ᐅఏది సంపద?
ఆనందం అనేది ఏమేమి పొందామనేదానికన్నా, ఏమేమి వదులుకున్నామన్నదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు మహాత్మాగాంధీ. ఇది బాగా అర్ధం చేసుకోవాలంటే మనం విశ్వామిత్రుడి కథ గురించి ఆలోచించాలి.
రామాయణంలో విశ్వామిత్రుడి కథ చాలా ఆసక్తికరమైంది. ఆయన అసలు పేరు కౌశికుడు. ఒక రాజ్యానికి ప్రభువు. ఆయన ఒకసారి వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కామధేనువు 'శబల' విషయంలో ఘర్షణ పడతాడు. వివాదం ముదురుతుంది. కౌశికుడు బల ప్రదర్శనకు తెగిస్తాడు. అటు వైపు ఒక్క వసిష్ఠ మహర్షి- ఇటు కౌశికుడితో పాటు వందమంది ఆయన కొడుకులు, చతురంగ బలాలు.
ఆ యుద్ధంలో కౌశికుడి- ఒక కొడుకు మినహా మొత్తం అందరూ నాశనమైపోతారు. అతనికి సిగ్గేస్తుంది. తపోబలం ముందు, ఆధ్యాత్మిక బలం ముందు- శరీర బలం ఎంత అల్పమైనదో అతడికి అర్థమవుతుంది.
అతడు మహోగ్రమైన తపస్సు చేసి సమస్త అస్త్ర విద్యలూ సాధిస్తాడు. ధనుర్వేదాన్ని కైవసం చేసుకుంటాడు. ఆ శస్త్రాస్త్ర సంపద కూడా- వసిష్ఠుడి బ్రహ్మదండం ముందు దిగతుడుపు అవుతుంది. కఠోరమైన తపస్సుతో ఎన్నోఏళ్ల సాధనతో కష్టపడి తాను సాధించిన ఇంతటి సంపద- ఆధ్యాత్మిక బలం ముందు తీసికట్టు అయ్యేసరికి... కడకు విశ్వామిత్రుడికి జ్ఞానోదయమవుతుంది.
తరవాత ఏళ్లతరబడి మరింత తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకుంటాడు. చివరిలో తాను సంపాదించిన అస్త్ర సంపదనంతా శ్రీరాముడికి ధారపోస్తాడు. పోస్తూ ఒక గొప్ప మాట అంటాడు-
'నాలో ఇంతటి అహంకారాన్ని పెంచి పోషించిన ఈ అతిపెద్ద సంపదను నీకు ధారపోసి- నా బరువును దించుకుంటున్నాను' అని.
మనిషి బయట శత్రువులను జయించడం కన్నా, తన లోపలి శత్రువులను జయించడానికి ఎక్కువ కష్టపడాలి. ఆ శత్రువుల్లో ముఖ్యమైనది అహంకారం. తన దగ్గర కొన్నివేల అస్త్రాలుండీ- అహంకారం అనే ఒక్క శత్రువును విశ్వామిత్రుడు నిర్జించలేకపోయాడు. అలాంటప్పుడు అంతటి సంపద ఉండీ ఏమిటి ప్రయోజనం?
ఆ ఆలోచనే విశ్వామిత్రుణ్ని విరాగిని చేసింది. రుషిగా, మహర్షిగా, దేవర్షిగా, చివరికి బ్రహ్మర్షిగా తీర్చిదిద్దింది. రుషి అయ్యాడు కనుకనే అంతగొప్ప వాక్యం చెప్పగలిగాడు.
ఎత్తుకోవలసింది కాదు- సంపదనేది దింపుకోవలసిందట! అహంకారాన్ని పెంచి పోషించే ఏ సంపదైనా అంతేమరి. సద్వినియోగం కాని సంపద ఎంతటిదైనా అంతే.
సంపదవల్ల ఆధ్యాత్మిక బలం పెరగాలేగాని లోపలి శత్రువులు పెరగకూడదు. అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలను సృష్టిస్తాయి. ఆధ్యాత్మిక నేపథ్యం లేనిచోట అదనపు సంపద తప్పకుండా చేటు తెస్తుంది. సద్వినియోగం చేసే సామర్థ్యం లేనప్పుడు అతిగా సంపాదించడం కూడా ప్రమాదమే!
సంపాదన ద్వారా సాధించిన వస్తువులకు మనం యజమానులం అవుతున్నామని అనుకుంటాం- కాని, నిజానికి... బానిసలం అవుతున్నాం.
ఆధ్యాత్మికత- నిరుపేదను సైతం ఆనందానికి యజమానిని చేస్తుంది. సంపద- ధనవంతుణ్ని సైతం బానిసను చేస్తుంది.
కనుక అసలైన సంపద ఏది అంటే, ఆధ్యాత్మికతే అసలైన సంపద!
ఆధ్యాత్మికత ఒక్కటే మనిషి నిత్యజీవితంలో కళాత్మక వైఖరిని ప్రవేశపెట్టి- ఆనందమయమైన మనుగడను ప్రసాదిస్తుంది. అందంగా జీవించడం నేర్పుతుంది.
ఆధ్యాత్మికత అనేది అద్భుతమైన జీవ రసాయనం. ఆధ్యాత్మికత అంటే మతం కాదు, అది ఒక నాగరికత! మనిషిని ఉన్నత శిఖరాలకేసి ప్రయాణానికి ప్రోత్సహించే చైతన్యం.
- ఎర్రాప్రగడ రామకృష్ణ