ᐅచికిత్స




చికిత్స 

ఒక వ్యాపారి వైద్యుడి వద్దకు హడావుడిగా వెళ్ళాడు. పనిభారంతో తాను అతలాకుతలం అయిపోతున్నానన్నాడు. రోజూ సంచినిండా ఇన్ని దస్త్రాలు కూరుకుని ఇంటికి తెస్తున్నానని, అర్ధరాత్రయినా తన పని పూర్తి కావటంలేదని వాపోయాడు. సరిగా తిండి తినలేకపోతున్నానని, కంటినిండా నిద్ర కరవైందని, పొద్దుట ఆదరాబాదరా లేచి ఆ అలసటతోనే మళ్ళీ పనికి వెడుతున్నానని మొరపెట్టుకున్నాడు. పనిభారంవల్ల తనకు కలుగుతున్న అనారోగ్యానికి చికిత్స చేయమన్నాడు.
'కొంత పనిని మరెవరికైనా అప్పగిస్తే నువ్వు తెరిపిన పడతావు కదా' అన్నాడు వైద్యుడు. అది వీలుకాదని, ఆ పని తానొక్కడే చేయాలని, తనకు చేయక తప్పదని, అదికూడా త్వరత్వరగా చేస్తేనే లాభమని లేకపోతే వ్యాపారం కుంటువడిపోతుందని అన్నాడతను.

'పోనీ, రోజూ రెండు గంటలపాటు నీ పని మానేసి తోటల్లోకి నడిచివెళ్ళు. ఆ ప్రశాంత వాతావరణానికి, స్వచ్ఛమైన గాలికి నీ శరీర దారుఢ్యం పెరుగుతుంది. అలసట తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే, వారానికోసారి ఒకపూట నీ మామూలు పని మానేసి ఆ సమయాన్ని శ్మశానవాటికలో గడపాలి' అన్నాడు వైద్యుడు.

అతను తెల్లబోయాడు. 'ఎక్కడైనా నడవొచ్చుకదా! శ్మశానవాటికలోనే ఎందుకు?' అని కంగారుపడుతూ అడిగాడు.

'ఈ ప్రపంచాన్ని వదలిపెట్టి వెళ్ళినవారంతా అక్కడ శాశ్వత ధ్యానముద్రలో ఉన్నారని నువ్వు గ్రహిస్తావు. తాము లేకపోతే పనులన్నీ ఆగిపోతాయని హడావుడి పడిపోయామే, ఈ ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదని జీవించి ఉండగా తెలుసుకోలేకపోయామే, అవిధినిపడి ఆరోగ్యాలు పాడుచేసుకున్నామే, మనమెంత మూర్ఖులమోకదా- అని ఆ సమాధుల్లోంచి ఆత్మలు వైరాగ్యంతో నవ్వుకుంటున్నట్టు నీకు వినిపిస్తుంది. ఎవరికైనా అదే చివరి మజిలీ కదా- బతికినంతకాలం ప్రశాంతంగా జీవించాలి- అలా జీవించటం నీ చేతుల్లోనే ఉంది - అని వారు గుసగుసగా నీకు చెబుతున్నట్టనిపిస్తుంది!' అన్నాడు వైద్యుడు.

అతనిపై వైద్యుని మాటలు పనిచేశాయి. గతించినవారి అనుభవాలను మార్గదర్శకం చేసుకున్నాడు. తన పనిని కొందరు నమ్మకస్తులకు పంచి ఇచ్చాడు. పని భారం తగ్గాక అతనిలో అలజడి తగ్గింది. అలసట తగ్గింది. ఆరోగ్యం చేకూరింది. మారిన జీవనసరళితో ఆనందించటం నేర్చుకున్నాడు. ఒకరిని ఆనందపెట్టడమే తన జీవిత పరమావధి కావాలని గ్రహించాడు.

- తటవర్తి రామచంద్రరావు