ᐅనీవు తప్ప





నీవు తప్ప... 

చెరువు దగ్గర నిలబడితే దాని వైశాల్యం ఎంతో తెలుస్తుంది. రాయిని పట్టుకుంటే (చూస్తే) దాని పరిమాణం ఎంతో తెలుస్తుంది. అలాగే మానవుని స్థితినిబట్టి అతడు ఎంతటివాడో అంచనా వెయ్యవచ్చు. సముద్రం దగ్గరో, పర్వతం దగ్గరో నిలబడితే దృగ్గోచరమయ్యేది అపరిమితమైన రూపంలో, పరిమితమైన పరిమాణమే. అంతేగాని సంపూర్ణ రూపం కనుక్కోవడం ఎవరి తరమూ కాదు. అలాగే భగవంతుని గురించి, అతని లీలల గురించి ఎలాంటి వారికైనా తెలిసింది తక్కువే. అందువల్లనే తమ తమ పరిజ్ఞానానికి తోచిన విధంగా భగవంతుని వూహించుకుంటూ ఉంటారు. భక్తి కొలదీ ఎక్కువ చేసి చెబుతూ ఉంటారు. తమ జీవితం సక్రమంగా సాగకపోతే తక్కువచేసి నిందిస్తూంటారు కూడా. ఎవరు పొగిడినా, తెగిడినా స్థిరమైనవాడు భగవంతుడు. అతడి గురించి వేదాలు 'ఒక్కడే ఈశ్వరుడు, సర్వత్రా, సమానంగా, సమస్థితుడై ఉండటాన్ని సాక్షాత్కరించుకున్నవాడు. ఉత్కృష్టమైన గతిని పొంది ఉన్నవాడు' అని వర్ణిస్తున్నాయి.
భగవంతుడు రాగద్వేష రహితుడు. ఎన్ని రకాలుగా వూహించుకున్నా అతడి లీలలు తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నారదుడు తన భక్తి సూత్రాల్లో అతడి గురించి చెబుతూ 'ఈశ్వరుడు (భగవంతుడు) ఇలాంటిది, అలాంటిది అని చెప్పనలవి కాని ప్రేమస్వరూపుడు' అంటాడు. అందువల్లనే తత్వం తెలిసినవారు నిలకడతో, నిశ్చలభక్తితో భగవంతుడినే శరణు వేడుతారు. అంతేతప్ప ఎంత ఉన్నత స్థితిలో (చక్రవర్తి అయినా) ఉన్నా మానవులను ఆశ్రయించరు. ఎందుకంటే ఎంతటివాడైనా మానవుడు, మానవ సహజమైన దోషాలు కలిగి ఉంటాడు అనే సత్యం తెలిసినవారు కాబట్టి. అందుకే పోతన, అన్నమయ్య లాంటి భక్తులెందరో రాజును ఆశ్రయించలేదు. తమ ప్రతిభను మానవమాత్రులైన రాజులకు అంకితం ఇవ్వలేదు. ఈ మనుజేశ్వరులకు ఇచ్చి ఆ బానిస కూడు తినడం కంటే ఆ భగవంతుడు దయతలచి ఏది ఇస్తే అదే మహాప్రసాదంగా భావించారు, స్వీకరించారు. ఆయన ధ్యానంలో తరించారు. ఐహిక సంపదలేవీ శాశ్వతం కాదని తెలిసినవారు కాబట్టే మహా సామ్రాజ్యాలను పాలించిన చక్రవర్తులు సైతం అంత్యకాలంలో భగవదన్వేషణ కోసం తపస్సు చేసేవారు.

అంతటి ఉన్నతమైన భగవంతుడిని చేరడానికి శరణాగతి తప్ప అన్యమార్గం లేదు. ఆ మార్గానికి ఆరు ఉపమార్గాలు. అందులో మొదటిది 'ఆనుకూల్యతా సంకల్పం' భగవంతుడి సృష్టి తీరును పరిశీలిస్తూ, అవగాహన చేసుకోవాలి. దాన్ని అంగీకరించడం. రెండోది. ఆయన వ్యతిరేకించిన దాన్ని విసర్జించడానికి 'ప్రాతికూల్య విసర్జనం' అని పేరు. తనకు ఏది కలిగినా భగవంతుడు ఇచ్ఛాపూర్వకంగా ఇచ్చినదే అని స్వీకరించాలి. 'తాను కోరుకున్నా కలగని వాటి విషయంలో, ఎదుటి వారికి ఇచ్చి తనకు ఇవ్వలేదు' అని భగవంతుని నిందించకుండా- అది తనకు ఇవ్వడం అతడికి ఇష్టం లేదు' అని తలచి దాన్ని విడిచిపెట్టాలి. ఇదీ 'ప్రాతికూల్య విసర్జనం' (ప్రయత్నం చేయకపోవడం పలాయన వాదం... అది అత్యంత హేయమైనది). మూడోది 'మహా విశ్వాసం' తన జీవన గమనాన్ని సక్రమంగా సాగించేవాడు ఆ అంతర్యామే అని విశ్వసించాలి. ఒడిలోని బిడ్డ ఏ చీకూచింతా లేకుండా 'అంతా తల్లే చూసుకుంటుంది' అనే ధీమాతో నిద్రించినట్లు భక్తుడు కూడా భగవంతుని మీద అదే విశ్వాసం ఉంచడమే- మహా విశ్వాసం. నాలుగోది 'ఆ స్వామిని చేరడానికి దగ్గరిదారి అతడిని ప్రార్థించడమే. ఆ దారి చూపేవాడూ ఆ భగవంతుడే' అనే భావన రావడం. పోతన 'నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోటి నెయ్యం, నాకు నీవే ప్రసాదించు' అని కోరతాడు. అదీ గొప్ప త్వావరణం. అయిదోది 'కార్పణ్య అనుసంధానం'. ఈ జగమంతా ఎవరి వలన జన్మిస్తుందో, ఎవరిలో లీనమవుతుందో, ఆది, మధ్య, అంతం లేనివాడు. సర్వం తానే అయినవాడు, జగతికి మూలకారణం ఎవరో అతడిని శరణువేడటం. ఆరో మార్గం 'ఆత్మ నిక్షేపం'. అంటే పూర్తిగా లొంగిపోవడం. గజేంద్ర మోక్షం సమయంలో గజేంద్రుడు ప్రాణ రక్షణ కోసం తన ప్రయత్నాలన్నీ చేసి ఓడిపోయాడు. అప్పుడు భగవంతుని పూర్తిగా శరణుజొచ్చాడు. బలంలేదు, ధైర్యం సన్నగిల్లుతోంది, ప్రాణాలు కడతేరిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది, నీవే తప్ప దిక్కెవరూ లేరు... కాబట్టి రావయ్యా! నన్ను కావవయ్యా'' అని ఆర్తిగా ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు దిగి వచ్చాడు. ఎలా ఉన్నవాడు అలాగ. అదే ఆత్మనిక్షేపం.



- అయ్యగారి శ్రీనివాసరావు