ᐅమనమంతా ఒక్కటే!



మనమంతా ఒక్కటే! 

అన్నింటినీ సమదృష్టితో చూడాలంటే, లేక ఒక్కలా చూడాలంటే- మనం చూసేవాటిమీద ఇష్టాయిష్టాల్ని మనసులో బేరీజు వేసుకోకూడదు.
పరబ్రహ్మంనుంచే ఈ విశ్వం ఉద్భవించిందని చెబుతారు ఆదిశంకరులు తన గ్రంథం 'ఆత్మబోధలో. ఆత్మ సూర్యుడైతే మన స్వభావాలు ఆ సూర్యుణ్ని కప్పివేసే మేఘాలవంటివంటారు. వీటికి అతీతంగా చూడగలిగితేనే ప్రకాశించే అందరి ఆత్మలూ ఒక్కటే అన్న అవగాహన కలుగుతుంది.

ఒక వర్తకుడు కొయ్యశిల్పి దగ్గరకు వెళ్లి చందనం కర్రనుంచి కృష్ణప్రతిమను చెక్కిపెట్టమన్నాడు. మంచి గంధం చెక్కను అన్వేషించటానికి తనకు పదిహేనురోజులు గడువు కావాలన్నాడు శిల్పి. ఆ వ్యవధిలో తనకు సరైన చెక్క దొరకనందుకు చింతిస్తూ ఆ విషయం చెబుదామని వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. భర్త బయటకు పనిమీద వెళ్ళాడని కాసేపు నిరీక్షించమని చెప్పింది వర్తకుడి భార్య. అటూఇటూ చూస్తున్న శిల్పి దృష్టి గదిమూలగా పడి ఉన్న కర్రపై పడింది. దాన్ని తీసుకోవటానికి అనుమతి అడిగాడు శిల్పి. వర్తకుని భార్య సరేనంది. ఆ కర్రనుంచి కృష్ణప్రతిమను చెక్కాడు శిల్పి.

ఆ ప్రతిమను చూసిన వర్తకుడు ఆశ్చర్యపోయి శిల్పి పనితనాన్ని మెచ్చుకున్నాడు. ఇంతకాలంగా తమ ఇంట్లో మూలపడి ఉన్న కర్రనుంచి ఇంత చక్కటి బొమ్మ వచ్చిందంటే తాను నమ్మలేకపోతున్నానన్నాడు. తానేమీ గొప్పపని చేయలేదని ఆ కర్రనుంచి అక్కరలేని కలపను తొలగిస్తే అప్పుడా శ్రీకృష్ణ ప్రతిమ బయటపడిందని వినయంగా చెప్పాడు శిల్పి.

మనం కూడా ఆత్మకు అంటుకున్న వ్యర్థాలను తొలగిస్తే ఆ భగవత్‌స్వరూపం స్వయంప్రకాశంతో సాక్షాత్కరిస్తుందన్నది పెద్దల మాట.

'ఆత్మ అనంతం' అంటాడు గీతలో పరమాత్మ. సచ్చిదానంద స్వరూపమే ఆత్మ. శరీర మరణానంతరం ఆ ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకనే అది సత్. అది చైతన్యభరితం అంటే చిత్. అది కాలాతీతమైనది, అనంతమైనది. ఆనందస్వరూపిణి, పరిపూర్ణత సంతరించుకున్నది.

ఒక వ్యక్తిని ఆభరణమనుకుంటే అతని ఆత్మ ఆ ఆభరణంలో వాడిన స్వచ్ఛమైన బంగారం వంటిది. ఆభరణాన్ని చేయటానికి ఇష్టపడకపోయినా బంగారానికి వన్నె తగ్గదు. వంద నోటుకు మకిలి అంటుకున్నా దాని విలువ మారదు. అలాగే వ్యక్తి ఎలాంటివాడైనా అతని విలువ తరిగిపోదు. శంకరుల అద్వైత సిద్ధాంత సారమిదే!

ఆభరణంగా మారిస్తే బంగారానికో ఆకర్షణ కలుగుతుంది. ధరించటానికి యోగ్యంగా ఉంటుంది. మకిలితో నిండిన నోటును పరిశుభ్రపరిస్తే అది రెపరెపలాడుతూ మెరుస్తుంది. ప్రతి మనిషీ ఇలా యోగ్యతతో, స్వచ్ఛతతో ఉండాలని బోధిస్తుంది- మధ్వాచార్యుల ద్వైతం!

ఆ మహామహుల ద్వైత అద్వైతాల్లో వ్యత్యాసం లేదు. వాస్తవాన్ని వేరువేరుగా చెప్పారంతే! ఒకరిలో ఎటువంటి స్వచ్ఛతను కోరుకుంటున్నావో నీలో దాన్ని పెంపొందించుకొమ్మంటారు శంకరులు. తామెలాంటివారైనా మనల్ని కూడ వారిలా ఉండమనేవారితో వివాదపడకుండా రుజువర్తనతో మనం మెలగాలంటారు మధ్వాచార్యులు.

- తటవర్తి రామచంద్రరావు