ᐅఆత్మవిశ్వాసం
ఏదైనా ఓ పనిని తలపెట్టినప్పుడు దాన్ని సాధించితీరాలనే కోరిక ఆరంభంలో అందరిలోనూ ఒకేలా ఉంటుంది. సాధ్యాసాధ్యాలు అనుభవంలోకి వచ్చేసరికి మధ్యలో జారిపోయేవాళ్ల సంఖ్యే ఎక్కువ. తుదివరకూ పోరాడేవాళ్ళను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందుకేనేమో అసలు ప్రయత్నించని వారిని అధములనీ, ప్రయత్నించి ఏదో వంకతో ఆ ప్రయత్నంనుంచి విరమించుకొనేవాళ్లను మధ్యములనీ, చివరివరకూ ప్రయత్నించి ఫలితాన్ని రాబట్టేవారిని ఉత్తములనీ పండితులు అభివర్ణించారు.
కార్యసాధకులకు కావలసిందల్లా కాసింత ఆత్మవిశ్వాసం, పట్టుదల. పట్టుదల ఉన్నా ఆత్మవిశ్వాసం లేకుంటే నిష్ప్రయోజనమే. మొక్కవోని ఆత్మవిశ్వాసంలోనే పట్టుదల, సహనం, ఇంద్రియ నిగ్రహశక్తి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి.
ఒక సర్వసంగ పరిత్యాగి ఆరునెలలపాటు కఠోర తపస్సు చేసినా దైవానుగ్రహం కలగకపోవడంపట్ల కలత చెంది తన ప్రయత్నంలో లోపమేమైనా ఉందేమోననే అన్వేషణలో పడ్డాడు. ఆ అడవిలో కొంతదూరం ప్రయాణించేసరికి అతనికి చెట్టుచాటున నక్కి ఉన్న ఓ కిరాతుడు కనిపించాడు. ఏం చేస్తున్నావని తాపసి అడిగాడు. 'ఏదైనా జంతువో, పక్షో దొరక్కపోదా అని మాటువేసి చూస్తున్నా సామీ' అన్నాడు వేటగాడు వినయంగా.
చీకటి పడటంతో ఇద్దరూ కిరాతుడి గుడిసెకు చేరుకున్నారు. రోజూ ఉదయాన్నే అతడితో అడవికి వేటకు వెళ్ళడం, గంటల తరబడి మాటువేయడం, ఏదీ దొరకక వట్టి చేతులతో తిరిగి రావడం నిత్యకృత్యమైపోయింది. కానీ, ఏ రోజూ ఆ కిరాతుడు మొహంలో నిస్పృహగానీ, నిరాశగానీ ఇసుమంత కూడా కనిపించలేదు తాపసికి. ఏరోజుకారోజే ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే వేటకు బయల్దేరే వాడి మొహం చూసి తాపసికి మతిపోయింది. ఇక ఉండబట్టలేక వాడిని ఓరోజు నిలదీశాడు.
'నీకు అలా రోజంతా మాటువేసి నిరీక్షించినా ఒక్క జంతువుగానీ, కనీసం ఓ పక్షిగానీ వేటకు దొరకటంలేదు కదా. మరి నీకు కొంచెం కూడా బాధగా లేదా? బతుకుతెరువుకు వేరే మార్గం ఎంచుకోలేకపోయావా?'
దానికి వేటగాడు, 'బగమంతుని దయ నామీద ఏనాడుంటుందో ఆనాడే ఏట. నాకు ఏదీ దొరకని నాడు నాపై సామికి దయ కలగలేదనుకుంటా' అన్నాడు నవ్వుతూ.
తాపసికి తన సాధనలో లోపమేంటో కొంత అర్థమైంది. సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యాహ్నవేళకు ఓ సరస్సు చేరుకున్నాడు. దాహార్తియై ఉన్నప్పటికీ అతణ్ని అక్కడి దృశ్యం కట్టిపడేసింది. సరస్సు ఒడ్డున నీళ్ళు తాగడానికి వచ్చిన ఓ నక్క నీటిలో తన ప్రతిబింబం చూసుకొని, మరో జంతువేదో అనుకొని భయపడి కొంతదూరం పారిపోయి, మళ్ళీ ఒడ్డుకు వస్తోంది. ఇలా రెండు మూడుసార్లు జరిగాక ఒక్క ఉదుటున నీటిలోకి దూకేసింది. నీటిలో అంతవరకూ నిశ్చలంగా ఉన్న దాని ప్రతిబింబం చెల్లాచెదురై నీటిలో మాయమైపోయింది. నక్క ధైర్యంగా, హాయిగా దాహం తీర్చుకుంది. ఆ దృశ్యంతో తాపసికి పూర్తిగా జ్ఞానోదయమైంది. తాను ఎంతో నిష్ఠగా తపమాచరించినా ఆ వేటగాడికున్న సహనం, అంతకంటే ముఖ్యంగా అతని అచంచల ఆత్మవిశ్వాసం తనకు కొరవడ్డాయని అర్థమైంది. దైవానుగ్రహం ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుందని ఇన్నాళ్ళూ తనకు స్ఫురించనందుకు సిగ్గుపడ్డాడు. ఇప్పుడీ నక్కలాగే తాను కూడా 'ఆధ్యాత్మిక చింతన' అనే సరస్సులోకి దిగకముందు 'నేను-నాది' అనే భావంతోనే ఉండేవాడు. కఠోర తపమాచరించినా తన అస్తిత్వాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. కానీ, పరిపూర్ణ ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో భగవధ్యానంలో మునిగేవాడికి సర్వం భగవత్స్వరూపమేనని తెలిసి వచ్చింది.
తనను తాను శోధించుకున్నవాడికి తన బలాలూ బలహీనతలూ అవగతమవుతాయి. బలాలను బలోపేతం చేసుకుని, బలహీనతలను అధిగమించడమే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతో తనను తాను ఆవిష్కరించుకున్నవాడికి సాక్షాత్కరించేదే బ్రహ్మస్వరూపం.
- బోదెం భాస్కర్