ᐅలైలతుల్ ఖద్ర్ ప్రశస్తి




లైలతుల్ ఖద్ర్ ప్రశస్తి 

'లైల్' అంటే రాత్రి అని అర్థం. 'ఖదర్' శబ్దానికి మహత్వపూర్ణమైంది, శక్తిమంతమైంది, ప్రబలమైంది, దైవసంకల్పం అని అర్థాలు. లైలతుల్ ఖద్ర్ అంటే మహత్వపూర్ణమైన రాత్రి అని దివ్యార్థం. ఈ రాత్రి ఖుర్ ఆన్ అవతరించింది. ఈ రాత్రి పేరు వింటేనే హృదయాలు పులకిస్తాయి. ముస్లిములు మస్జిద్‌లలో రాత్రంతా విశేష ప్రార్థనలు చేస్తారు.
వేయి మాసాల కన్నా ఈ రాత్రి మేలైందని, పుణ్యప్రదమైందని ప్రవచిస్తారు. వేయి మాసాల వయస్సు పూర్తయితే సహస్ర పూర్ణ చంద్రుల్ని చూసినట్లు పండుగ చేసుకొనేవారు ఉన్నారు. వేయి మాసాలంటే ఒక జీవిత కాలమని భావించాలి. లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసంలోనే వస్తుంది. 83 సంవత్సరాలు క్రమం తప్పకుండా చేసే ఆరాధన కన్నా నిర్దిష్టమైన ఈ రాత్రి చేసే ఆరాధన ప్రశస్తమైంది- అని చెబుతారు.

లైలతుల్ ఖద్ర్‌ను లాంఛన ప్రాయంగా వేడుకతో నిర్వహించడం కన్నా రాత్రంతా ప్రార్థనలో ధ్యానంలో గడిపితే మానసిక అంధకారం తొలగిపోతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసంలో ఏ రాత్రి అయి ఉంటుంది- అనే విషయం ఇదమిత్థంగా నిర్ధారించలేదు. మహా ప్రవక్త (స.అ.సం.) సైతం ఆ రాత్రి ఎప్పుడో తేల్చి చెప్పలేదు. అయితే రమజాన్ మాసంలోని చివరి అయిదు బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29 రాత్రుల్లో) అన్వేషించండని మహా ప్రవక్త ఉపదేశించినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. బేసి రాత్రులకు సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 27వ తేది రాత్రి లైలతుల్ ఖద్ర్ ఉండే వీలుందని ప్రవక్త సహచరుల ప్రామాణిక అభిప్రాయం. ఆర్భాటంగా మస్జిద్‌లకు విద్యుద్దీపాలు అలంకరించి, ఏదో ఉబుసుపోకకు వచ్చినట్లు వచ్చి కబుర్లు చెప్పుకొని ప్రార్థనాలయాలనుంచి ఇంటికి వెళ్లడం క్షమార్హం కాని దోషం. మిఠాయిలు, చాయ్‌లకోసం కాస్సేపు మేల్కొని ఆ తతంగం ముగిసిన వెంటనే వెళ్లిపోవడం 'లైలతుల్ ఖద్ర్' పవిత్ర ఉద్దేశాలకు విరుద్ధం.

'లైలతుల్ ఖద్ర్' ప్రాముఖ్యాన్ని అందరూ గుర్తించాలి. అల్లాహ్ క్షమాగుణం కలవాడు. క్షమను ఆయన ఎంతో ఇష్టపడతాడు. తన దాసుల అపరాధాలను ఆయన దయతో క్షమిస్తాడు. 'అల్లా హుమ్మ ఇన్నక అపువ్వున్ తుహిబ్బుల్ అఫ్‌వఫ అపు అని' (ఓ అల్లాహ్! నీవు క్షమించేవాడివి. క్షమ అంటే నీవు ఇష్టపడతావు. కనుక నన్ను క్షమించు.) ఆ రేయి పశ్చాత్తాప భావంతో కుమిలిపోయి ఇకపై దుష్కార్యాలకు దూరమై కల్మషరహిత హృదయంతో జీవిస్తానని వాగ్దానంచేసి మాట నిలబెట్టుకొనే దాసులనే విశ్వప్రభువు ఇష్టపడతాడు. కరుణిస్తాడు.

'జనులకు మంచిని బోధించండి. మంచినే మాటలాడండి. రుజువులేనిదే ఎవరిపైనా నిందారోపణ, నేరారోపణ చేయడం సమంజసం కాదు. గుచ్చిగుచ్చి ఇతరుల లోపాల్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించడం మీ ప్రవర్తనను కించపరుస్తుంది. పరోక్షనింద దోషపూరితమైంది. పరులకు ఎలాంటి నష్టం కలగజేయవద్దు. పరులను పీడించడం కోసం భూమిపై జీవనం గడపవద్దు. ఒకడు తుంటరితనంతో ఏదైనా మాటాడితే మీరు సన్మార్గాన్ని విస్మరించవద్దు. ప్రశాంత వదనం మంజుల వాక్కు అవసరం. అందువల్ల శత్రువుసైతం మిత్రుడవుతాడు. మంచి వ్యవహారం, మర్యాదతో కూడిన ప్రవర్తన- శాంతికి, ఉల్లాసానికి, ఎనలేని ఆనందానికి మూలం అని గ్రహించండి. దీనుల్ని దరిచేర్చుకోండి. పరుల క్షేమాన్ని నిరంతరం కోరి వారికి సహాయపడండి. తమ రక్తసంబంధీకుల కోసమైనా, ధర్మమార్గాన్నుంచి ఏ సమయంలోనూ తప్పుకోకూడదు. అందరిపట్లా న్యాయభావనతో న్యాయ స్ఫురణతో మాటలాడండి'- వంటి ఖురాన్ బోధలు ఆ రాత్రి స్మరిస్తారు. మనిషి భావనా ప్రపంచంలోనికి కొత్త ఆధ్యాత్మిక గాలులు ఆ పవిత్ర రాత్రి ప్రవేశిస్తాయి. అతని ఆత్మకు వికాసాన్నిస్తాయి.

- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా