ᐅప్రేమ... అమలిన భావగరిమ
ప్రేమ అనేది అమృతతుల్యమైన భావం. అమితమైన ఇష్టం. ఒక మనిషి మీద కావచ్చు. ఒక వస్తువుమీద కావచ్చు. ఒక జీవం మీద కావచ్చు. ఒక భావం మీద కావచ్చు. మనిషి అయితే తల్లో, చెల్లో, భార్యో కావచ్చు. స్నేహితుడో, ప్రేయసో, ప్రియుడో కూడా అయివుండవచ్చు. ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో చిన్నతనం లేదు. చవకబారుతనం లేదు. పవిత్రత, స్వచ్ఛత ఉంది. ఉండాలి. ప్రేమ అనేది ఒక ఆధ్యాత్మిక భావం. అనుసరణీయ కోణం. నిరసించరాని లక్షణం. రక్త సంబంధం లేకుండా ఒక స్త్రీ పురుషుణ్ని ప్రేమించినా, పురుషుడు స్త్రీని ప్రేమించినా తప్పులేదు. అయితే అది అమలినమై ఉండాలి. ఆంతర్యానికి సంబంధించినదై ఉండాలి. రుక్మిణి కృష్ణుణ్ని ప్రేమించింది. పార్వతి శివుణ్ని ప్రేమించింది. రాధ వంశీమోహనుణ్ని ఆరాధించింది. అందులో గొప్ప కల్యాణం ఉంది. మంగళం ఉంది. శుభం ఉంది. నేడు కూడా తల్లి చెల్లితోపాటు స్నేహితుల్ని ప్రేమిస్తున్నారు. 'ప్రేమ' అంటున్నారు. ఫలించకపోతే, నిరాకరిస్తే హింసిస్తున్నారు. లేదా ఆత్మహింస చేసుకుంటున్నారు. నిజమైన ప్రేమ ఇలాంటివాటికి అతీతం. అది అమరం, అజరామరం. తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది. అందులో ఏ దోషమూ లేదు. ద్వేషమూ లేదు. 'ప్రతి ప్రేమ' లభించకపోతే విద్వేషమూ లేదు. అసలా తల్లికి అలాంటి ఆశా లేదు. ఉండదు. బిడ్డ ఆనందం, ఆరోగ్యం, జీవితకాల శ్రేయం... ఇవి ముఖ్యం. అంతే. మరి ఇతర ప్రేమలెందుకలా లేవు?అసలు మనకు ప్రేమంటే తెలుసా?
ప్రేమ ఒక భావలీల. ఒక ఆనందహేల. హృదయ రస ప్రహేల. నిజానికి ప్రేమ పొందడం కంటే ప్రేమించటమే నిజమైన ప్రేమ లక్షణం. ప్రేమకు సరియైన నిర్వచనం. నిజమే. ఎవరైనా మనను ప్రేమించటం బాగుంటుంది. కొంచెం సంతోషంగా, కొంచెం గర్వంగా, మరికొంచెం ఉద్విగ్నంగా... అది పక్కనబెట్టి ఆలోచిద్దాం. మనల్ని ఎవరు పడితే వాళ్లు ప్రేమించడం బావుంటుందా? మన తాహతుకో, మనస్తత్వానికో, అభిరుచికో తూగనివాళ్ల ప్రేమ మనకు సంతోషాన్నిస్తుందా? చికాకుగా ఉండదా? సరే. అది వాళ్ల ఇష్టం. మనకు సంబంధం లేదు. మనకొచ్చే నష్టమూ లేదు. కానీ మనకు సరిపోనివాళ్లు? మనకు బొత్తిగా గిట్టనివాళ్లు? ఇంకా మనం అసహ్యించుకునేవాళ్లు? వాళ్లప్రేమ మనకెంత బాధాకరంగా, భరింపరానిదిగా ఉంటుంది?! ఆ ఊహే సహించలేనిదిగా ఉంటుందికదా? నిజమైన ప్రేమ అంటే ప్రేమించటమే. ప్రేమిస్తేనే ఆ మాధుర్యం అర్థమవుతుంది. అవగాహనలోకివస్తుంది. అనుభూతి సాంద్రమవుతుంది. అది ఎవరు ఎవరినైనా కావచ్చు. మనసు మనోహరమైపోతుంది. మాధుర్యం నిండిపోతుంది. ఆనందం పొంగిపొరలుతుంది. శరీరం, మనసు, ఆత్మ... పూలు పూచిపోతుంది. పులకలు మొలిచిపోతుంది. పున్నమి వెన్నెలైపోతుంది. ఈ అనుభవం, ఈ అనుభూతి ప్రేమను పొందడంలో సంపూర్ణంగా ఉండదు. ప్రేమిస్తేనే ఆ రసమాధుర్యాన్ని మన హృదయాధరాలు గ్రోలగలుగుతాయి. మనసు... మానస సరోవరమై తెలి భావ హంసికలు తేలియాడతాయి. పెదవుల మీద చెరగని చిరునవ్వులు ఎర్రంచు తెల్లతామరలైపోతాయి. జీవితం నడిచే పూలతేరైపోతుంది.
ప్రేమిద్దాం. ప్రేమను ఆస్వాదించాలంటే ప్రేమించాలి. అంతే, ప్రేమను ఆనందించాలంటే ప్రేమించాలి. ఎవరిని? ఎవరినైనా. ఎందరిని? ఎందరినైనా. కాదు. అందరినీ... విమలంగా, విశుద్ధంగా. ఈ లోకంలో ప్రేమించటంలోని ఆనందం మరే భావంలోనూ, భావాన్ని పంచటంలోనూ లేదు. అదే భగవంతుణ్నయితే ఇక తిరుగేలేదు.
ప్రేమిద్దాం... అవతలివారి స్పందనతో సంబంధం లేకుండా. ప్రేమించటం మన మనసుకు పట్టిన భాగ్యం, యోగం. అందులో హింసకు తావులేదు. ప్రతిహింసకు చోటులేదు. మనల్ని ప్రేమించటం, లేకపోవటం అవతలి వారి ఇష్టం, అయిష్టం. మనకు సంబంధంలేదు.
- చక్కిలం విజయలక్ష్మి