ᐅఅరవింద దర్శన దీప్తి
భారతదేశం మృణ్మయ శకలం కాదు. అజరామర శక్తి, ఒక దేవత. ఒక ఆధ్యాత్మిక మహత్వం. భరతమాత వూహ కాదు. ఒక అలంకారం కాదు. అశేష జన చైతన్య రూపంతో ప్రభవించిన ఒక అద్భుత దేవీస్వరూపం.
భారతదేశం అందించే ఆధ్యాత్మిక సహాయం కోసం, జగద్రక్షత శాంతి కోసం, కాంతి కోసం, ప్రపంచమంతా ఆశతో ఎదురుచూస్తోంది. ఈ సమయంలో భారతావని తన ఆధ్యాత్మిక వారసత్వ సంపదను తృణీకరించడం వైపరీత్యం తప్ప మరొకటి కాదు.
హిందూ ధర్మం ఒక మతం కాదు. ఒక పిడివాదం కాదు. తత్వసూత్రాల విరామాల సమాహారం కాదు. సామాజిక నియమావళి కాదు. కాని- ఒక మహోజ్జ్వల, చిదంబర విశ్వజనీన సత్యం. భగవంతుని అనంత అస్తిత్వంలో సాయుజ్యం చెందడానికి మానవాత్మను సంసిద్ధం చేసే రహస్యం దానికి తెలుసు. అన్ని మతాలను తన కౌగిలిలోకి తీసుకొనే విశ్వజనీనతత్వం హిందూమతం సొంతం. ఈ ప్రపంచం ఏమిటో చెప్పే మతం ఇది. జీవితంలోని ఏ అల్ప భాగాన్నీ విడదీయలేని ఉదాత్త ధర్మం అది. అమృతత్వం అంటే ఏమిటో తెలిసిన మతం, మన నుంచి మృత్యువును పారద్రోలే మతం అది.
తనకు అప్పగించిన శాశ్వతమైన తేజస్సును ప్రపంచంపై వెదజల్లడానికి భారతదేశం మేలుకొంటోంది. మానవాళి కోసం భారతావని దివ్య ఔన్నత్యాలవైపు ఎగబాకాలి. భారతీయ ప్రజ్ఞకు ఆధ్యాత్మికత అత్యంత కీలకమైనది. సత్యం అనంతం అన్న భావన ఈ జాతి నరనరాల్లో ఉంది. హేతువు పాలించిన యుగాల్లో, అజ్ఞానం జడత్వం ఆవరించిన శతాబ్దాల్లో సైతం తన అంతర్ దృష్టిని కోల్పోలేదు ఈ జాతి. బాహ్యమైన వెలుగులో జీవితాన్ని సర్వసమగ్రంగా దర్శించలేమని భారతావని సృష్ట్యాదిలోనే గ్రహించింది. భౌతికానికి అతీతంగా ఉన్నదానికి సంబంధించి, సరైన శ్రేణితో నిలబడకపోతే, భౌతికానికి పూర్ణ పరమార్థం ఉండబోదన్న విషయం ఈ జాతికి తెలుసు. ఈ ప్రపంచం ఇప్పటికీ అర్థం కాని ప్రణాళికే. మనిషి విప్పలేని ముడులు, కీలక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. విశ్వంలోనూ, మనిషిలోనూ ఎన్నో శక్తులున్నాయి. దృశ్యమానమైన వాటి చుట్టూ అదృశ్యమైనదేదో ఆవరించి ఉంటుందని, అతీంద్రియమైనదేదో ఇంద్రియాలను చుట్టుకొని ఉంటుందని, పరిమితమైన ప్రపంచాన్ని అల్లుకొని ఉంటుందని భారతజాతికి తెలుసు. తనను తాను అతిక్రమించే శక్తి మనిషికి ఉంది. తాను ఉన్న స్థితికి మించి, మరింత పూర్ణప్రగాఢ వ్యక్తిత్వంగా మారవచ్చుననీ మనకు తెలుసు. అద్భుతాలు చేయగల అతీత మానవశక్తి, విశ్వాసాలు భారతజాతికి ఉన్నాయి. మానవాళి మధ్య భగవంతుడు తేజరిల్లాలి. భగవంతునిలో మానవాళి ఆనందంగా జీవితం గడపాలి. భారతజాతి అసలు ఆదర్శం అదే. ఇదీ అరవిందులు దర్శించిన మాతృవేద భూమి భారతి.
- కె.యజ్ఞన్న