ᐅబోనాల వేడుక


బోనాల వేడుక 

సామూహిక భక్తి చైతన్యానికి, సామాజిక ఐక్యతకు చిహ్నాలుగా- జాతరలు, తిరునాళ్లు, ఉత్సవాలు, వేడుకలు ప్రకటితమవుతాయి. ఈ సంబరాలన్నీ ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంగా విలసిల్లుతాయి. ఈ సంవిధానంలోనిదే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకునే ఆషాఢమాస బోనాల సందడి. ఆషాఢ జాతరగా వ్యవహరించే ఈ సంబరాల్లో జానపదుల భక్తివిశ్వాసాలు అడుగడుగునా వ్యక్తమవుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ సమష్టి దైవారాధన కన్నుల పండువగా కొలువుతీరుతుంది.
వర్షకాలంలో వచ్చే ఆషాఢమాసం ప్రకృతిపరంగా ఎన్నో మార్పులకు నెలవు. అనేక రోగకారక పరిస్థితులు ప్రకృతిలో ఉంటాయి. ఈ స్థితిని తట్టుకుని, అన్ని ఆటంకాల్ని అధిగమించాలంటే గ్రామ దేవతల ఆరాధనే తరుణోపాయమని జానపదుల నమ్మకం. ఎల్లమ్మ (గ్రామం ఎల్లలో ఉండే అమ్మ), ముత్యాలమ్మ (ముక్తి ఇచ్చే అమ్మ), ఎల్లారమ్మ (ఎల్లరూ కొలిచే అమ్మ), పోచమ్మ (బ్రోచే అమ్మ), మైసమ్మ (మైసూరమ్మ-చాముండి)... ఇలా ఎందరో గ్రామ దేవతల్ని తమ నివాస ప్రాంత పరిసరాల్లో ప్రతిష్ఠించుకుని భక్తులు పూజలు నిర్వహించుకుంటారు. ఆషాఢంలో వారికి బోనాలు (అన్న ప్రసాదాలు) సమర్పించుకుంటారు. పదిహేనో శతాబ్దంలో భాగ్యనగరంలో ఏటా భారీ వర్షాలవల్ల కలరా వ్యాధి ప్రబలేది. వ్యాధి కారణంగా మృతి చెందేవారి సంఖ్య అంతూపొంతూ ఉండేది కాదు. గ్రామ దేవతలకు బోనాలు నైవేద్యంగా అర్పించడంవల్ల అంటురోగాలు తగ్గుతాయని ప్రజలు విశ్వసించేవారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఓ కమనీయ ఉత్సవంగా శోభిల్లుతోంది.

చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలోని జగదాంబికాలయంలో మొదట బోనాల వేడుక ప్రారంభమవుతుంది. ఘటం ఎదుర్కోళ్లతో ఈ సంబరాలకు శ్రీకారం చుడతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు వూరేగింపుగా అమ్మతల్లి ఆలయాలకు తరలివెళ్తారు. తమ మొక్కుబడుల్ని అనుసరించి పాత్రల్లో బోనాల్ని సిద్ధం చేస్తారు. పసుపు కలిపిన పవిత్ర జలాల్ని అమ్మవారికి సమర్పించే ఘట్టాన్ని 'సాకబెట్టుట'గా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాల్లో అమ్మతల్లికి ఇష్టమైన పదార్థాల్ని తయారుచేసుకుని ఓ బండిలో ఆలయాలకు తీసుకెళ్తారు. ఆ సందర్భాన్ని 'ఫలహారపు బండ్లు'గా పేర్కొంటారు. విలక్షణ వేషధారణతో, వైవిధ్యమైన నృత్య విన్యాసాలతో తప్పెట్లు, బాజా భజంత్రీల నేపథ్యంగా పోతరాజులు ప్రదర్శించే కోలాహలం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. భవిష్యత్తులో జరగబోయే అంశాల్ని వివరించే 'రంగం', అమ్మతల్లి ఆవహించిందని విశ్వసిస్తూ పోతరాజులకు సొరకాయ, గుమ్మడికాయలతో దిష్టితీసే 'గావుపట్టుట' వంటి అంశాలు కూడా ఈ సంబరాల్లో ముఖ్యభూమికను పోషిస్తాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోని బోనాల వేడుకలతో ఈ సంబరాలు పతాకస్థాయిని చేరుకుంటాయి. ఆషాఢ మాసంలోని ఆదివారాల్లో ఆర్భాటంగా ఈ జాతర వెల్లివిరుస్తుంది. లాల్‌దర్వాజ అక్కన్న, మాదన్న గుడిలో భక్తులు తుది బోనాల్ని సమర్పణ చేస్తారు. అమ్మతల్లిని పురవీధుల్లో వూరేగించే 'సాగనంపు'తో ఆషాఢ బోనాల సందడి పరిసమాప్తమవుతుంది. జానపదుల ఆరాధనా సంవిధానానికి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక... ఆషాఢ బోనాల వేడుక.

- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్