికి అందించేందుకు అహరహం శ్రమించారు. ఒక తపస్సుగా దాన్ని సాధించి సార్థక జీవనులుగా గణుతికెక్కారు.
నిజమే, మరి సార్థక జీవితాన్ని సాధించడానికి మార్గదర్శనం చేసేది ఎవరు?
విజ్ఞాన తేజంతో ఒక కొత్త వస్తువును లేదా కొత్త ఉపకరణాన్ని మనకు అందించి మెరుగైన మానవ జీవన శైలికి బాటలు వేసిన నవ్య పథగాములైన శాస్త్రవేత్తల జీవితాలు చూపిన మార్గం కావచ్చు!
ఆధ్యాత్మిక శక్తి అనే అమృత గుళికలతో మనలో ఉన్నతోన్నత భావాలను రంగరించి, ఉదాత్త భావనలను రగిలించి, నూతన తేజాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాలు కావచ్చు!
ఆర్కిమెడిస్, కోపర్నికస్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రైట్ సోదరులు, ఇలా... ఎందరో తమతమ శోధనతో మహోన్నత ఆవిష్కరణలకు సూత్రధారులై విశ్వ మానవాళికి మహోపకారం చేశారు. ఈ మహోన్నత శాస్త్రవేత్తలు, తాము జన్మించిన ధరాతలంలోని జీవరాశికి ఏదైనా ప్రయోజనకరమైన కార్యం చేసి, తమ జీవితాలను సాఫల్యం చేసుకోవాలని పడిన తపన మనకు సార్థక జీవన ఆవశ్యకతను చాటి చెబుతుంది. వారి ప్రయత్నాల్లో తొలిసారి అపజయం పాలైనా లక్ష్యపెట్టక, అప్రతిహతంగా ముందుకు సాగి, విజయాన్ని సాధించిన సమ్మోహన వైచిత్రి మనకు చక్కటి పాఠంలా ఉపకరిస్తుంది.
సార్థక జీవన ఉదాత్తతను ఇవ్వగలిగిన శక్తి ఆధ్యాత్మిక గురువుకు ఉంటుంది. లోకనీతినీ, జీవన రీతినీ మనోహరంగా ఆవిష్కరించి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన బలాన్నిచ్చే ఆధ్యాత్మిక గురువులు భారత సనాతన సంస్కృతినుంచి నేటివరకూ చాలామంది తారస పడతారు. ఆదిశంకరుల జీవితంనుంచి స్వామి వివేకానంద వరకు ఎందరో మహా పురుషులు తమ ఆధ్యాత్మిక బోధతో జాతి యువత జీవితంలో చైతన్య స్ఫూర్తి రగిలించినవారే.
ముందుకు సాగే క్రమంలో అపజయం అన్నది అత్యంత సహజం. మన ఆశయ సాధనకు జరిగే పోరాటంలో, సఫలీకృతుల కావాలన్న ఆరాటంలో అపజయం మిగిల్చే చేదు, మరింత తెగువతో ముందుకు దూకి మధుర ఫలాలను సాధించే నిచ్చెనగా అనుకుంటే బాధే ఉండదు. అప్పుడు మనం వెళ్ళే పథం పూలబాటలా అందంగా గోచరిస్తుంది. విజయాన్ని వరించడం మరింత సులభమవుతుంది.
ఉన్నత పురుషుల జీవితాలను ఆదర్శాలుగా తీసుకుందాం. దృఢ సంకల్పంతో, కార్యోన్ముఖులమై ఆత్మవిశ్వాసమే ఆలంబనగా పురోగమిద్దాం. వ్యధలు మరిచి, ఆనందపు సుధలు చిలికి జాతి నవ కథకు సూత్రధారులమవుదాం. మన వంతు హితానికి కృషి చేసి సార్థక జీవనులమవుదాం.
- వెంకట్ గరికపాటి