ᐅవార్ధక్యం సార్థక్యం
వృద్ధుడంటే ఎవరు?
మాజీ యువకుడు!- అన్నాడొక రచయిత.
జీవితంలో అనేక కష్టాలను నష్టాలను అనుభవించి, ఆ అనుభవాలతో పండిపోయిన జ్ఞాన, వయోవృద్ధుడు- తరవాతి తరాలవారిని విజయపథంవైపు నడిపించగల మార్గదర్శకుడు! 'ముఖమంతా ముడతలు ఆవహిల్లుతున్నాయి. తల అంతా నెరసిపోయింది. శరీరం శిథిలమైపోతున్నది. ఆశ మాత్రం జవ్వని వలె విజృంభిస్తున్నది' అన్నాడు భర్తృహరి. శరీరానికే వృద్ధాప్యంగాని, మనసుకు కాదుగదా! మనసుకే ముసలితనం వస్తే శేషజీవితం నిరాశావహమే! ప్రాణసమానులైన మిత్రులు స్వర్గస్థులవుతారు. తానా? మూడు కాళ్ల ముసలి. కర్ర లేనిదే నిలవలేడు. కన్నులా? మసగలు కమ్మి అగుపడటం లేదు! పౌరుషమా? బింకం చల్లారిపోయింది. అనుభవించాలనే కోరిక అడుగంటిపోయింది. ఇన్ని జరిగినా ప్రాణాలమీది తీపి మాత్రం అధికం అవుతూనే ఉంది!
ఆశ అనేది ఒక మహానదీ ప్రవాహం. కోరిక అనేది అందులోని జలం. అభిలాషలు తరంగాలు. అనురాగాలు మొసళ్లు. అజ్ఞానమనేది సుడులు! వయసుతో పాటు ఈ ప్రవాహం పెరిగిపోతే అందులో పడి ఆవేదనలతో కొట్టుకొనిపోక తప్పదు. వృద్ధులకు అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెరిగే వయసు, తరిగే ఆయుష్షు! ఒడ్డుకు చేరని ఊహలు, సిద్ధించని లక్ష్యాలు- ఇవన్నీ మానసిక సమస్యలను ఉత్పన్నం గావిస్తాయి. విషయానుభవాల మీద ఎంత మనసున్నా ఎప్పటికైనా అవి విడిచిపోయేవే. అలా అయినప్పుడు తానే వాటిని విడిచిపెడితే మంచిదిగదా! అవి మనల్ని విడిచిపెట్టిపోతే మనసుకు బాధ కలుగుతుంది. మనమే వాటిని విడిచిపెడితే మనశ్శాంతి కలుగుతుంది. ఈ ఆలోచన కలిగిన వృద్ధులు శేషజీవితానికి బంగారుబాట వేసుకున్నట్లే!
యౌవనం అనేది ఒక ఎర. తగలబెడుతుందని తెలియక మిడుత దీపంపై పడుతుంది. తెలియక చేప గాలానికున్న ఎరను తింటుంది. కుప్పలు తెప్పలుగా ఆపదలున్నాయని తెలిసీ మనసు వయసు మాయలో పడి విషయేచ్ఛలకు చిక్కుతుంది. అటువంటి ఆపదలకు మూలమైన ప్రాయం గడచిపోవడాన్ని వృద్ధులు సంతోషదాయక విషయంగా భావిస్తే, ఇక మానసిక రుగ్మతకు తావెక్కడ? ఇల్లు పెద్దది, కొడుకులు అణకువ గలవారు, సంపదలు అంతులేనివి, ఇల్లాలు మనసెరిగి నడచుకొంటుంది- ఇలాంటి ఊహలకు వృద్ధాప్యంలో తావు లేదు. కొడుకులు ఇల్లు ఆక్రమించుకుంటారు. సంపదలు సంతానం సుఖం కోసమే. ఇల్లాలు కోడళ్ల మనసెరిగి ప్రవర్తించాలి. చాలామంది వృద్ధులు గతించిన దినాలను తలచుకుంటూ గడపాల్సిందే. సాటివారితో సమానంగా సంపాదించలేదనో, పుత్రులు ప్రయోజకులు కాలేదనో కలతపడుతూ శేషజీవిత నౌకను నడపాల్సిందే.
భోగాలు మబ్బులో మెరిసే మెరుపుతీగల్లాగా చంచలమైనవి. జీవితం తామరాకు మీద నీటిబిందువు లాగా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆయువు తరంగంలాగా చంచలమైనది. ఈ సంసార సముద్రాన్ని దాటడానికి పరబ్రహ్మ సంసక్త చిత్తత ఒక్కటే మార్గం. అదే నిత్యసంతోషితుల్ని గావిస్తుంది. ఈ సంసారం నిస్సారం అని గ్రహించి, మనసును సమాధియోగంలో ఉంచడానికి వృద్ధాప్యం ఒక గొప్ప వరం. సత్సాంగత్యంతో, విషయవాంఛలకు సుదూరంగా, పరమేశ్వర ధ్యానంతో గడిపితే వృద్ధాప్యానికి సార్థక్యం ఏర్పడుతుంది.
- పి.భారతి