ᐅసత్యం... శివం... సుందరం




సత్యం... శివం... సుందరం! 

మనలోని ఆత్మను సత్యం, శివం, సుందరంగా ప్రాచీన ద్రష్టలు అభివర్ణించారు. సత్యం, సౌందర్యం తెలిసినవే. శివం అంటే సర్వమంగళ స్వరూపం. జీవితాన్ని శుభాలతో శోభిల్లజేసే దైవత్వ ప్రాభవం. సత్యదర్శనం శుభాన్ని చేకూరుస్తుంది. అంతిమ సౌందర్యాన్ని మనోప్రాంగణం చెంత నిలబెడుతుంది. అవి ఆత్మలోనే నిక్షిప్తమైన నిత్య మహిమోజ్వల తేజఃపుంజాలు. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. ఇంతకు మించి ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవలసింది ఏముంది? సత్యం- ఆత్మదర్పణంలోకి తొంగిచూస్తే కనిపించేది సౌందర్యమే. ఆ రెండింటి సమాగమమే శివం.
ఈ నామరూపాలతో నిండిన బాహ్యప్రపంచంనుంచి మనలోపలి సూక్ష్మ ప్రపంచంలోకి, మన అస్తిత్వ మణిమందిరంలోకి, ఆత్మకుహరంలోకి ప్రయాణించడమే ఆధ్యాత్మికత. సత్యం శత సహస్ర ముఖాలతో భాసిస్తుంటుంది. కాలంలో కానీ, ప్రదేశంలో కానీ అదిమారదు. సృష్టి అంతటికీ మూలాధారం, భూమిక సత్యం. శివం- శాంతి, సామరస్య, సౌజన్యాలకు మోహన రూపం. శివ, శక్తి కలిసే ఉంటాయి. సృష్టికి కారణభూతమైనది శక్తి. సముద్రం, కెరటాలుగా భిన్నంగా కనిపించినా అవి రెండూ ఒక అవిభాజ్య సాగరం. దీపం, వెలుగులాగా; నర్తకి, నాట్యంలాగా శివశక్తులు అవిభాజ్యాలు. శక్తి (దేవి) కూడా సర్వమంగళ మాంగళ్యం అయింది.

ఇక సుందరం. బాహ్య సృష్టి సౌందర్యాలనుంచి అంతస్సౌందర్యంలోకి మన ఆలోచనలు ప్రయాణిస్తాయి. ఒక సుందర దృశ్యం చూసినప్పుడు కళ్లు వాటంతట అవే మూతపడతాయి. ఆ సౌందర్యార్ణవంలో మునిగిపోతాం. ఒక పుష్పం పరిమళాన్ని ఆఘ్రాణించినప్పుడు, పువ్వు బయటే ఉంటుంది. పరిమళం శూన్యంలో అంతర్థానమవుతుంది. మనం అస్తిత్వ అగాథంలోకి జారిపోతాం. అదే సౌందర్యం... అనుపమ సాక్షాత్కారం! ఏ చిన్నారి పుష్పమైనా భగవంతుని గురించి, ప్రకృతి గురించి ఎన్నెన్నో తీయని రహస్యాలు చెబుతుంది.

సుమధుర సంగీతం విన్నప్పుడు, ఆ పాట కానీ, పాటలోని సాహిత్యం గానీ తెలియని స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. అంతరాంతరాల్లోని రూపరహిత దైవత్వంలో కలిసిపోదాం. బాహ్యంనుంచి అంతస్థితలోకాలకు, రూపంనుంచి రూపరాహిత్యంలోకి, పరిమితమైన సీమలనుంచి అపరిమిత అనంతంలోకి... ఇది ఒక రమణీయ ప్రయాణం. ఆ స్థితిలోకి వెళ్లినప్పుడు సృష్టిలోని ముళ్లు, గులాబీలు, రాళ్లు, నక్షత్రాలు... ఒకే అందంతో మెరిసిపోతాయి. ఆత్మకు అర్పణ చేసుకోవడం, దైవత్వంపట్ల పరమ భక్తితత్పరత, మానవాళికి అంకితమైపోవడం- ఇదీ, ఇదే, సౌందర్య రహస్యం. సర్వస్వాన్ని చేజిక్కించుకోవాలన్న స్వార్థం సౌందర్యాన్ని మృగతృష్ణగా మార్చుతుంది. ఈ సృష్టి సౌందర్యాన్ని స్వార్థపరత్వం లేకుండా వీక్షిస్తే- అది భక్తి మహత్వంగా మారి మన ఆత్మ అద్భుతావహ దీపశిఖలా వెలిగిపోతుంది.

సౌందర్యం ఆనంద పారవశ్యం కలిగిస్తుంది. నిద్రిస్తున్న చైతన్యాన్ని మేలుకొలుపుతుంది. సౌందర్యం మనల్ని ప్రగాఢ ధ్యానంలోకి నడిపిస్తుంది. ఈ ధ్యానం మనసుకు విశ్రాంతినిస్తుంది. సృష్టిలో ఈ త్రిమూర్తి స్వరూపం దర్శించాలంటే మనసుకు శాంతి కావాలి. కలవరం చెందే మనసుకు అవి కనిపించవు. సృష్టి అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన మనసుకు ఈ సృష్టి ఒక సౌందర్యలహరి. వాటిని విడివిడిగా ప్రాచీనులు చెప్పినప్పటికీ అంతా ఒకేరూపంగా దర్శించాలి. అదే మనిషి సాధించాలని తహతహలాడే అంతిమ పరిపూర్ణత్వం. విశ్వసౌందర్య సాక్షాత్కృతి. భువిపై జన్మలన్నింటికీ స్వర్ణకిరీటం. దివ్యత్వ శిఖరాలపై చిట్టచివరి అమృతావిష్కరణం. అదే, సృష్టి కథకు అమృత పారవశ్యం కలిగించే అందమైన ముగింపు.

- కె.యజ్ఞన్న