ᐅధర్మరక్ష
ధర్మాన్ని రక్షించటం ప్రతి ఒక్కరి విహిత కర్తవ్యం. కృతయుగంలో ధర్మం నాలుగు కాళ్ల మీద నిలబడిందంటారు పెద్దలు. పాపభూయిష్ఠమైన కలియుగంలో ఒంటికాలిమీద ధర్మం నిలబడి నిస్సహాయ స్థితిలో ఉందని, ధర్మరక్షణ చేయవలసిన బాధ్యత అందరిమీద ఉందని చెబుతుంటారు. త్రేతాయుగాన రావణాసురుడు, ద్వాపరయుగంలో దుర్యోధనుడు దుష్టత్వానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. మరి నేడు ఊరికో రావణుడు, వీధికో దుర్యోధనుడు అన్న చందంగా మారి ధర్మం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
మన సమాజం పాపపంకిలం అయిపోయిందని, దీన్ని ప్రక్షాళన చేయటం ఒక్కరితో అయ్యే పని కాదని ఎవరికి వారు నిస్తేజంగా ఉండిపోతే, వ్యవస్థ మరింత అధోగతికి దిగజారిపోతుంది. విశ్వవీణపై నాగరిక తంత్రులు మధుర మనోజ్ఞంగా మీటిన ఘనత భారతీయ దివ్య సంస్కృతిది. మానవ జాతి మహోన్నతంగా జీవించడానికి కావలసిన జీవన విధానాన్ని సుమనోహరంగా, స్ఫూర్తిభరితంగా అందించిన అజరామరమైన కీర్తి భరతజాతిదే!
ముందు యుగాల్లో ధర్మాన్ని ప్రభువులే రక్షించారు. ఆనాడు అమలులో ఉన్న రాజరిక పద్ధతుల ప్రకారం అది సరైనదే. అందుకు ఉదాహరణలు పురాతన ఇతిహాసాల్లో చాలానే మనకు లభ్యమవుతాయి. ధర్మాన్ని రక్షించి ప్రజలను పీడననుంచి దూరం చేసే సంఘటన ఒకటే మనకు మహాభారతంలో ద్యోతకమవుతుంది.
ఏకచక్రపుర వాసులను గడగడలాడిస్తూ, వాళ్లను చంపుకొని తింటున్న బకాసురుడి బారినుంచి వారిని రక్షించడానికి కుంతీదేవి యత్నిస్తుంది. బకుడికి ఆహారంగా భీముణ్ని పంపించడానికి సంకల్పిస్తుంది. ఆలోచన ధర్మరాజును ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 'అమ్మా! నీ ఆలోచన నా వివేచనకు అందకుండా ఉంది. లాక్షాగృహంనుంచి బయటపడినా, దుష్టులైన రాక్షసుల బారినుంచి తప్పించుకున్నా- దానికి కారణం భీముని భుజబలమే కదా! ఈ అవక్ర పరాక్రముని బకునికి ఆహారంగా పంపించడంలో ఆంతర్యం అర్థం కావడం లేదమ్మా' అంటాడు ధర్మనందనుడు.
దానికి కుంతీదేవి మందహాసంతో, 'నాయనా ధర్మరాజా! నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. బలవంతులైన రాక్షసులను అవలీలగా నిర్జించగల శౌర్యోపేతుడు భీముడు. అటువంటిది అతనిముందు బకుడెంత? అంతే కాదు. ధర్మంవల్ల కలిగే ధృతి భీమునికి తోడుగా ఉంటుంది... అందుకే జయం అతనిదే'నని చెబుతుంది.
ఇప్పుడు ప్రజలే ప్రభువులు, ప్రజలదే రాజ్యం. అంటే ధర్మరక్ష చేయవలసిన బాధ్యత అందరిదీ. చేసే ప్రతి కార్యాన్ని పరులకు హితం కలిగేలా చేయగలిగితే అది ఉత్తమ ధర్మం. భువన పాలన, ధర్మరక్ష ఆనాడు రాజుల హస్తగతమైతే, నేడా మహోన్నత విధి అధికారంలో భాగస్వాములమైన మన అందరి భుజస్కంధాలపైనా ఉంది. యుగయుగాన మంచిని మానవ మనుగడకు పరమ మంత్రంగా అభివర్ణించి, అణువణువునా రంగరించి వింగడించిన ఆధ్యాత్మిక గురువులెందరో పదేపదే అభిభాషించినదొక్కటే- అది ధర్మాన్ని కాపాడమని! అందుకే ధర్మబద్ధులమై నీతితో, నియతితో చరిద్దాం. పావన నవజీవన బృందావనంగా ఈ ధాత్రిని నిలిపి తరిద్దాం.
- వెంకట్ గరికపాటి