ᐅవాగ్దేవి ముద్దుబిడ్డలు
మాట పెదవి దాటితే రూపం మారుతుంది. మంచి మాటలకన్నా చెడుమాటలు త్వరితగతిన వూసరవెల్లుల్లా రంగులు మారుతూ విపరీతపు పోకడలు పోతాయి. సభ్యత, సంస్కారాలను విడిచి పెడతాయి.
వాక్కు వాగ్దేవి ప్రసాదం. మాటల్లో సమతుల్యత, అర్థం, నిలకడ, సంయమస్థితి ఉండితీరాలి. ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు సమాజంలో. మాటలనే ఆయుధాలుగా రోజు గడిపేవారు కొందరు, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా అభూతకల్పనలతో దినం వెళ్లబుచ్చేవారు ఇంకొందరు.
ఇదొక మానసికజాడ్యం. అస్తవ్యస్త జీవన విధానం రుగ్మత, స్పర్ధలను కొని తెస్తుంది. మానవబంధాల్లో మాధుర్యాన్ని మంటకలుపుతుంది. గృహంలో పనికిరాని చెత్తా చెదారాన్ని క్షణకాలం కూడా నిలువ ఉంచం. శరీరమనే మందిరంలోనూ ఈ నైర్మల్యాలను తొలగించుకోకుంటే- భౌతిక, మానసిక అనారోగ్యం ప్రబలి ప్రశాంత జీవనం కరవైపోతుంది. రెండు పెదవులు దాటి వెలువడిన మాట ఏదైనా శక్తిమంతంగా ఉంటుంది. దాన్ని ఉపసంహరించుకోలేం. అప్రియాలు పలకడం వాగ్దేవి ప్రసాదాన్ని అవమానించడమే. భావం ఒకతీరుగా, మాట మరొకతీరుగా ఉంటే అది ద్వైదీలక్షణం.
మనోవాక్కాయకర్మలు ఒక్కతీరుగా ఉంటేనే- ఆ వ్యక్తిత్వానికి వన్నె. వన్నెలేని వ్యక్తిత్వం మసిబారిన అద్దం లాంటిది. దీపం పెట్టని చీకటి గది లాంటిది. మాటల్లో సంస్కారం, సద్భావనలు ఉట్టిపడాలి. ఏదో లబ్ధినాశించి, ఎదుటివారి మెప్పుకోసం పలికే పలుకులు- ఆత్మను కించబరచుకోవడమే.
అవసరం మేరకు విజ్ఞతతో పలికే పలుకులకు గౌరవం ఉంటుంది. చెడుమాటలు, నొప్పి కలిగించే మాటలు పలకాల్సి వచ్చినప్పుడు మూగవానిగా ఉండటమే మేలు. మాటల్లోని సౌమ్యత, శీలం ఉన్నతస్థాయిని కలిగి ఉంటుంది. అంతటి కౌరవసభలో మరెవ్వరూలేరనా... పాండవుల వద్దకు రాయబారిగా విదురుణ్ని పంపింది!
ఇరుపక్షాల వారినీ నొప్పించక, ప్రియ వచనాలతో కూడిన హిత వచనాలు చెప్పే గొప్ప స్వభావం విదురు డిది. ఆ తరహా భాషణం దూరమయ్యే మానవబంధాలను సైతం దగ్గర చేస్తుంది. విదురుని మాటలు చెవినపెట్టక పోబట్టి కురువంశమే కూలిపోయింది.
మంచి మాటలు పలకడం, విని ఆచరించడం దైవీ లక్షణం. తేనెకన్నా మధురమైంది మానవబంధాల మాధుర్యం. ఈ మాధుర్యాన్ని చవిచూడక- మాటల గారడీలతో మాయలతో బతుకులీడ్చటం, అదొక క్రీడలా భావించడం... జీవితాన్ని విషతుల్యం చేసుకొనడమే.
తప్పు అని తెలిసీ అధిగమించలేకపోవడం మూఢత్వం. లేపనాలు, మైపూతలు, ఆభరణాదులు, సిరిసంపదలకన్నా- నిజమైన ఆభరణం మంచివాక్కు, సత్యవాక్కు, మధురవాక్కు. అది పెరిగే వాదోపవాదాలను తుంచివేస్తుంది. వితండవాదాలను కట్టడి చేస్తుంది.
బుద్ధికి ప్రతిరూపమే వాక్కు. బుద్ధి సక్రమ గతిలో నడవాలి. అహాన్ని వీడితే బుద్ధి వికసిస్తుంది. అహాన్ని వీడటమే మానసిక పరిణతి. మహనీయుల నోటివెంట వెలువడే ప్రతీమాట శక్తిమంతమైంది, విలువైంది. వారి ప్రతీ వచనం వేదంతో సమానం. వారి ఆశీర్వచనం ఎంతో ప్రభావాన్ని చూపెడుతుంది. అదే వాచకతపస్సు.
వైద్యంకన్నా వైద్యుడు చెప్పే ధైర్యవచనం వ్యాధిగ్రస్తుణ్ని సాంత్వన పొందేటట్లు చేస్తుంది. మనోనిబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే మాటల్లో హుందాతనం, ప్రియత్వం తొణికిసలాడాలి. అటువంటివారే జనప్రియులు, వాగ్దేవి ముద్దుబిడ్డలు.
- దానం శివప్రసాదరావు