ᐅవిజ్ఞాన నిధి- పూజావిధి




విజ్ఞాన నిధి- పూజావిధి 

ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.
మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు. వినాయక పూజాసంవిధానంలో ఉపయోగించే మాచీ మొదలైన ఇరవైఒక్క రకాల పత్రాలకు దేహవ్యాధుల్ని నిర్మూలించే ఔషధీ గుణాలున్నాయని చెబుతారు. ఈ పత్రపూజవల్ల వీటిలో ఉండే ఓషధీశక్తి మనకు ఒంటపడుతుందని చెబుతారు. గణపతి నవరాత్రుల్లో 21రకాల పత్రాలతో విగ్రహాన్ని పూజించి, అనంతరం విగ్రహాన్ని పత్రాలతో సహా జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా జలంలో కలిసిన ఆకులు 24గంటల వ్యవధిలో తమలో ఉన్న ఔషధీ గుణ ఆల్కలాయిడ్స్‌ను నీటిలోకి విడుదల చేస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆల్కలాయిడ్స్ కలుషిత జలాల్ని శుద్ధిపరచి, జలచరాలకు మేలు చేకూరుస్తాయి.

వినాయక నవరాత్రుల్లో స్వామిని గరికతో ప్రత్యేకంగా పూజిస్తాం. పత్రులన్నింటిలో గరిక అంటే గణపతికి మహా ఇష్టమంటారు. గరిక పోచలపై పల్చటి 'సిలికా' అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపక పదార్థం. గణపతికి గరిక అంటే ఇష్టం ఏర్పడటానికి ఓ పురాణగాథను నేపథ్యంగా చెబుతారు. యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవిస్తాడు. అతని శరీరంనుంచి వచ్చే ఉష్ణశక్తివల్ల లోకాలన్నీ దహించుకుపోసాగాయి. దాంతో దేవేంద్రుడు గణేశుణ్ని ప్రార్థించాడు. గణపతి అనలాసురుణ్ని ఉండచుట్టి మింగేశాడు. దాంతో లంబోదరుని ఉదరంలో అనంతమైన అగ్ని ప్రజ్వరిల్లింది. శివుని సలహామేరకు గజాననుణ్ని దేవతలు గరికపోచలతో పూజించగా అంబికాసుతునికి అనంతమైన ఉష్ణం ఉపశమించింది. అప్పటినుంచి గణపతికి గరిక ఇష్టమైందంటారు. ఆధునిక కాలంలోనూ ఉష్ణనిరోధక పదార్థాల్ని 'సిలికా'తోనే తయారు చేయడం తెలిసిందే!

గణపతి శిరస్సు మదించిన బలానికీ, ఆత్మస్త్థెర్యానికీ ప్రతీక. మనసుతో ఆలోచించినవాళ్లకు బుద్ధి, ఆత్మశక్తి సంయోగం చెందుతాయి. తద్వారా సర్వకార్యాల్ని జయప్రదం చేసుకోవచ్చని వినాయకుడు మనకు అందించే సందేశం.

- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్