ᐅనీకే అంకితం




నీకే అంకితం! 

కష్టకాలంలో భగవంతునికి 'మీదు' కట్టడం అనేది భారతీయుల సంప్రదాయాల్లో ఒకటి. దీన్నే ముడుపు కట్టడమనీ అంటారు. దేన్ని ముడుపు కడతారు? ధనాన్ని, ధాన్యాన్ని, వస్తువుల్ని, తలనీలాల్ని, జంతువుల్ని... ఏదైనా కావచ్చు. గ్రామాల్లో దున్నపోతుల్ని, గ్రామదేవతల పేరు మీద మీదు కడతారు. దైవం పేరుమీద స్వేచ్ఛగా వదిలేస్తారు. ఇలా మీదు కట్టిన వస్తువుల్నిగానీ, ధనాన్నిగానీ, జీవుల్ని గానీ మరో పనికి ఉపయోగించరు. భగవంతునికి అర్పించేంతవరకూ పవిత్రంగా, భద్రంగా కాపాడతారు. గ్రామాల్లోని పశువులనైతే అవి ఏ చేనుమీద దాడి చేసినా, ఏం తిన్నా ఎంత తిన్నా ఎవరూ అడ్డగించకూడదు. తోలకూడదు. కొట్టకూడదు. స్వేచ్ఛగా, రాజసంగా అవి ఊరి మీద పడి తిరగాల్సిందే. ఇక తలనీలాలైతే పొరపాటున కూడా తల (జుట్టు) మీద కత్తి పెట్టకూడదు. బావుంది. మంచి సంప్రదాయం. భగవంతుని పేరు మీద సకామంగానే అయినా కొన్నింటిని ప్రేమగా, నిజాయతీగా అర్పించడం శ్రేష్ఠమైన ఆచారం. అయితే ఇన్నింటిని భగవంతునికి మీదు కడుతున్న మనం మన జీవితాలను ఆయనకు ముడుపుకడుతున్నామా?లేదు. ఎందుకు? జీవితం భగవంతునికి మీదు కట్టవలసినంత విలువైంది కాదనా? లేక మీదు కట్టవలసినంత అల్పమైంది, స్వల్పమైంది కాదనా? నిజానికి ఈ జీవితం ఆయన ఇచ్చిందే కదా? మనం భగవంతుడికి ఏం నైవేద్యం పెట్టినా, ఏది ముడుపు కట్టినా ఆయన ఇచ్చిందనే స్పృహతోనే పెడతాం. మరి మన జీవితం, ప్రాణం అయన ఇచ్చినవే కదా? బహుశా మనిషికి భయం కాబోలు. తన మీద తనకే అపనమ్మకం కాబోలు. ఎందుకంటే ఆయనకు అర్పించాక ఆ వస్తువును లేదా ఆ జీవిని, జీవితాన్ని అతి పవిత్రంగా, మాలిన్యరహితంగా ఉంచాలి. మరి మన జీవితాన్ని మనం అంత అప్రమత్తంగా, అన్యవినియోగ రహితంగా, అతి పవిత్రంగా ఉంచగలమా, నిలువరించగలమా, నిభాయించగలమా- లేమా? అందుకే అంత భయమా?
ఔను. అందుకే. అంతేగాక ఏ ప్రయోజనాల్ని ఆశించి అతి విలువైన జీవితాన్ని, జీవిత ఆసాంతాన్ని ముడుపు కట్టాలి? మరేం పనులుండవా? మన ఎంతో విలువైన ధన, ధాన్య, వస్తు జంతుజాలాన్ని ఏదైనా మీదు కడుతునే ఉన్నాం కదా? మొక్కులు చెల్లిస్తూనే ఉన్నాం కదా? కోరికలు తీరేందుకు, తీర్చుకునేందుకు ఆ రూపంగా అవకాశం ఉండనే ఉన్నప్పుడు అత్యంత అపురూపమైన మన జీవితాన్ని పూర్తిగా మన స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అననుకూలంగా, భిన్నంగా ఆయనకే ముడుపు కట్టవలసినంత అవసరం ఏమొచ్చింది? ఇదే అమాయకత్వం. భగవంతుణ్ని కాదని మనకు ప్రత్యేక జీవితం ఉందా? పనిఉందా? మన స్వేచ్ఛకు ఆయన ఆటంకమా? నిజానికి మన జీవితాల్లో భగవత్ స్పృహరహిత, ప్రమేయ రహిత కార్యాలు కాదు కదా- క్షణాలైనా ఉన్నాయా? మనం భగవత్‌స్పృహ రహిత జీవితం ఉండాలనుకోవడం అలాంటిదే. నిజానికి మనం ఆలోచించవలసింది 'ఆయనకు మీదు కట్టేందుకు తగిన అర్హత మన జీవితానికి ఉందా' అని మాత్రమే. అయినా సరే, తల్లి చెంత చేరేందుకు బిడ్డ దేహానికంటిన మాలిన్యం ఎప్పుడూ ఆటంకం కాదు.

మనం మన జీవితాలను భగవంతుడికి మీదు కడతాము. అప్పుడు మన జీవితంలో గడిచే ప్రతిక్షణం ఒక జేగంటలా మోగుతుంది. మనం చేసే ప్రతి పనీ భగవంతుని పూజావిధిలా మారుతుంది. మన ప్రతి మాటా మంత్రమై ఆయనను చేరుతుంది. నడిచే ప్రతి అడుగూ ప్రదక్షిణై ఆయనకు దగ్గర చేస్తుంది. మనం తినే ప్రతి అన్నకణం నైవేద్యమై ఆయనను తృప్తిపరుస్తుంది. మన నిద్ర ధ్యానమై ఆధ్యాత్మిక భూమికలను అధిరోహింపజేస్తుంది. మన కన్నీరు పన్నీరై అభిషేక జలమైపోతుంది. మన ఉచ్ఛ్వాసనిశ్వాసలు వింజామరలై, పంచప్రాణాలు పంచహారతులై ఆయనను సేవిస్తాయి. మనలోని షట్చక్ర కమలాలు మంత్రపుష్పాలై అర్చిస్తాయి. మొత్తం మన జీవితం, జీవితంలోని ప్రతిక్షణం, ప్రతి చర్యా షోడశోపచార పూజలా మారి, భగవంతునికి కైంకర్యమైపోతాయి. అందుకే మనం జీవితాన్ని భగవంతునికై మీదు కట్టి ఉంచాలి. అప్పుడు దాన్ని ఆషామాషీగా కాకుండా అతి పవిత్రంగా, అత్యంత విలువైందిగా, మెలకువగా, మలిన రహితంగా వినియోగించగలుగుతాం. సార్థకం చేసుకోగలుగుతాం.

- చక్కిలం విజయలక్ష్మి