ᐅఅనుభవసారం- ఆధ్యాత్మిక మార్గం
జీవితానికి రెండు పార్శ్వాలు- వ్యావహారికం, పారమార్థికం. మొదటిది లౌకిక విషయాలకు ప్రాధాన్యమిచ్చేది. రెండోది, పారలౌకికమైన ఆలోచనలతో ముముక్షత్వానికి దారిచూపేది. 'ఒకదానితో మరొకటి ముడివడి ఉండి, ఒకదానివలన మరొకటి మనగలుగుతోంది అన్నట్లు' ఉంటుంది ఆ రెండు పార్శ్వాల సంబంధం. అందువల్ల జన్మనెత్తినవారికి ఆ రెండు జీవనసరళులూ అనుసరణీయాలే. ఒకదాని తరవాత ఒకటా, రెండూ ఏకకాలంలోనా? ఎలా అనుసరించాలి అనేది ఆయా వ్యక్తుల పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. వ్యావహారిక జీవితం మీద నిరంతర శ్రమ, గ్లాని, సంశయం, ఆశ-నిరాశలు, అరిషడ్వర్గాల ప్రాబల్యం... ఇలా అనేక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. వాటితో సతమతమవుతూ, అనుభవించడానికి, వాటివెంట పరుగులు తీయడానికే ఎక్కడలేని సమయం చాలదన్నట్లు ప్రవర్తిస్తుంటారు సామాన్య మానవులు. జీవితం అంటే- వాటినే అలా అనుసరించడమే కాబోలు అనే భ్రమలో ఉన్నవారిలో చాలామంది ఆ స్థితిలోనే ఉండిపోతారు. అందువల్లే అశాంతి, అసంతృప్తిలాంటి వ్యతిరేకధోరణులు, భావనలకు లోనవుతారు. ఫలితంగా అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు. అలాకాకుండా వాటినుంచి తప్పించుకోవాలనే ఆలోచన కలిగితే చాలు, ఆ ఆలోచనలే అడుగులుగా మారి, ఆ అడుగులు దివ్యజ్ఞానమార్గంవైపు పయనింపజేస్తాయి. ఆ మార్గం పేరే 'సత్యపథం'.
'సంతోషదాయకమైన ఆ మార్గానికి మరలడం మాటలు చెప్పినంత సులువు కాదు' అనుకుంటారు చాలామంది. అదీకాక, ఆ మార్గానికి మరలడానికి వేరే ఒక వయసంటూ ఉంటుందని, లేదా వృద్ధాప్యం వచ్చాక ఆచరించవలసిన వ్యవహారమని భావిస్తుంటారు. అది 'సముద్ర స్నానానికి వెళ్ళినవాడు ఈ కెరటం తగ్గితే స్నానానికి దిగుతాను' అనుకోవడం లాంటిది. ఆ కెరటాలు తగ్గేదీ లేదు, స్నానానికి దిగే సమయం కుదిరేదీలేదు. అలాగే సంసార జీవనంలో ఇబ్బందులు ఎప్పటికీ తీరవు. అలాంటప్పుడు ఆ మార్గంవైపు దృష్టీ మరలదు. ఇలాంటివారిని ఉద్దేశించే, గీతలో భగవానుడు 'తామరాకు మీద నీటిబొట్టులా' సంసారంలో ఉంటూనే సత్యపథంవైపు దృష్టి మరల్చమంటాడు.
'ఏది నాది, కానిదేది? ఏది సత్యం, ఏది అసత్యం? అనుసరణీయం, అననుసరణీయం ఏవి లాంటి విషయాలను మనోమయకోశంలో చర్చించుకోవాలి' అని చెబుతోంది చాందోగ్యోపనిషత్. గీతలో భగవానుడు చెప్పినా, సౌందర్యలహరిలో శంకరాచార్యులు చెప్పినా; వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, బుద్ధుడులాటివారు బోధించినా; గాంధీ, మదర్ థెరెసా, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందుడు లాంటివారు చెప్పినా- అన్ని మాటల సారాంశం ఒక్కటే. 'స్థితప్రజ్ఞత' (స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం), 'సమదర్శనం' (అన్నింటియందు సమదృష్టి కలిగి ఉండటం), గుణాతీతం (ఏ గుణానికీ ప్రాధాన్యం ఇవ్వకుండాతటస్థంగా ఉండటం)లాంటివి వారు చెప్పినవాటిలో కొన్ని ముఖ్యమైనవి. వీటి భావం, ఆపై వాటి సారం, అనుభవానికి రావాలంటే ముందుగా వ్యావహారిక జీవితంలో అనుభవం గడించాలి. అలాంటప్పుడే అందులోని లోతుపాతులు తెలుసుకుని, రెండో పార్శ్వంవైపు మనిషి దృష్టి మరల్చుతాడు. అక్కడ అప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలకు బీజం పడుతుంది. అప్పుడు జీవుడు అంతర్ముఖుడవుతాడు. గత, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటాడు. భవిష్యత్ ప్రణాళిక రచించుకుంటాడు. ఆ అనుభవాన్నే 'పరిణతి' అంటారు ఆధ్యాత్మికవేత్తలు. అలా పరిణతి చెందినవాడు అన్నింటినీ సమదృష్టితో చూడగలిగేవాడవుతాడు. అతడే 'గుణాతీతుడు' అనిపించుకుంటాడు. అలా గుణాతీతుడు కాగానే అతడి మానసిక భావనాబలాలు అంతశ్శుద్ధి కలిగి ఉంటాయి. ఆ స్థితికి చేరుకున్నవాడు ప్రతికూలమైన ఫలితాలకుగాని, ఏ విషయంలోను నిరాశ, అపజయం లాంటి బాధలకుగాని లోనుకాడు. అతడిలో మేల్కొన్న వివేకం వల్ల, 'అవసరమైనది ఏది, అనవసరమైనది ఏది?' అనే విషయాన్ని అవగాహన చేసుకోవడంవలన ఏర్పడిన స్థితి అది. దానివల్ల ఒకదానితో ఒకటి వ్యతిరేక భావాలైన ఆనందం-దుఃఖం, ప్రేమ-ద్వేషం, ఆదరణ-నిరాదరణ, గౌరవం-అగౌరవం లాంటివాటిలో వేటికీ ప్రాధాన్యమివ్వకుండా నిరాసక్తంగా తయారవుతాడు. దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలో 'స్థితప్రజ్ఞత' అంటారు. అప్పుడు నిత్యుడైన భగవత్స్వరూపంమీద పూర్తి విశ్వాసం కలుగుతుంది. అదే 'విమోచన జ్ఞానం' అనిపించుకుంటుంది. ఆ స్థితిలోచేసే ప్రార్థన కాంక్షారహితంగా ఉంటుంది. అదే అతణ్ని ముముక్షత్వానికి చేర్చుతుంది.
- అయ్యగారి శ్రీనివాసరావు