ᐅరమజాన్ దాన ప్రాశస్త్యం
అందమైన మానవ హృదయమే జగత్తు శుభప్రదమై శోభిల్లడానికి దోహదం చేస్తుంది. సంస్కార హీన హృదయులు అమానుషమైన ఆలోచనలకు వారి హృదయాల్లో తావు కల్పిస్తారు. ఫలితంగా సమాజహితానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది. ఈ ప్రతిబంధకాన్ని ఛేదించడానికి మనుషుల్లో ఉదాత్తభావాలు పెంపొందాలి. ఇందుకు రమజాన్ నెల రోజులు ప్రతి సంవత్సరం ముస్లిమ్ సమాజానికి మహత్తర శిక్షణ లభిస్తుంది. దీనివల్ల ఆధ్యాత్మిక గమనం విశాలమవుతుందని, విషయ వాసనాభారం దూరమవుతుందని, త్యాగభావం బలపడుతుందని ఇస్లామ్ పవిత్ర ఆశయం.
మహాప్రవక్త దానశీలతను ప్రబోధించారు. దానివల్ల హృదయాల్లో త్యాగం, సానుభూతి, సహనం వర్ధిల్లుతాయి. పొరుగువాడు పూటకు పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తుంటే నీవు సుఖంగా జీవితం గడపడం మానవత్వం కాదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవాలి. నీ సంపాదనలో కొంతభాగం వారికిచ్చి ఆదుకోవాలి. వారి బతుకుల్లో వెలుగులు నింపాలి. అప్పుడే జీవనయానానికి అర్థం, పరమార్థం- అని ఇస్లామ్ ప్రబోధం.
నిజాయతీగా నిష్కపటంతో దానం చేయనట్లయితే అది కపటదానం అవుతుంది. అక్రమ సంపాదననుంచి దానం చేయడం ఇలాంటిదే. ఇది ఇస్లామ్ ఎంతమాత్రం అంగీకరించదు. సహించదు.
'ఫిత్రా' పేరిట నిర్ణీతదానం రమజాన్ మాసంలో పేదలకు ప్రతిఒక్కరు చెల్లించాలి. ఉపవాసకాలంలో వ్రతం పాటిస్తున్న వ్యక్తివల్ల పొరపాటున ఏదైనా నియమోల్లంఘన జరిగితే- ఫిత్రాదానం ఆ లోపాన్ని పూరిస్తుంది. ఈ దానంవల్ల పేదల పండుగ అవసరాలు తీరతాయి. ఫిత్రాను పండుగకన్నా వారం రోజులు ముందే ఇవ్వాలి. వారు నూతన వస్త్రాలు, పండుగ సామగ్రి కొనుక్కోగలుగుతారు. ఫిత్రా దానం చెల్లించనంతవరకు రమజాన్ ఉపవాసాలు ఫలప్రదం కావని చెబుతారు. ఈ దానం గ్రహించడానికి నిరుపేదలైన ముస్లిములేకాదు, ముస్లిమేతరులూ అర్హులే. ఇతరుల ఆనందం కోసం పరితపించడమే ఉత్తమమైన ఆనందమనే సూక్తికి, సామాజిక న్యాయానికి జీవం పోసినట్లవుతుందని సైతం ఇస్లామ్ భావన.
ఫిత్రాకాక, రెండో అంశం జకాత్ దానం. ఇది సంపన్నులు చేయడానికే ఉద్దేశించింది. సంవత్సరం పొడవునా వ్యక్తివద్ద నిలువ ఉన్న ధనంలో నిర్ణీతశాతం విధిగా దానం చేయాలి. అన్నదానం, దుస్తులు, ధనసహాయం దేవుని కానుకగా తోటి బలహీనసోదరులకు, నిస్సహాయులకు అందజేయాలి. 'జకాత్' అంటే అరబ్బీ భాషలో పరిశుద్ధపరచడం, అభివృద్ధిపరచడం అని అర్థం. సమీప బంధువులకు, బీదసాదలకు, నిరాధారులకు, రుణగ్రస్తులకు, అనాథలకు, బాటసారులకు సహాయం అందజేయడంతోపాటు, మంచికోసం పాటుపడేవారిని ప్రోత్సహించడానికి బానిసలకు విముక్తి కలిగించడానికి సైతం జకాత్ దానాన్ని వినియోగించవచ్చు. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయపరచండి- అని దివ్య ఖురాన్ ఉపదేశం.
సత్కార్యాలన్నీ, ప్రధానంగా సత్యధర్మాల ఉన్నతికోసం జరిగే పనులన్నీ దైవమార్గాలే. విశ్వప్రభువుపేర సత్కార్యాలకు చేసిన దాత ధనం పరిశుద్ధమవుతుంది. అభివృద్ధి గడిస్తుంది. అలాచేయకపోతే అతనివద్ద ఉన్న సమస్త ధనసంపత్తి అశుద్ధమైనదవుతుంది. జకాత్ దానం గుప్తంగా ఉండాలి. బహిర్గతం చేయాల్సిన అవసరం, స్థితి ఏర్పడితే అలా చేయొచ్చు. జకాత్ చెల్లింపులకు శుభప్రదమైన రమజాన్ మాసాన్నే ఎంచుకొంటారు. ఈ మాసంలో చేసే సత్కార్యాలకు అత్యధిక పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. ఏ ప్రాంతపు జకాత్ ధనాన్ని ఆ ప్రాంతంలోనే వ్యయపరచడం మంచిదని భావిస్తారు.
చేసే ప్రతి మంచిపని దైవం కోసమే- అనే పవిత్రభావనతోనే ఆశించిన ఫలితం దక్కుతుంది. అంతేకాని కృతిమస్తుతులకోసం, కొనితెచ్చుకొనే గౌరవం కోసం ఆరాటపడితే అది సృష్టిలో, దేవుని దృష్టిలో క్షమించరాని నేరం. పరులను బాధించడంవల్ల ఉపవాస వ్రతాలు, దానాలు వ్యర్థమవుతాయి. ప్రతి ముస్లిమ్ అమలిన నిష్ఠతో జీవితం గడపడమే రమజాన్ ధార్మిక విధి. అంతా అవగాహన చేసుకొన్న ముస్లిమ్ దైవేచ్ఛ ప్రకారం జీవితం గడపడంలోనే శ్రేయం ఉందని మనసా వాచా గ్రహిస్తాడు. దుష్కృతాలకు దూరంగా ఉండిపోతాడు. సత్యం, ధర్మం, దయ, ప్రేమ, సదాచారం, సుహృద్భావాలకు ప్రతీకగా నిలుస్తాడు. లోకోపకార ఆలోచనలకు మనిషి తన ఎద తలుపులు తెరవాలి. స్వార్థంనుంచి, దుఃఖాలు కడగండ్లనుంచి మానవాళిని ఉద్ధరించే దిశగా పయనించాలి. అప్పుడే అతడు నిజమైన మానవుడు, దైవభక్తుడు.
నిస్వార్థ భావం, త్యాగం, దయ, నీతి, సంఘసేవవల్లనే పవిత్రత లభిస్తుందని, విశ్వంభర ఒడిని మానవుడు శాంతి, సద్గుణాల రతనాలతో నింపితే చాలని రమజాన్ భావిస్తుంది.
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా