ᐅఅవమాన కారణాలు



అవమాన కారణాలు 

లోకంలో పుట్టిన మానవులందరికీ తమ జీవితంలో నిత్యం ఎదురయ్యేవి మానావమానాలు. మానం అంటే గౌరవం. అవమానం అంటే తిరస్కారం. ఈ రెండింటికీ ప్రత్యేక కారణాలుంటాయి. అవమాన కారణాల గురించి తప్పక తెలుసుకోవలసిందే.
పెద్దలు అవమానం విషయంలో ఎన్నో కారణాలను విడమరచి చెప్పారు. వాటిని ఒకసారి గుర్తుచేసుకుంటే మనిషి అవమానానికి లోనుకాకుండా జాగరూకత పడవచ్చు. అతి పరిచయం, అనాహూత ప్రవేశం, సంతతగమనం, అపృష్టకథనం వంటివి వాటిలో కొన్ని.

అతి పరిచయం అంటే ఎక్కువగా పరిచయాన్ని కలిగి ఉండటం. ఇది అవమాన కారణం ఎలా అయిందంటే- మలయ పర్వతంపైన నివసించే గిరిజనులు ప్రతినిత్యం వేలకొలది చందనవృక్షాలను చూస్తూ ఉంటారు. వాటితో వారికి అమితంగా పరిచయం ఉన్నకారణంగా వారికి ఆ చందనవృక్షం చులకనగా కనబడుతుంది. ఆ కారణంగా వాళ్లు ప్రతినిత్యం విలువైన చందనపు కట్టెలను సైతం పొయ్యి మండించడానికి ఇంధనంగా వాడుకుంటారు. చందనపు చెక్క ఒక చిన్నముక్క దొరికినా చాలు భాగ్యమే అనుకొంటూ అరగదీసి, గంధాన్ని దేవతార్చనలో ఉపయోగిస్తారు ఆస్తికులు. అంతటి ఉన్నత ప్రయోజనానికి వాడవలసిన చందనాన్ని రోజూ చేసుకునే వంటకు ఇంధనంగా వాడుకొంటూ దుర్వినియోగం చేయడానికి కారణం 'అతి పరిచయం' మాత్రమే.

పిలవని పేరంటాలకు వెళ్లకూడదనేది ఒక నీతి. ఇలా పిలవకుండానే వెళ్లి అవమానాల పాలైనవాళ్లు చరిత్రలో ఇతిహాసాల్లో పురాణాల్లో ఎందరో ఉన్నారు. సాక్షాత్తు పరమశివుని భార్య సతీదేవి ఇందుకు చక్కని ఉదాహరణ. పరమశివుని మామ, సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి లోకోత్తరమైన యాగాన్ని చేయడానికి నిర్ణయించుకుంటాడు. సకలదేవతలనూ ఆహ్వానించి, తన అల్లుడూ త్రిభువనారాధ్యుడూ అయిన పరమశివుణ్నీ తన కూతురైన సతీదేవినీ పిలవడు. అయినా సంగతి తెలుసుకొని పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి యాగానికి వెళ్లివద్దామని భర్తను కోరుతుంది. పరమశివుడు ససేమిరా అంటాడు. పిలవకుండా వెళ్లడం మంచిది కాదని భార్యకు హితం చెబుతాడు. అయినా సతీదేవి తాను వెళ్తానని భర్తతో చెప్పి, తండ్రి చేసే యాగస్థలికి చేరుకొంటుంది. అక్కడ ఆమెను చూసినవాళ్లు పలకరించరు. ఆత్మీయులు ఆదరించరు. పైగా తన తండ్రి కూడా పరమశివుడిపై లేనిపోని నిందలు వేసి, తూలనాడతాడు. ఇలా అవమానాలను అనుభవించి, నిందలను చెవులారా విని సహించలేక, తనువు చాలించాలనుకొని యోగాగ్నిని కల్పించుకొని, అందులోకి దూకి ప్రాణాలు విడుస్తుంది. పిలవని చోటికి వెళ్తే ఎవరికైనా అవమానాలు తప్పవనడానికి ఈ సంఘటన ఉదాహరణగా మిగిలింది.

మాటిమాటికీ ఎవరి దగ్గరకూ వెళ్లకూడదనేది మరొక నియమం. కొత్త అల్లుడికి అత్తవారింటిలో సకల మర్యాదలూ జరుగుతాయి. కాలు కదపకుండానే నోటిముందుకు విందు భోజనాలు వచ్చి పడతాయి. ఈ మర్యాదలన్నీ కొంతకాలానికే పరిమితం. అత్తవారింటిలో తేరగా అన్నీ దొరుకుతున్నాయి గదా అని అల్లుడు మాటిమాటికి అత్తవారింటికి వెళ్తే ఏమవుతుంది? ఏదో ఒకరోజు తిరస్కారం అనే పురస్కారం సంప్రాప్తిస్తుంది. కనుక ఎవరైనా ఔచిత్యం లేకుండా మాటిమాటికీ వెళ్లకూడదు.

'అడగనిదే ఎవరికీ ఏదీ చెప్పరాదు' అనేది వేదసూక్తి. కొంతమందికి ఎలాంటి పనీ పాటా ఉండదు. ఎప్పుడూ ఇతరుల చేష్టలను గమనిస్తూ తప్పులు వెదుకుతూ ఉచితంగా సలహాలు దానం చేస్తుంటారు. ఇలాంటివాళ్లకు అవమానం తప్పదని 'పంచతంత్రం'లోని ఒక పక్షి కథ చెబుతుంది. ఆ కథలో కొన్ని కోతులు అడవిలో చలి బాధకు తట్టుకోలేక పుల్లల్నీ పుడకల్నీ ఏరుకొని తెచ్చి, ఒకచోట కుప్పగా పోసి, మంటను రగిలిద్దామనుకుంటాయి. వాటికి నిప్పు దొరకలేదు. ఇంతలో నిప్పులా మెరుస్తూ ఎగురుతున్న మిణుగురు పురుగుల్ని చూసి, వాటిలో నిప్పు ఉన్నదనుకొని, ఆ పురుగుల్ని పట్టి తెచ్చి, పుల్లలపై వేస్తాయి. ఎంతకూ మంటరాకున్నా, ఆ పనిని పదేపదే చేయడం గమనించిన ఓ పక్షి- నిప్పు అలా పుట్టదనీ, అలా చేయడం వృథా ప్రయాస అనీ నచ్చజెబుతుంది. అప్పటికే చలిబాధకు కోపంతో ఉన్న కోతులు ఆ పక్షి మెడను గట్టిగా పట్టుకొని, నేలకు బాది, చంపేస్తాయి. అపృష్టకథనం వల్ల అనర్థాన్ని కొని తెచ్చుకోవడమంటే ఇదే.

గౌరవం లేకపోయినా నష్టం లేదు కానీ, అవమానం మాత్రం కలగకూడదనీ, అది మచ్చవంటిదనీ గ్రహిస్తే జీవితంలో సంతృప్తి మిగులుతుంది.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ