ᐅవామన జయంతి



వామన జయంతి 

అదితి, కశ్యపులకు విష్ణువు వామనుడై భాద్రపద శుక్ల ద్వాదశినాడు శ్రవణానక్షత్రంలో జన్మించాడు. పుట్టగానే జ్ఞానవంతుడయ్యాడు. మహావిష్ణువు విభవావతారాల్లో త్రివిక్రమ స్వరూపం వామనావతారం.
వామన పురాణం ప్రకారం దుంధుడనే దానవుని అణగదొక్కడానికి విష్ణువు మొదట వామనుడుగా ఆవిర్భవించాడు. ఇది ప్రథమ వామనావతారం. అయితే రెండో వామనావతారమే లోకప్రసిద్ధి. దానవరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. స్వర్గంపై దాడిచేసి ఇంద్రుని జయించాడు. త్రైలోక్యరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. యజ్ఞాల్లో దేవతలకు చెందవలసిన హవిర్భాగాలను రాక్షసులే స్వీకరింపసాగారు. దేవతల తల్లి అదితి తన కుమారుల దైన్యాన్ని చూడలేక కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకు పయోభక్షణ వ్రతం ఉపదేశించి ఆచరింపజేశాడు. ఆ వ్రతఫలంగా అదితి గర్భాన విష్ణువు వామనుడై జన్మించాడు.

బలి యాగం చేస్తుండగా వామనుడు నర్మదా నది దాటి యజ్ఞశాలకు విచ్చేశాడు. బలి చక్రవర్తి వామనుని పూజించి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. వామనుడు 'నాకు తపస్సు చేసుకోవడానికి మూడడుగుల నేల మాత్రం కావాలన్నాడు. తృప్తిలేని మానవుడు సప్తద్వీపాల్లోనూ మనలేడని పలికాడు. వామనుడు మూడడుగులు యాచించడంలో పరమార్థం ఉంది. భూః, భువః, సువః అని ప్రధాన వ్యాహృతులు మూడు. మొదట పుట్టినవి ఈ లోకాలే. వ్యాహృతులనగా చెప్పినవని అర్థం. ఈ మూడూ సర్వలోకాలకూ ఉపలక్షణాలు- వేదాలు మొదట మూడే. సత్వరజస్తమో గుణాలు మూడు. త్రివిక్రముడనగా ఈ మూడు మూడుగానున్నవానిపై ఆధిపత్యంగలవాడు. ఆ ఆధిపత్యం బలి చక్రవర్తినుంచి స్వాధీనం చేసుకోవడానికి మూడడుగులు యాచించాడు. ఈ మూడడుగులు పై త్రివర్గాలకు ప్రతీకలు. వామనుడు అడిగిన మూడడుగుల నేలను దానంగా సమర్పించాడు. దానధార నేలపై పడగానే వామనుడు పెరిగిపోయాడు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు. బలి తల వంచి తన నెత్తిపై పెట్టమన్నాడు. వామనమూర్తి బ్రహ్మాండమంతా నిండిపోతున్న సమయంలో సూర్యబింబం మొదట ఆయనకు గొడుగుగా భాసించింది. తరవాత శిరోమణిగా, క్రమంగా మకరకుండలంగా, కంఠాభరణంగా, భుజకీర్తిగా, ఆ తరవాత కాంతులీనే కరకంకణంగా అనంతరం కటి ప్రదేశంలో వస్త్రంగా ఆపైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా కనిపించింది. బలి త్యాగగుణానికి, వచన బద్ధతకు విష్ణువు ప్రసన్నుడయ్యాడు. బలిని సుతల లోకానికి అణగదొక్కి ఎలాంటి భంగపాటూ కలగకుండా తానే అతని వాకిట రక్షణగా ఉన్నాడు. బలికి ఒక బ్రహ్మకల్పం ఆయుర్దాయం ఇచ్చాడు. సావర్ణిమనువు కాలంలో బలి దేవేంద్రుడవుతాడని వరమిచ్చాడు.విష్ణువు మూడు పాదాలు కలిగినవాడిగా రుగ్వేదం చెబుతోంది. సూర్యుని ఉదయ మధ్యాహ్న అస్తమయాలే ఈ పాదాలని పండితుల భావన. సూర్యుడు దక్షిణంనుంచి జనులకు కనిపించే కాలం రెండు పాదాలైతే, తరవాత కిందకు దిగిపోయి దీర్ఘరాత్రిని కల్పించినప్పుడు అదృశ్యమైన మూడో పాదం ఏర్పడుతుందని భావిస్తుంటారు. 'నేనిస్తున్నాను గనుక ఈ యాచకుడు బతుకుతున్నాడు' అనే దానగర్వం పనికిరాదనీ ఈ గాథ స్పష్టం చేస్తోంది.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు