ᐅసత్యదేవుని కల్యాణ దీప్తి
అన్నవరం గ్రామంలో పంపానదీ తీరంలో మెరిసే రత్నాచలంపై సత్యావతార రూపుడు, కలికల్మష నాశకుడు, సత్యదేవుడు, సత్యానంద స్వరూపుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి నిత్య పూజలు అందుకొంటున్నాడు.
సుమారు అయిదువేల సంవత్సరాలకు పూర్వం సూర్యవంశానికి చెందిన లక్ష్మీ నారాయణులు మానవాతీత రూపాల్లో రమాదేవి, సత్యన్నారాయణ స్వామిగా అక్కడ ప్రభవించారని చెబుతారు. వారిరువురూ అఖండ చక్రవర్తులై సత్యరాజ్య పాలన చేశారని, ఆ కాలంలో సంపూర్ణ సుఖశాంతులు విరాజిల్లాయని కథలు కథలుగా వర్ణిస్తారు.
ఈ సృష్టిలో అటువంటి పవిత్ర ఆత్మల సుఖశాంతి ప్రజ్వలిత అవస్థను సత్ ప్రధాన అవస్థ అని, జీవన్ముక్తధామం అని అంటారు. పుట్టుక ఏడ్పులతో గాక యోగబలంతో సంభవించేది. సృష్టి సత్య ధర్మాలు సుస్థిరంగా శోభిల్లేవి. అదే దేవీ దేవతా ధర్మం అని పిలిచేవారు. రాజు, ప్రజలు పరస్పర ప్రేమాదరణలతో ఆనందంగా పరిపూర్ణ జీవనాన్ని సాగించేవారంటారు.
అది సత్యయుగం. దేవీదేవతలు షోడశ కళాపూర్ణులు, వర్ణ, వర్గ భాషా భేదాలు లేవు. సహజంగా అంతా స్వధర్మనిష్ఠాపరులు. రమాసత్యన్నారాయణ రాజ్యం ఎనిమిది తరాలవరకు పూర్తిగా నడిచిందంటారు. అది సత్యనారాయణుడు అన్నాన్ని (భౌతిక ప్రపంచానికి) ప్రసాదించిన వరం. అందుకే అది అన్నవరం అయింది. అది స్వర్ణ సత్య రత్న ప్రభలతో మెరిసేది. అందుకే అది రత్నాచలం అయింది. ఇదీ అక్కడి క్షేత్రమహాత్మ్యాన్ని చాటే కథ.
జీవితాన్ని సౌందర్యమయం చేసేది సత్యమే. అందుకే వారు రమాసత్యన్నారాయణులుగా ప్రసిద్ధి కెక్కారని చెబుతారు.
సత్యన్నారాయణ వ్రతం లోక ప్రసిద్ధం. ఈ వ్రతానికి సత్యనిష్ఠ, దివ్యగుణాలను ధారణచేసి, సొంతం చేసుకోవడానికి వజ్ర సంకల్పం ఆవాహన చేయడమని అసలు అర్థం. ఈ వ్రతం అతి పవిత్రమైనది. ఈ వ్రత కథ నైమిశారణ్య తీర్థం వద్ద వినిపించింది. ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తే- మనసే నైమిశారణ్యం. నిమేషమంటే రెప్పపాటుకాలం. నిమేషకాలంలో ఎక్కడ ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో అదే నైమిష తీర్థం. మనస్సు నిర్జనారణ్యంగా మారినప్పుడు ఆత్మకు స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. సత్యం, క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహం, మధురమైన పలుకులు పలకడం, ఆనందం వంటి దైవీగుణాల సమూహామే తీర్థం. అన్నవరాన్ని, సత్యదేవుడి కల్యాణదీప్తిని భిన్నకోణంలో ఆవిష్కరించే ఈ వ్రతకథ స్కాంద పురాణంలోని కాశీఖండంలోనిది.
- కె.యజ్ఞన్న