ᐅగలుపే లక్ష్యం




గలుపే లక్ష్యం 

క్రీడాజగత్తులో ప్రతీ క్రీడాకారుని లక్ష్యం ఒక్కటే- గెలుపు. దృష్టి చెదరనీయడు, ఏకాగ్రత సడలనీయడు. వేసే ప్రతి అడుగును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించుకుంటూ ముందుకెళతాడు. గెలుపు సాధించాడా, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత సంబరపడిపోతాడు. ఓటమి పొందితే మరింత పదునైన వ్యూహ నిర్మాణంతో గెలుపు కోసం శ్రమించే తత్వం కలిగి ఉంటాడు. ఇది సమర్థుడైన క్రీడాకారుడి తత్వం.
అలాగే నూరేళ్ల జీవితం ఓ గొప్ప క్రీడ. సాహసమే ఊపిరిగా, సమర్థతే జీవంగా ఉండి జీవితాన్ని పూలబాటగా మలచుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించే దిటవుతనం అలవరచుకోవాలి. జీవితాన్ని పండించుకోవాలి.

ఇది అందరి విషయంలో సాధ్యపడేనా? సాధ్యాసాధ్యాల స్థితిగతులు మనోస్త్థెర్యంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్కరి చిత్తప్రవృత్తి ఒక్కో రకంగా ఉంటుంది. ధైర్యంతో, చొరవగా ముందడుగు వేస్తారు కొందరు. భయం, సందేహం, సందిగ్ధత, పిరికి మనస్తత్వం కలిగి ఉంటారు మరికొందరు. నిజానికివి పరిస్థితుల ప్రభావంవల్లనో, పుట్టిపెరిగిన వాతావరణాలవల్లనో సంక్రమించేవే కానీ- సహజాతాలు కావు.

మానవజన్మనే మహాభాగ్యంగా భావించాలి. జీవితాన్ని అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకునే నేర్పు, ఓర్పు అవసరం.

ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరి అభిరుచి మేరకు వారు శక్తిమేరకు తీర్చిదిద్దుకుంటారు. సౌకర్యవంతంగా దాన్లో ఉండేందుకు ఇష్టపడతారు. ఇదే శ్రద్ధ జీవనయానంలోనూ ఉండాలని గుర్తెరగాలి.

నిరాశ నిస్పృహలంటూ- బాధ్యతల రాపిళ్లంటూ- ఏకాకి జీవితాలంటూ కునారిల్లడం అవివేకం. వాటిని తొలగించుకునేందుకే బుద్ధి, వివేకం ఉన్నాయి. 'బంధాలు తెగిపోయాయ్. నిరాదరణకు గురవుతున్నాను. సమస్యల సుడిగుండాల్లో కూరుకుపోతున్నాను. వృద్ధాప్యాలు శాపాలుగా మారుతున్నాయ్' అంటూ నిర్వేదానికి గురికావడం సహజమే జీవనచక్రగతిలో.

ఓ అగాధం పక్కనే ఎత్త్తెన శిఖరమూ ఉంటుంది. ఎంతటివారికైనా సమస్యలు తప్పవు. అసలు ఆ మాటకొస్తే సాఫీగా ఒకేలా సాగిపోయే జీవితం కొన్నాళ్లకు నిస్సారమనిపించక మానదు. మార్పుకోసం మనసు తహతహలాడుతుంది. ఎండలకు ఎండిపోయి మోడువారిన చెట్లు రుతువు మారగానే కొత్తగా వచ్చిన ఆకులతో మిలమిలలాడతాయి.

పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు. ఉండాల్సింది సరైన ఆలోచన. కాలాన్ని, మార్పును అధ్యయనం చేసుకుంటూ సమస్యను అధిగమించే చాతుర్యం కలిగి ఉండటమే.

ఆత్మహత్యలకు, అలజడులకు గురికాకూడదు. జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటే, ఆపై ఉండేదేమిటి, సాధించేదేమిటి? అవమానాలు ఎదురవుతున్నాయని కుమిలిపోతూ కొంతమంది జీవితాన్ని చీకటిగదిలా చూస్తారు. అవమానాలు ఎదురైన చోటనే ప్రశంసలు పొంది తీరాలన్న మనోధైర్యం ఉండాలి. చెప్పడం తేలికే. అందరికీ సాధ్యమేనా?

ఒక్కసారి చరిత్రగతిని ఊహించండి.

శిథిలాలపైనే ఎన్నో మహా నిర్మాణాలు జరిగాయి. మహాక్రౌర్యాలు దాడిచేస్తే- మానవత్వపు పరిమళాలు గుబాళించే విజయకేతనాలు ఎగరేసిన సందర్భాలున్నాయి.

భరతభూమి ఎన్నో దాడులను సహించింది. ఎన్నో విదేశీ దౌష్ట్యాలను భరించింది. శాంతి, అహింసలనే ఆయుధాలుగా చేసుకొని పరిఢవిల్లడంలేదా? జాతినేతలు ఎన్ని అవమానాలకు, ఆరళ్లకు బలైనా లక్ష్యాలను సాధించిన ధీరులుగా చరిత్రలో నిలిచిపోలేదా! నంద రాజులు ఎంత ఘోరంగా అవమానించారు కౌటిల్యుణ్ని! తిరిగి తన ప్రజ్ఞాపాటవాలతో చంద్రగుప్తుణ్ని సామ్రాజ్యాధీశుని చేయలేదా! అంతెందుకు! నేడు మనం చూస్తున్న వివిధరంగాల్లోని నిష్ణాతుల్లో చాలామంది ఏ అడ్డంకీ ఎదుర్కోకుండానే ఆశించిన స్థాయికి చేరారా? ఎన్నో కడగండ్లు, దుర్భర దారిద్య్రం, అవమానాలు పొందినా నిలదొక్కుకొని విజయసోపానాలు అధిరోహించినవారే ఎక్కువ మంది.

'సాధనా పాటవం-ప్రజ్ఞకు పదును'- రెండు పార్శ్వాలుగా ఉంటూ జీవితాన్ని సాగిపోనివ్వడమే ధ్యేయంగా ఉండి తీరాలి. అప్పుడు అంతరిక్షమే అరచేతిలో గోచరమవుతుంది.

జీవితం ముళ్లబాట. ముందుకు వెళ్లేదెలాగని చింతిస్తూ కూర్చునేకంటే- మార్గాన్ని నిష్కంటకం చేసుకునే ప్రయత్నాలు ఆరంభించడం ధీరుల లక్షణం. అటువంటివారి బతుకు మార్గం పూలబాటగా మారుతుంది.

నిశ్చల బలోన్నతులు ఎంతటి కార్యాన్నైనా చక్కబరుస్తారు. జీవితాన్ని దిద్దుకుంటారు.

అపురూపమైంది జీవితకావ్యం. షడ్రుచుల మిళితమైన మృష్టాన్న భోజనం. అందంగా మలచుకోవడం- అవరోధాలనుంచి గట్టెక్కడం మన చేతుల్లోనే ఉంది.

- దానం శివప్రసాదరావు