ᐅవరించి వరాలిచ్చే లక్ష్మి
ప్రపంచగతిని నిర్వహించే పరమేశ్వరుడు- తన విభూతులతోనే దీన్ని ఏర్పరచి, నడిపి, తనలో లయం చేస్తున్నాడు. విశ్వేశ్వరుని విభూతియే విశ్వం. 'విభూతి' అనే పదానికి 'ఐశ్వర్యం' అని అర్థం. 'సామాన్యం'గా అంతటా ఈ ఈశ్వరశక్తి (విభూతి) వ్యాపించి ఉన్నప్పటికీ, 'విశేషం'గా కొన్నిటిలో భాసిస్తుంది. దాన్ని 'గొప్పది'గా భావించి గౌరవిస్తాం. ఆ గొప్పతనమే 'వరం'. ఆ విభూతియే 'లక్ష్మి', సృష్టిలో ప్రతివారూ ఆశించే ఆ 'గొప్ప ఐశ్వర్యశక్తి'నే 'వరలక్ష్మి'గా ఉపాసించి తరించే సత్సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరచారు.
'చంద్రా' అనే పేరు లక్ష్మీదేవికి ఉంది. 'ఆహ్లాద స్వరూపిణి' అని దీని అర్థం. పూర్ణచంద్ర కళాపర్వమైన పూర్ణిమకు ముందు వచ్చే, లక్ష్మీ ప్రధానమైన శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతానికి మహర్షులు ఎంపిక చేశారు.
భృగు ప్రజాపతికి పరాశక్తి పుత్రికగా ఉద్భవించి, నారాయణుని చేపట్టింది. అందుకే ఆ తల్లికి 'భార్గవి' అని పేరు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా వ్యక్తమైనా- అన్ని సంపదలూ పరమేశ్వరుడైన విష్ణునివే అనే సత్యాన్ని చాటి చెప్పేందుకే సాగర మథనంనుంచి ఆవిర్భవించిన లక్ష్మిగా హరిని వరించింది.
భగవంతుని ఆ కృపే లోకాన్ని లక్షిస్తోంది (చూస్తోంది). ఆ చూపుల చలువే లోకాలకు కలిమి. ఆ తల్లి లోకాన్ని చూస్తుంటే, ఆ తల్లినే లోకం చూస్తోంది. ప్రతివారి 'లక్ష్యం' ఐశ్వర్యమే కదా! ఆ ఐశ్వర్యం ఈశ్వర కృపే కదా! అందరికీ లక్ష్యమైన దేవి, అందరినీ 'లక్షిం'చే శక్తి- 'లక్ష్మి'.
సూర్యుని ఆశ్రయించిన కాంతిలా, పరాత్పరుని ఆశ్రయించిన ఈ శక్తినే 'శ్రీ' అన్నారు.
లక్షణశక్తి, లాభ స్వరూపం... ఈ రెండింటినీ కూడా 'లక్ష్మి' అంటారు. సృష్టిలో దేని లక్షణం దానికి ఐశ్వర్యం.
ఎవరికి, ఎంత, ఎప్పుడు, ఎలా అవసరమో గమనించి తగిన విధంగా అందించే ప్రకృతి స్వరూపమే లక్ష్మి.
సర్వజగతికీ మూల స్వరూపం కనుకనే ఆమెను 'ప్రకృతి' అన్నారు. మట్టి అనే మూలధాతువు వివిధ వస్తువులుగా అయినట్లే- ఈ మూలప్రకృతే వివిధాకారాల జగతిగా వ్యక్తమవుతున్నందువల్ల ఆ శక్తిని 'వికృతి' అని కూడా అన్నారు.
క్షీరసాగరంనుంచి వెలువడిన ఈ తల్లి దివ్యమూర్తిని ఇంద్రాది దేవతలు ఆరాధించారని పురాణ కథనం. ఇంద్రుడు నవరత్న ఖచిత స్వర్ణపీఠాన్ని ఏర్పరచగానే- దిగ్గజాలు స్వర్ణకలశాల్లో దివ్యజలాలను నింపి, వాటితో అమ్మవారిని అభిషేకించాయని శాస్త్ర వర్ణన. ఇలా అభిషేకంచే ఆర్ద్రమైన అమ్మ రూపాన్ని ధ్యానిస్తే మనోదారిద్య్రాలు సైతం తొలగి, సర్వసంపూర్ణ సంపన్నత లభిస్తుందని ఉపాసనా శాస్త్రవచనం.
లక్ష్మీదేవికి 'ఆర్ద్రా' అనే పేరుంది. 'శ్రీ సూక్తం'లో ఈ నామం కనిపిస్తుంది. దయతో ఆర్ద్రమైన సౌశీల్య దివ్యదీప్తి లక్ష్మి. ఆర్ద్రతే ఆదిలక్ష్మి. ఈ ఆర్ద్రత ఉన్నచోటనే శోభ, సౌందర్యం, కళ, వైభవం. ఇవి ఆ తల్లి కిరణాలు.
ఆ తల్లి ఎవరిని వరిస్తుందో వారే ధన్యులు. 'తగిన వారు' అని ఎంపిక చేయడమే, 'వరించడం'. అలా అమ్మచే ఎంపికై యోగ్యమైన సంస్కారం కలవారే సిద్ధులు. 'పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారే తరిస్తారు' అనే ఉపనిషద్ వాక్య భావన ఇదే. ఆ విధంగా తరింపజేసే భగవత్‌కృపే 'వరలక్ష్మి'.
ఇంద్రాదులచే పూజలందుకున్న ఆ జగజ్జనని నారాయణుడి హృదయంలో కొలువుతీరింది. విష్ణు సంకల్ప, దయాస్వరూపిణిగా ఆయన వక్షమందున్న ఆ తల్లిచూపు వల్ల దేవతల దౌర్భాగ్యం తొలగింది. అమృతం ప్రాప్తించింది.
జగదాంబ కటాక్షం లభిస్తేనే అమృతత్వం సిద్ధిస్తుంది.
సత్పురుషులను ఆ కటాక్షం వరిస్తుంది!
- సామవేదం షణ్ముఖశర్మ