ᐅప్రార్థన





ప్రార్థన 

సృష్టిలో ఇతర జీవరాశులకు లేని ఒక అదృష్టం మనిషికి మాత్రమే ఉంది- తనకు మించిన ఒక మహాశక్తి విశ్వాన్ని నడిపిస్తున్నదని తెలుసుకున్న మనిషి ప్రార్థించడం కూడా తెలుసుకున్నాడు. ఎన్ని లోపాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని విపత్కర సంఘటనలు జరిగినా మనిషి ప్రార్థన చేయడం ఆపలేదు. ఆగలేదు. ఆగదు కూడా. విధిపెట్టే చిత్రహింసలకు చలించిపోయిన కొందరు విశ్వాతీతశక్తిపై నమ్మకం కోల్పోతుంటారు. అవే చిత్రహింసలు భరించిన భక్తులున్నారు. వారు తమకు మేలు జరిగినా, జరగకపోయినా ప్రార్థనను విడిచిపెట్టరు. 'విశ్వాన్ని భరిస్తున్న దైవం నా ఈ జీవనభారాన్ని మోసి నన్ను కాపాడతాడు' అనే నమ్మకం భక్తునిలో ప్రార్థనగా మారుతోంది. హృదయం నిశ్శబ్దమై అశ్రుత మంత్రధ్వానాలు చేయడం అత్యుత్తమ ప్రార్థన అంటారు పెద్దలు. గుండెలు చీల్చుకుని రాని అక్షరాలు పెదవులు పలికినా ప్రయోజనం ఏమిటి?
ఒక ఆలయానికి వెళ్లి మనం ప్రార్థన చేస్తాం. అది ప్రార్థన కాదు. మనలో కారుణ్యం, కృతజ్ఞత ఉత్పన్నమైనప్పుడు అస్తిత్వమే ఆలయమవుతుంది. మన గుండె దేన్ని స్పృశించి, స్పందించినా అది ప్రార్థన అవుతుంది. ఏ పని చేసినా ప్రార్థనే. ధ్యానంలోకి వెళ్లినప్పుడు మన జీవితమే కారుణ్యరస ప్రవాహం అవుతుంది. మరోలా జీవించలేం. ప్రతి వ్యక్తీ ఆ స్థితిలో ప్రార్థనగా మారతాడు. కృతజ్ఞతగా ప్రవహిస్తాడు.

జీవితం ఒక బహుమతి. అది ఏ వ్యక్తీ తనకు తాను సంపాదించుకోలేనిది. అడిగి పొందేదీ కాదు. ఈ విషయాన్ని మనం మరచిపోతుంటాం. మనలో కృతజ్ఞతాభావం ఉండదు. నాకు 'అది లేదు, ఇది లేదు' అని ఫిర్యాదు చేస్తుంటాం. జీవితంలో ఎన్నో వేల సుఖాలు కోల్పోతున్నామని విలపిస్తాం. బతుకు ఫిర్యాదుల పుస్తకంలాగా మిగులుతుంది. జీవితాన్ని అడగకుండా ప్రసాదించినందుకు కృతజ్ఞతాభావం కాస్త్తెనా ఉండదు.

మనం ఊపిరి పీలుస్తున్నాం. చూస్తున్నాం, వింటున్నాం, స్పృశించగలుతున్నాం, ప్రేమిస్తున్నాం, ప్రేమ పొందుతున్నాం. అటువంటి జీవితం అపురూప కానుక కాదా? ఇంకా దేనికోసం విశ్వసామ్రాజ్య చక్రవర్తిని అడగాలి?

భగవంతునిపట్ల ప్రేమవల్ల మనం వియోగదుఃఖాన్నుంచి పరిపూర్ణ సాయుజ్య ఆనందంలోకి ప్రయాణిస్తాం. అది అత్యున్నత ఆధ్యాత్మిక సాఫల్య శిఖరం.

అజ్ఞానం తెలివిహీనత కాదు. అమాయకత. జ్ఞానం అనేది అహంకారాన్ని పెంచే తెలివిహీనత. సూర్యుడు ఉదయిస్తున్నాడు, పక్షులు గానం చేస్తుంటాయి. పూలు పూస్తుంటాయి. మబ్బులు అందంగా పరిగెడుతుంటాయి. రాత్రివేళ ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతుంది. ఎవరి కారుణ్యం వల్ల? ఏ ఉద్దేశం లేకుండా నక్షత్ర ప్రదీప్త గగన మండలంవైపు, సూర్యాస్తమయం వైపు చూసినప్పుడు, ఏమిటి అడగగలం? ధనం కోసం, బలం కోసం, కీర్తి కోసం వాటిని అర్థించగలమా?

అద్భుతావహమైన ఈ అస్తిత్వం, పంచరంగుల సృష్టి మహోత్సవహేల... ఒక విశ్వశక్తి చేసే విశ్వ నృత్య సంరంభం... దీన్ని చూస్తుంటే మనసు నిండిపోవడంలేదా? చెట్టును పూలిమ్మని అడగగలమా? ఒక ఆలయానికి వెళ్లి ప్రార్థన చేస్తే దానివెనక ఏదో బలీయమైన కాంక్ష కనిపించడంలేదా? మనలోని మరుగుజ్జుతనం, కురూపితనం బయటపడటంలేదా? ఎవరినో ప్రార్థించడం ఎంతటి సౌందర్యవిహీనం? అడగకుండా ఈ జీవితాన్ని కానుకగా ఇచ్చినవాడు సమస్తాన్ని ఇవ్వకుండా తాను దాచిపెట్టుకుంటాడా? భగవంతుడు అంతటి సంకుచిత స్వభావం కలవాడా? కోరికల్ని దాటిపోవడమే భక్తి కాదా! అటువంటి భక్తి కలిగినప్పుడు భగవంతుని పాదాలే శరణ్యం కదా? కృతజ్ఞతలోనే హృదయం స్పందిస్తూ ఉండాలి జీవితాంతం!


- కె.యజ్ఞన్న