ᐅసద్గుణ సౌరభాల రమజాన్




సద్గుణ సౌరభాల రమజాన్ 

పవిత్ర రమజాన్ మాసమంతా దివ్యఖురాన్ పారాయణం చేస్తారు. ఈ ఉద్గ్రంథంలోని సూక్తుల్ని లోకశ్రేయం కాంక్షించే పండితులు జనులకు బోధిస్తారు. జీవితాన్ని అంధకార బంధురం చేసుకోవద్దని, భ్రాంతిశోకాల తెర ఎత్తివేయాలని వివరిస్తారు. మానవ హృదయం శాంతినికేతనమై, ఆనందనిలయమై, ఆధ్యాత్మిక భావాల కూడలిగా శోభిల్లడానికి దివ్యఖురాన్ దిశానిర్దేశం చేస్తుంది.
'తకాసుర్' అంటే ఐశ్వర్యాన్ని గడించడంలో పోటీపడటం. లోకంలో కొందరు సంపదలు సేకరించడంలో, సుఖాలు అనుభవించడంలో పోటీతత్వం అవలంబిస్తారు. అందుకు ఉచితానుచితాలు, స్నేహాలు బాంధవ్యాలు లెక్కచేయరు. ఎంత నీచానికైనా దిగ జారతారు. రాజులైనా పేదలైనా చివరకు చేరేది శ్మశాన వాటికకే. అలాంటి ముగింపు ఎవరికైనా తప్పదు. తుచ్ఛమైన ఐహిక భోగాలకు లోబడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఖురాన్‌లోని తకాసుర్ సూరహ్ (ఖురాన్‌లోని భాగం లేదా అధ్యాయం) హెచ్చరిస్తోంది. అల్లాహ్ కృపను పొందే సన్మార్గులు ఇలా ప్రవర్తించరు. ఎక్కువ మంచిని పరోపకారాన్ని చేయాలని అభిలషిస్తారు. నిన్నచేసిన తప్పులు నేడు చేయరు. పొరపాటున తప్పులు చేస్తే పశ్చాత్తాప పడతారు. ఆత్మవిమర్శ చేసుకొంటారు. సద్బోధనల్ని అనుసరించి విధులు నిర్వర్తిస్తారు. (తకాసుర్ సూరహ్, ఆయతుల సంఖ్య:8)

సూరహ్ ఆస్ర్‌లో పరమసత్యం ఒకటి సాక్షాత్కరిస్తుంది- అజ్ఞానాంధకారంలో అలమటించవద్దు. మానవులు రుజుమార్గంలో పయనించడం అవసరం. ఈ మార్గంలో పయనించే వారందరూ ఒకరికొకరు తోడుగా నిలవాలి. కాలగమనంలో మానవుల ప్రవర్తన వింతగా మారుతుంది. రుజుమార్గాన్ని విస్మరిస్తారు. వివిధ మార్గాల్ని అవలంబించడం ప్రారంభిస్తారు. ఎవరి మార్గాలు వారివి అవుతాయి. ఇతరుల్ని తమ మార్గంలో పయనించమని చెబుతారు. అలాచేయడంలో బలాత్కారం, హింసాప్రయోగం, వంచించడం, ఇహలోక సౌకర్యాలపై ఆశ కల్పించడం- ఉండరాదు. ఇవన్నీ మానవత్వ విహీన చర్యలు. విశ్వవిభుని దృష్టిలో క్షమించరాని దోషాలు.ముస్లిమ్ సమాజానికి అయిదువేళల నమాజ్ నిర్ణీతమైంది. రమజాన్ నెలలో తరావీ నమాజ్ అదనం. ఏ నమాజయినా హృదయ వినమ్రతతో చేయడం ప్రథమ ధ్యేయం. రమజాన్ నెలలోనే కాక ఎప్పుడైనా సామూహిక నమాజ్ కోసం అన్ని కోవలకు చెందిన ముస్లిములు సమావేశమవుతారు. దైవ ప్రవక్త సామూహిక నమాజ్‌ను తప్పనిసరి చేసి, సర్వసమానత్వాన్ని బోధించారు. రమజాన్ నెలలో చేసే దానాలు సమాజంలోని ఆర్థికఅసమానతల్ని వీలైనంతవరకు దూరంచేయడానికే. ఆ నెలలోచేసే ఉపవాసవ్రతం ప్రదర్శనాబుద్ధితోకాక, పశ్చాత్తాపంతో, పుణ్యఫలాపేక్షతో ఆచరిస్తే- ఉత్తమ ఫలితం దక్కుతుంది.

తల్లిదండ్రులు జీవితంలో తమ సంతానానికి ఎన్నో కానుకలు బహూకరించాలనుకుంటారు. మహాప్రవక్త బోధన ప్రకారం- ఉత్తమ విద్యాబుద్ధులు, సంస్కారవంతమైన నడవడి... ఇవే యథార్థమైన విలువైన కానుకలు. వీటికి ఎల్లలులేవు. సిరిసంపదలు లేకపోయినా విద్య, సంస్కారం, సత్ప్రవర్తన ఉంటే అవి గుండెలోని తమోగుణాన్ని తొలగిస్తాయి. ఇహ పరాల్లో సమస్తాన్ని సముపార్జించి పెడతాయి. సాధారణంగా ఐహిక సంపదలెన్ని ఉన్నా మనిషిలో ధన పిపాస అధికమవుతూనే ఉంటుంది. ఈ మోహ ప్రమాదంనుంచి రక్షణ అవసరం. ప్రాప్తించింది లేశమైనా దానితో తృప్తి చెందగలిగితే ప్రమాదంనుంచి బయటపడినట్టే. మహా ప్రవక్త(స) ప్రాపంచిక సంపదను తన వద్ద కొంతసేపైనా ఉండనిచ్చేవారు కాదు. అవసరార్థులకు పంచనంతవరకు ఏదో ఒక ఆందోళన ఆయన మనసులో ఉండేది. 'రేపటికి నేను దాచుకోలేదు' అనే సంతృప్తితో నిద్రపోయేవారు. తన సహచరులకూ అలాంటి తర్ఫీదు ఇచ్చి శోకమోహాల అపారసాగరాన్ని దాటింపజేశారు.

మంచి ఆహారం తినడం, కలిగిన మేరకు బట్ట ధరించడంలో తప్పు కనిపించదు. అహంకారం, గర్వం, వ్యర్థ వ్యయాలను దోషంగా పరిగణిస్తారు.

ఇవన్నీ- ఇస్లామ్‌లోని ధార్మిక, నైతిక ఔన్నత్యానికి చెందిన అంశాలు. ఖురాన్ సూక్తులు.


- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా