ᐅఆత్మసాక్షాత్కారం
చాలామంది సాధకులు, ధ్యానులు, విరాగులు సాధన ప్రారంభించాక లేదా ఏదో ఒక రోజున ఉన్నపాటున, ప్రపంచం మీద విసిగి వైరాగ్యంతో కానలకో, కోనలకో వెళ్లిపోతారు. సహజమే, వారిలో చాలామంది కొన్నేళ్ల తరవాత సాధారణ ప్రపంచంలోకి తిరిగి వచ్చి ఆశ్రమాలు స్థాపించుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోతారు! ఏమిటిది? ఎందుకలా?వారెన్నుకుని వెళ్లిన మార్గం సరైంది కాదనా? సంసారం (ప్రపంచం) మీద ఆశ చావకనా? వారు వద్దని తోసి, వదలి వెళ్లిపోయిన ప్రపంచంలోకి తిరిగి రావటానికి, అంతకుముందుకంటే అధికాధికంగా ప్రజలతో మమేకం కావటానికి కారణం ఏమిటి?
కారణం చాలా ఉదాత్తమైంది. లోకోత్తరమైంది. లోక కల్యాణ కారకమైంది. చిన్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లాంటి పదార్థాలను పిల్లలు తినేందుకు ఇష్టపడరు. అదే పెద్దయ్యాక వాటిలోని పోషకాలు, ఔషధీయ విలువలు తెలుసుకున్న తరవాత ఎంతో ఇష్టంగా తినటం ప్రారంభిస్తారు. తమ అనుభవాన్ని పిల్లలకు చెప్పి తినిపించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచాన్ని వదలివెళ్లి, తిరిగివచ్చిన మహాత్ముల విషయమూ అంతే. సంసార అపేక్ష సాధనకు ఆటంకమే. కానీ, విసర్జనీయం మాత్రం కాదు. ఈ ప్రపంచాన్ని సృష్టించిందీ ఆ భగవంతుడే. ఆయననే కావాలనుకున్నప్పుడు ఆయన సృజనను వద్దనుకోవడంలో అర్థం లేదు. కాకపోతే పన్నీరును పన్నీరులాగే తీసుకోవాలి; పాలలా కాదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధనకు ఉపకరణంగా ఈ ప్రపంచాన్ని స్వీకరించాలి. అప్పుడు ఈ ప్రపంచం త్యజ్యనీయం కాదు. పూజార్హం అవుతుంది.
మహాత్ములు సాధనానంతరం, ఆత్మ సాక్షాత్కారానంతరం ప్రపంచంలోకి తిరిగివచ్చే కారణం అదే. భగవంతుణ్ని అన్వేషిస్తూ వెళ్లిన సాధకుడు సాధనానంతరం భగవంతుడు అరణ్యాల్లోనూ, కొండ కోనల్లోనూ లేడని, ప్రపంచంలోని ప్రత్యణువులో ఉన్నాడనీ అర్థం చేసుకుంటాడు. తాను వదలి వెళ్లినది ప్రపంచాన్ని మాత్రమే కాదనీ, ఆ రూపంలో ఉన్న పరమాత్ముణ్ని కూడా అని గ్రహిస్తాడు. ఈ నరరూప నారాయణుని సేవించేందుకే 'మహాత్ముడిగా మారిన మామూలు మనిషి' తిరిగి జన జీవనంలో ప్రవేశిస్తాడు. తన తపోఫలాన్ని భగవంతుని ప్రీతిపాత్రమైన దరిద్ర నారాయణుల ప్రాపంచిక, పారమార్థిక ఉద్ధరణకు ధారపోస్తాడు. ఈ అవగాహన కలిగాక సాధకుడు ప్రపంచంలో ఉన్నా, అరణ్యంలో- ముక్కుమూసుకుని ఉన్నా ఒకటే. అందుకే రామకృష్ణులు 'ముందు భగవంతుని తెలుసుకోండి. తరవాత సంసారంలో ప్రవేశించినా అది మిమ్మల్ని బాధించదు. ముందు నూనె పూసుకుని ఆ తరవాత పనస పండు కోయాలి' అనేవారు. విద్యాబుద్ధులూ, వయసు, జ్ఞానం, నిగ్రహం కలిగిన పెద్దకొడుకుకు తండ్రి చిన్నతముళ్ల బాధ్యతను అప్పగించినట్లు- భగవంతుడు అమాయక, అజ్ఞాన సోదరుల ఉద్ధరణ బాధ్యతను తన మీద పెట్టాడనే భావనతో జ్ఞాని ఆ కర్తవ్యాన్ని శిరోధార్యంగా స్వీకరిస్తాడు. అన్నకు, తండ్రికి భేదం లేదు. అందుకే జ్ఞాని, ప్రపంచం వెంట పోలేమని వెళ్లిపోతున్న అమాయక సోదరులను పెద్దన్నలా సవ్యమార్గం వైపు దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఇటీవలి కాలంలో మహాత్ములు, గురువులు తమ తమ ఆశ్రమాల తరఫున విద్యాలయాలు, వైద్యాలయాలు, వేద పాఠశాలలు, గోశాలలు లాంటివీ స్థాపించి ప్రాపంచిక జీవనంలోనూ సువ్యవస్థను ఏర్పరచే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్రమాలు ఆధ్యాత్మిక సాధనలకు పట్టుకొమ్మలుగా మారాయి. ఉపయోగించుకునేవారికి కొంగు బంగారంగా ఉన్నాయి.
ఆత్మసాక్షాత్కారం పొందినవారు అరణ్యాల్లో ఉండిపోతే అమాయక, అజ్ఞాన సోదరుల సంగతేమిటనేది రామకృష్ణుల ప్రశ్న. ఈ కారణంగానే శిష్యుల నిర్వికల్ప సమాధిని ఆయన అభిశంసించేవారు. చెట్టు తాను పెరిగితే చాలదు, అందరికీ ఆశ్రయమివ్వాలి అనేది సృష్టికర్త కోరిక. అయితే ముందు చెట్టు తాను పెరగాలి. బలపడాలి. స్థిరపడాలి. అప్పుడు ఇతర జీవులకు ఆశ్రయాన్నిచ్చే స్థోమత వస్తుంది. సాధకులైనా అంతే. ముందు తాము భగవదనుభూతి పొందాలి. ఆ తరవాత ప్రపంచోద్ధరణకు ప్రపంచంతో మమేకం కావాలి.
- చక్కిలం విజయలక్ష్మి