ᐅకుమార షష్ఠి



కుమార షష్ఠి 

శివకుమారుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యుడని నామాంతరాలతో వ్యవహరిస్తారు. కుమారస్వామి జన్మ గురించి పురాణాలు భిన్నగాధలు చెబుతున్నాయి. శివపార్వతులు మన్మథక్రీడలో ఉండగా, వారికి తననుమించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా శివతేజం భూమిపై పడింది. అగ్ని దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని తన తీరంలోని రెల్లు పొదల్లో జారవిడిచింది. ఆ శరవనంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు మునికన్యలు ఆ శిశువును తీసుకునిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు గనుక కార్తికేయుడయ్యాడని బ్రహ్మాండపురాణం పేర్కొంటోంది.
భర్తలను కొలుస్తున్న మునిపత్నులను చూసి అగ్ని కామపీడితుడయ్యాడని, ఇది తెలిసిన అగ్ని భార్య స్వాహాదేవి ఒక్కొక్క రుషిపత్ని రూపంలో ఒక్కోమారు వచ్చి అగ్నిని చేరిందని ఆ వీర్యం నుంచి పుట్టిన కుమారస్వామికి ఆరు ముఖాలు ఏర్పడి షణ్ముఖి అయ్యాడని వేరొకగాథ. శ్వేతశైలంలో రేత స్కందం చేయడం చేత ప్రభవించినాడు గనుక స్కందుడని, కృత్తికాఖ్యలైన మునిపత్నుల రూపాలు స్వాహాదేవి గ్రహించడంవల్ల కార్తికేయుడని పేర్లు వచ్చాయని ఈ గాథ చెబుతోంది.

కుమారస్వామి దేవసేనాపతి. శూరపద్మాసురుడనే రాక్షసుని ఇతడు వధించగా, ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి పరిణయం చేశాడు. శివముని కుమార్తె వల్లీదేవి ఇతని భార్యగా కొన్ని పురాణాలు ఉటంకించాయి.

స్కందుడు తారకాసురుని, అంధకాసురుని కూడా సంహరించాడు. రాక్షసవీరులు క్రౌంచపర్వతం మీద దాగి ఉండటంతో ఆ పర్వతాన్ని ఛేదించాడని వామనపురాణం చెబుతోంది. సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. నెమలి నర్తనం ఓంకార రూపం. ఇతడు ప్రణవరూపుడు. కోడిపుంజు ఇతని ధ్వజం. 'కో' ధ్వని ప్రణవసూచకమే. ఇది జ్ఞాన భానూదయానికి ఆధ్యాత్మిక సంకేతం. వేదంలో స్కందుని ప్రతిరూపం అగ్ని. ఆరుకోణాల చక్రం బహుముఖీన ప్రజ్ఞాసంకేతం. ఇతని చేతిలోని శక్తి ఇచ్చాజ్ఞాన క్రియాశక్తుల రూపం.

స్కందుడు దేవ సేనాధిపత్యం పొందిన షష్ఠిరోజు స్కందవ్రతాచరణాన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. అదే స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠి. తమిళనాట ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సామర్లకోట వద్ద స్కందారామంలోని శివలింగం కుమారస్వామిచే ప్రతిష్ఠితమని పురాణోక్తి, దీన్ని కుమారారామమని వ్యవహరిస్తారు.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు