ᐅశ్రావణ పూర్ణిమ




శ్రావణ పూర్ణిమ 

భారతీయ నాగరికతకు ప్రామాణికమైనవి వేదాలు. అవి దేవతలు ప్రసాదించినవి తప్ప, మానవమాత్రులు రచించినవి కావు. అందుకే వాటికి 'అపౌరుషేయాలు' అని పేరు. విశ్వశ్రేయోదాయకమైన మహావిజ్ఞానం వేదాలు. వాటికి అధిదేవత గాయత్రీమాత అని శాస్త్రాలు చెబుతున్నాయి.
జపించువారిని (గాయంతం) రచించునది (త్రాయతి) కాబట్టి గాయత్రి అని వ్యుత్పత్తి. సకల హృదయాల్లోనూ బుద్ధిప్రేరణ చేసేది గాయత్రీ మంత్రమని అని స్మృతివచనం. కాబట్టే గాయత్రీ మంత్రానికి మించినది లేదు అని నానుడి. శ్రావణ పూర్ణిమనాడు ఆమె ప్రీత్యర్థం చేసే జప, హోమ, ధ్యానాదులు ఉత్తమ ఫలితాలనిస్తాయని, వాటిని నిర్వహించడానికి దీక్షా సూచనగా యజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రవచనం. వేదాధ్యయనానికి, వేదోక్తకర్మలు ఆచరించడానికి, విద్యాభ్యాసానికి నియమబద్ధులుగా చేసే సూత్రంగా దీన్ని భావించాలి. దీన్ని ధరించినవారు ధైర్యం, ఓర్పు, దయ, ఆస్తేయం, శుచి, ఇంద్రియనిగ్రహం, బుద్ధి, విద్య, సమత్వం, శాంతం అనే పది గుణాలనీ అలవరచుకుని ఆదర్శప్రాయుడు కావాలని శాస్త్రవచనం. ఇన్ని నియమాలతో నిబద్ధుణ్ని చేసే యజ్ఞోపవీతధారణ తప్పనిసరిగా శ్రావణ పూర్ణిమనాడు చేయాలని శాస్త్రనియమం. అందువల్లనే ఈరోజుకు జంధ్యాల పున్నమి లేక శ్రావణి అని పేరు వచ్చింది. వేదాధ్యయనం మొదలుపెట్టే ఛాత్రులు ఈరోజునే ఉపాకర్మ అనే క్రియ జరుపుతారు. ఈ క్రియ వేదాధ్యయనాన్ని ఆరంభిస్తున్నాడు (ఛాత్రుడు) అని సూచిస్తుంది. ఇది వేద సంప్రదాయానుయాయుల నియమం.

పురాణ సంప్రదాయానుయాయులు సైతం నియమబద్ధతకు నిదర్శనంగా సూత్రాన్ని ధరిస్తారు. దీనిపేరు రక్షాబంధనం. 'సర్వరోగాలు, అరిష్టాలు ఉపశమించాలంటే ఏదైనా ఉపాయం ఉందా?' అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడట. ఆ మాటకు జవాబుగా శ్రీకృష్ణుడు 'ఆదిశక్తి స్వరూపిణి అయిన స్త్రీ చేతులతో రక్షాబంధనంగా సూత్రాన్ని బంధిస్తే, అది సర్వారిష్టాలను అడ్డుకుంటుంది' అని చెప్పాడని పురాణ కథనం. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మాధుర్యానికి ప్రతీక ఈ రక్షాబంధనం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆ శక్తినుంచి లభించే రక్షణ దేవతలందరి రక్షణతోను సమానం. అందువల్లనే కుటుంబ సభ్యులందరిలోను అతి సాన్నిహిత్యం కలిగిన సోదరి చేతితో ఈ రక్షాబంధనం కావాలని కోరుకుంటారు. ఆమె కట్టిన ఆ రక్ష అనేక అరిష్టాలను పోగొడుతుందని అనాదినుంచీ వస్తున్న నమ్మకం.

దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగే యుద్ధానికి వెళుతున్నప్పుడు శచీదేవి ఇంద్రుని చేతికి రక్షాబంధనం కట్టిందని, అందువల్లనే విజయం సిద్ధించిందని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణ కథనం. రక్షగా చేతికి తోరం కట్టించుకునేవారికి యమదూతల భయం ఉండదని యముడు తన సోదరి యమునతో చెప్పినట్లు భవిష్యోత్తరపురాణం వెల్లడిస్తోంది.

మహారాష్ట్రులు ఈ రోజున వరుణదేవుడి అనుగ్రహం కోరుతూ సముద్రుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. అందువల్ల ఈ రోజుకు నారికేళపూర్ణిమ లేదా నార్లీపూర్ణిమ అని పేరు వచ్చింది. ఆంధ్రప్రాంతంలో ఉపన ఆచారం ఉన్నవారందరూ జంధ్యాలు (యజ్ఞోపవీతాలు) ధరిస్తారు కాబట్టి జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 'పౌవతి పూర్ణిమ'గా వ్యవహరిస్తారు.

దక్షిణాదిన, గుజరాత్, ఒరిస్సా, బెంగాల్‌లలో విస్తృతంగా జరిపే ఈ పండుగకు ఇతర రాష్ట్రాల్లో అంత ప్రాచుర్యం లేదు. సర్వవిద్యలకూ ఆధారభూతుడైన హయగ్రీవ జయంతి సైతం నేడే.

- అయ్యగారి శ్రీనివాసరావు