ᐅమీరి-పీరి
అవసరమైతే ధర్మరక్షణకు అస్త్రధారణ చేయవచ్చా?
ధర్మయుద్ధాలు కూడ చేయవచ్చా?
గురు అర్జునదేవ్ సిక్కుల అయిదో గురువు. ప్రజల్లో సిక్కు గురువుల పట్ల పెరుగుతున్న ఆదరణ సహించలేని మొగలాయీ చక్రవర్తి గురు అర్జునదేవ్‌ని ఏదోవంక చూపి, కాలుతున్న పెనం మీద కూచుండజేసి, ఒంటిమీద వేడి ఇసుక పోయిస్తూ, క్రూరాతిక్రూరమైనరీతిలో మరణదండన విధించాడు.
గురు అర్జునదేవ్ ఎలాంటి బాధను, వ్యధను వ్యక్తం చేయకుండా దైవధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఆ హింస భరించాడు. ఆ తరవాత ఆయన నదిలో లీనమయ్యాడు. తన ఉత్తరాధికారిగా, కుమారుడు హరగోబిందజీని గురువును చేయమని ఆదేశించాడు. అదే ఆయన చివరి ఆదేశం.
గురు హరగోబిందజీ తన హయాములో సిక్కుల చరిత్రగతినే గొప్ప మలుపు తిప్పాడు. ఆయన స్వయంగా యుద్ధవిద్యలో నిష్ణాతుడై, తన శిష్యులు మహాయోధులుగా రాటుతేలేలా శిక్షణ ఇప్పించాడు. ఆయన ఇరుపక్కలా రెండు ఖడ్గాలు ధరించేవాడు. ఒకటి ప్రపంచ ధర్మరక్షణ (మీరి)కి, రెండోది దైవ ధర్మరక్షణ (పీరి)కి, ఆయన్ను చరిత్రకారులు మీరి-పీరి అని పిలిచేవారు.
గురు హరగోబిందజీ ప్రవేశపెట్టిన ధర్మయుద్ధ సంప్రదాయం చివరంటా కొనసాగింది. పదో గురువైన గురు గోబిందసింగ్ సిక్కు ధర్మానికి మెరుగులు దిద్ది పతాకస్థాయికి తీసుకువెళ్లారు. గురు హరగోబిందజీ మొగలాయీల మహాసైన్యాలతో తన కొద్దిపాటి సైన్యంతోనే తలపడి నాలుగు యుద్ధాల్లో విజయం సాధించడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర.
అవి జహంగీర్ పరిపాలన చేసిన రోజులు.
నూర్జహాన్ సలహాలతో చక్రవర్తి రాజతంత్రం నడిపేవాడు.
గురు హరగోబిందజీని చక్రవర్తి గ్వాలియర్ కోటలో ఏడాదికి పైగా బందీగా ఉంచాడు. సిక్కుల గురుభక్తి ఎంత గొప్పదంటే, వేల సంఖ్యలో దేశం నలుమూలలనుంచి సిక్కులు గ్వాలియర్ చేరుకుని ప్రతిరోజూ కోట చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కొన్నాళ్లు కోటపైనుంచి గురువును అధికారులు సిక్కులకు దర్శింపజేసేవారు. అనంతమైన భక్తి ప్రపత్తులతో సిక్కులు కోట బయట నిలబడి ప్రణామాలు చేస్తుండేవారు. అటు తరవాత గురువును చూపకపోయినా గురువును ఉంచారని భావిస్తున్న ప్రదేశం బయట భక్తితో మోకరిల్లేవారు.
చివరకు నూర్జహాన్ సలహాతో గురువును చక్రవర్తికి అతిథిగా కొన్నాళ్లు ఢిల్లీలో ఉంచారు. అదే సమయంలో జహంగీర్‌తో పాటు గురువు పులివేటకు వెళ్లినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక పులి అకస్మాత్తుగా చక్రవర్తి మీద దాడిచేసింది. తన ప్రాణాలు పణంగా పెట్టి ఆయన్ను రక్షించడంతో గురువుకు ఆ బంగారు పంజరం నుంచి విముక్తి లభించింది.
అనంతర కాలమంతా గురు హరగోబిందజీ సిక్కులను ధర్మయోధులుగా తీర్చిదిద్దటంలోను, హరగోబిందపూర్ అనే పట్టణ నిర్మాణంలోను గడిపారు. తరచుగా దేశ యాత్ర చేస్తూ గురు నానక్‌దేవ్ బోధల్ని ప్రజలకు వినిపిస్తుండేవారు. అవి అమృతచినుకుల్లా వారిని అబ్బురపరచేవి. కులమత భేదాలతో, అంతర్గత కుమ్ములాటలతో, నిరంకుశ విదేశీ పాలనతో విసిగిపోయిన ప్రజలు సిక్కుధర్మం పట్ల సులభంగా ఆకర్షితులయ్యారు. సిక్కుమతంలో ప్రలోభాలకు తావులేదు. ఎలాంటి బలవంతమూ ఉండదు. కేవలం సమసమాజం, దైవధర్మం, క్రమశిక్షణాయుత జీవితం పట్ల మక్కువ కలవారే సిక్కు ధర్మాన్ని అప్పటికీ ఇప్పటికీ స్వీకరిస్తున్నారు. సిక్కు ధర్మంలో త్యాగనిరతి, నిర్భీతి ప్రధాన లక్షణాలు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్