ᐅరమజాన్ పర్వదినం
పుడమిపై నరులు ఏ భేదభావానికీ చోటివ్వక సమస్త మానవాళికీ ఉపకారం చెయ్యాలి. ధనంకోసమో, కీర్తికోసమో, మరి దేనికోసమో పాకులాడకుండా వినిర్మల జీవనం స్థాపించుకోవాలి. సుగుణ సంపదను గడించాలి. ధర్మవర్తనులుగా నలుగురికీ ఆదర్శంగా నిలవాలి. ఇవన్నీ ప్రపంచ జనుల్ని మంచి మార్గంలో నడిపించే మణిదీపాలు- అని నెల్లాళ్లుగా రమజాన్ బోధించింది. నేడు రమజాన్ పర్వదినం. ముస్లిమ్ హృదయాల్లో ఆనందాలు, ఆహ్లాదాలు విరబూసే శుభ సమయం.
ఫిత్రాపేరిట నిర్ణీత దానం రమజాన్ మాసంలో ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా చెల్లించాలనే నిబంధన పాటించాం. దానం వల్ల మానవుల్లో సానుభూతి, త్యాగం, కరుణ ఇనుమడిస్తాయి. ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఫిత్ర్ అంటే ఉపవాసాలు విరమించడం లేదా పరిసమాప్తి చేయడం. 'ఈదుల్ ఫితర్' అంటే రమజాన్ ఉపవాసాలు ముగించి ఆనందించే రోజు. ఇదే పవిత్ర రమజాన్ పర్వదినం. 'రమజాన్' పదం అరబ్బీ భాషలో 'రమ్జ్' ధాతువునుంచి ఏర్పడిందంటారు. రమ్జ్ అంటే కాలడం, తపన చెందడం అని అర్థం. పాపాలన్నీ ఈ నెలలో భస్మమవుతాయని ఇస్లామ్ విశ్వాసం కనుక రమజాన్ పేరు సార్థకమైంది.
రమజాన్ దివ్య ఖురాన్ అవతరించిన నెల. తన దాసుల ఆరాధనలకు ఎన్నో రెట్లు ప్రతిఫలం అల్లాహ్ అందజేసే నెల. వెయ్యి రాత్రుల కంటే శ్రేష్ఠమైన రాత్రి 'లైలతుల్ ఖద్ర్' అరుదెంచిన నెల. దానాలు ఇవ్వాలనే ఆదేశాన్ని అందరూ పాటించిన నెల. సృష్టికర్త సాన్నిధ్యాన్ని పొందడానికి ఆయన ప్రసన్నతను చూరగొనడానికి ఉద్దేశించిన ఏతేకాఫ్ (మౌనవ్రతం) పాటించిన నెల. ఇంతటి మహత్తర రమజాన్ నిస్సందేహంగా వరాలిచ్చి దాసులను పులకింపజేసే రమణీయ మాసం. మస్జిద్‌లు అన్నీ నెల పర్యంతం అపురూపంగా పవిత్రతతో ఆధ్యాత్మిక సోయగాల నిలయాలై శోభిల్లాయి. ఒకే దైవం - దాన ధర్మం - పరుల క్షేమం - పరమత సహన విభవం - చెడు నుంచి విమోచనం... వీటిని అనుసరించి ప్రవర్తించేది ఇస్లామ్. ఇస్లామ్ మతం కాదు, ఒక ఉత్కృష్టమైన జీవన విధానం.
అల్లాహ్ కరుణ ప్రాప్తికి సిరిసంపదల వంటి బాహ్య వస్తువులతో పనిలేదు. అంతఃకరణశుద్ధి, సత్యసంధత, సేవా పరాయణత, విశ్వవిభునిపై అచంచల విశ్వాసం అత్యంత ప్రధానమని గ్రహించగలిగే శిక్షణను ఇచ్చేదే రమజాన్ మాసం.
ఈ మాసంలో మొదటి పదిదినాలు దైవ కారుణ్యంగా పరిగణిస్తారు. దీన్ని 'రహ్‌మత్' అంటారు. నడిమి పదిదినాలు పాపాలకు క్షమాభిక్ష పెట్టే మన్నింపు దినాలు. దీన్ని 'మగ్‌ఫిరత్' అని పేర్కొంటారు. చివరి పది దినాలు నరకంనుంచి విముక్తి (నజాత్). గర్వం, అహంకారం మనిషిలో హరించుకుపోయే స్థితి కోసం రమజాన్ చేసే కృషి నిరుపమానమైంది. ధర్మమార్గంలో సరళంగా, న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మనుషులు ప్రేమపూరిత విధానంలో ఒకటవుతారు. అందరిలోనూ ఈ గుణం ఊపిరి పోసుకొన్నప్పుడు పుష్కలంగా ఆధ్యాత్మిక కాంతులతో పరిఢవిల్లుతుంది.
సాటి మనిషి పట్ల అధికారదర్పం, మానవుని తెలివితేటల్ని అణచి వేయగల ఆధిక్యత, భావ స్వాతంత్య్రాన్ని స్వేచ్ఛాయుత ఆలోచనల్ని సమూలంగా నాశనం చేసే మానవ నిబంధనలు - అన్నింటినీ ఖురాన్ ఖండించింది.
విలాసవంతమైన జీవితాన్ని వీడటంలోనే సుఖముంది. ఇతరుల కష్టాలు తీర్చడంలో సంతోషాన్ని పొందగలిగే స్థాయికి ప్రతి మనిషీ ఎదగాలి. నిరుపేదల్ని ఆదుకోవడంలోనే అల్లాహ్‌కు ఎనలేని ఆనందం. 'నా' 'నావి' అనే ఆలోచనలు ఉంటే ఔదార్యానికి, స్నేహానికి మనసులో తావుండదు. సమస్త చెడులు లేని ప్రశాంత జీవితం మనిషికి ముఖ్యం. అది కేవలం సత్కార్యాలు, సత్సాంగత్యాలతోనే సాధ్యం- అని ఇస్లామ్ బోధిస్తోంది.
రమజాన్ పర్వదిన సందర్భంగా ఈద్ ముబారక్ విశ్వశాంతి కపోతమై ఎగరాలి. ముస్లిమ్ సోదరులు సత్యం, సమభావం, న్యాయం, ధర్మం వంటి సుగుణాలతో కూడిన తాత్విక గుబాళింపులను అత్తరులా చల్లుకొంటూ తక్‌బీర్ (అల్లాహ్‌స్తోత్రం) పఠిస్తూ ప్రార్థన కోసం ఈద్‌గాహ్ (పండుగరోజు ముస్లిములు సామూహిక ప్రార్థన చేసే స్థలం) చేరుకొంటారు. తమ తప్పిదాల్ని క్షమింపుమని దేవుని ఎదుట సాగిలపడతారు. తమ కుటుంబం, ఊరు, దేశం కోసం ప్రార్థిస్తారు. దైవానికి కృతజ్ఞతాస్తోత్రాలు అర్పిస్తారు.
విశ్వమానవుల్ని సత్పథంపై నడిపించాలని తక్‌బీర్ పఠిస్తారు. ఇది పరస్పర శ్రేయాన్ని కోరే సమున్నత అనుబంధం!
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా