ᐅలేమి పెద్ద కలిమి!




లేమి పెద్ద కలిమి! 

పేదరికాన్ని చాలామంది శాపంగా భావిస్తారు. కాని పారమార్థికులు ఇదే గొప్పవరంగా వర్ణిస్తారు. భౌతిక సంపద ఆధ్యాత్మిక ఉన్నతికి పెద్ద అవరోధమని చెబుతారు. రాజ్యాన్ని తృణప్రాయంగా భావించినందువల్లనే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. పేదవాడిగా ఉండటం ఒకవిధమైన వ్రతానుష్ఠానం వంటిది.
ప్రాపంచక భోగాలకు దూరంగా ఉండాలంటే పేదరికమే విహిత ధర్మమని వైదిక సంస్కృతి పేర్కొంది. లేమిలోనే వినయం, సహనం, సేవాగుణం, ప్రణాళికాబద్ధ జీవనం దాగి ఉంటాయి. లేనిపోని వ్యామోహాలు దూరమవుతాయి. ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావుల్లో అధికులు తమ బాల్యంలో దుర్భర దారిద్య్రం అనుభవించినవారే! ధనికులైన ప్రముఖుల్లో నెహ్రూ, ఠాగూర్ వంటివారు అరుదుగా కనిపిస్తారు.

సామాన్య జీవనంలోనే అసామాన్య ఆనందం దాగి ఉందని గ్రహించి ఒక మామూలు వ్యక్తిని నాయకుణ్ని చేసి మహాకవి కాళిదాసు మేఘసందేశాన్ని అద్భుత ప్రేమకావ్యంగా మలిచాడు. తనను తాను అనామకుడిగా భావించి 'ఒక అజ్ఞాత వ్యక్తిగా, ఇతరుల నుంచి ఒక్క కన్నీటి చుక్కా నేలమీద రాలకుండా మరణించాలని ఉంది' అని ప్రముఖ ఆంగ్ల కవి అలెగ్జాండర్ పోప్ ఓ కవితలో అంటాడు. అధిక సంపద అనర్ధహేతువుగా అర్థం చేసుకోవాలనీ వ్యాఖ్యానిస్తాడు. అక్రమ మార్గాల్లో ఆర్జించిన ధనం అంతిమంగా అంతులేని ఆవేదన మిగిలిస్తుంది. జీవితాంతం తీవ్రమైన ఒత్తిళ్లకు గురిచేస్తుంది!

నిరుపేద హాయిగా నిద్రించగలడు. ధనవంతుడికి ఐహిక సుఖాలు తప్ప ఆధ్యాత్మిక ఆనందం దక్కదు. కుబేరుని కుమారులు నలకూబరుడు, మణిగ్రీవుడు ధనమదంతో విర్రవీగుతూ మదవతి, మద్యపానమత్తులై నారదమహర్షిని అవమానిస్తారు. వారిద్దరినీ యమళార్జున వృక్షములుగా వందేళ్లు జీవించమని ఆ మహర్షి శపిస్తాడు. ఐశ్వర్య మదం వల్ల ఇలా బరితెగించామని కుబేరపుత్రులు పశ్చాత్తాపం ప్రకటించగా, బాలకృష్ణుడు రోటి సాయంతో మిమ్మల్ని పడగొట్టి శాపవిముక్తుల్ని చేస్తాడని నారదుడు అనుగ్రహిస్తాడు. ఇదే సందర్భంలో అధికారం, అధిక సంపదలు రెండూ వ్యక్తుల్ని అంధుల్ని చేస్తాయనీ, ఇవి వ్యక్తి, వ్యక్తిత్వ వినాశక శక్తులుగా ఆయన వ్యాఖ్యానిస్తాడు. దారిద్య్రం అన్వేషణకు నాంది. పురోగతికి పునాది! అందుకే లేమినే పెద్ద 'కలిమి'గా భావించాలి.

- కిల్లాన మోహన్‌బాబు