ᐅసౌభ్రాతృత్వం




సౌభ్రాతృత్వం 

లౌకిక సుఖాలను ఆశిస్తూ అధికారం కోసం సిరిసంపదల కోసం ఆరాటపడతాం. కాని, మనిషిలో అంతర్గత కల్మషాలకు సిరులే కారకాలవుతాయి. పరస్త్రీలను, పరుల ధనాన్ని ఆశించడం అహితమే కాక ప్రాణాలమీదకు తెస్తుంది. ఇలాంటి దురాశలు అన్నదమ్ములను, కన్నవారిని కూడా శత్రువులుగా మారుస్తాయి. సమాజంలో ప్రస్తుతం నెలకొని ఉన్న కల్మషభావాలకు కుటుంబ కలహాలకు స్థిరచరాస్తులే కారణం. ఉమ్మడి కుటుంబాలు, ఆ వ్యవస్థలోని ఆత్మీయతలు నేడు కనిపించడం లేదు. సంపదలపై ఆశలే ఆత్మీయతలను కనుమరుగు చేస్తున్నాయి.
మన పురాణాలు మానవ సంబంధాల మెరుగుదలకు దోహదపడతాయి. సమాజంలో మనిషి ఎలా జీవించాలో నేర్పుతాయి. పురాణాల్లోని ప్రతి పాత్రా మానవ సమాజానికి మార్గదర్శకత్వం చేస్తుంది. రామాయణంలోని రావణాసురుని నైజాన్ని గమనించండి. పరస్త్రీ వ్యామోహం లేని పక్షంలో- రావణుడు మహాజ్ఞాని, శివభక్తుడు, మహాపండితుడిగా మిగిలిపోయేవాడు. ఎన్ని మంచి గుణాలున్నా ఒకే ఒక్క చెడు గుణం మనిషిని సమూలంగా నాశనం చేస్తుంది. రావణుడి విషయంలో అదే జరిగింది. మోహంవల్ల శూర్పణఖ, బలగర్వంతో అక్షుడు, ఇంద్రజిత్తు, అసూయ కారణంగా కైకేయి నాశనమయ్యారు. మంచితనం పశుపక్ష్యాదులకు మేలు చేస్తుందని జటాయువు (పక్షి) నిరూపించింది. స్నేహధర్మాన్ని పాటించి సుగ్రీవుడు, విభీషణుడు కీర్తి పొందారు. లక్ష్మణుడు, హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే! శ్రీరామునితో పాటు వారూ నేటికీ పూజలందుకొంటున్నారు.

అధికారం, సంపదలు లభించినా అందుకు అర్హుణ్ని కానని శ్రీరామచంద్రుని సోదరుడు భరతుడు నిరాకరించాడు. పరధనంపై వ్యామోహ పడేవారికి భరతుడి పాత్ర జ్ఞానోదయం కలిగించాలి. రామాయణంలో లక్ష్మణుడికి లభించినంత కీర్తి భరతుడికి లభించలేదనిపిస్తుంది.

శ్రీరామచంద్రుని తమ్ముడు భరతుడు లక్ష్మణుని కంటే పెద్దవాడు. దశరథుని వల్ల కైకేయికి జన్మించాడు. శ్రీమహావిష్ణువు ధరించే పంచాయుధాల్లో సుదర్శన చక్రం అంశతో భరతుడు జన్మించాడని చెబుతారు. ముగ్గురు తమ్ములూ శ్రీరాముణ్ని అమితంగా ప్రేమించారు, పూజించారు. రాముడికి లక్ష్మణుడు సన్నిహితంగా మెలగేవాడు. అలాగే భరతుడితో శత్రుఘ్నుడికి సాన్నిహిత్యం ఉండేది. భరతుడు మాండవిని వివాహం చేసుకొన్నాడు. ఈ మాండవి జనకుని సోదరుడైన కుశధ్వజుని కూతురు. సీతకు చెల్లెలు. భరతునికి ఇద్దరు మగపిల్లలు కలిగారు. వారే తక్షుడు, పుష్కలుడు!

శ్రీరాముడు వనవాసం వెళ్లేనాడు భరతుడు అయోధ్యలో లేడు. కేకయరాజ్యంలోని తన మేనమామల ఇంటికి వెళ్లాడు. అతను అయోధ్యకు తిరిగివచ్చిన తరవాతనే శ్రీరామ వనవాసం గురించి తెలుసుకొన్నాడు. నిజానికి రాజ్యపట్టాభిషేకం కోసమే తనను రమ్మన్నారన్న సత్యం భరతుడికి అయోధ్య చేరుకున్నాకే తెలిసింది. తన అర్హతలను బేరీజు వేసుకోకుండా అధికారాన్ని అందుకోవాలన్న తపన కూడదని భరతుని సద్గుణంవల్ల తెలుస్తుంది. అయోధ్యను పాలించడానికి తనకు అర్హత లేదని భరతుడు కైకేయితో సహా అందరికీ చెబుతాడు. స్వార్థ బుద్ధి కలిగిన రాజు రాజ్యమేలితే ప్రజలకు మేలు కలగదని విశదం చేస్తాడు. సూర్యవంశ గౌరవాన్ని, కుటుంబ కీర్తిని నిలపాలంటే వనవాసంనుంచి శ్రీరామచంద్రుని వెనక్కు తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుణ్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని విన్న రాజగురువు వసిష్ఠుడు- 'రాజధర్మాన్ని గురించి భరతునికి ఉన్నంత జ్ఞానం ఎవరికీ లేదు' అంటాడు. వనవాస ప్రయాణంలో ఉన్న శ్రీరామచంద్రుని కలిసి భరతుడు అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకొంటాడు. తండ్రి దశరథుని మరణంవల్ల అయోధ్య ప్రజలు అనాథలయ్యారని బతిమలాడతాడు. శ్రీరామచంద్రుడు అందుకు అంగీకరించడు. తండ్రికి ఇచ్చిన మాట తప్పడమేనని అన్నాడు. ఇద్దరు ధర్మవర్తనుల మధ్య జరిగిన ఆత్మీయపూర్వక సంవాదం వల్ల శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేయడానికి ఒప్పందం కుదురుతుంది. భరతుడు పద్నాలుగు సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుని రాజప్రతినిధిగా మాత్రమే రాజ్యమేలాడు. ఆ కాలంలో కౌసల్య సుమిత్రలు కైకేయితో సహా రాజమాతలుగా గౌరవం పొందారు.

వనవాసంనుంచి సీతతో పుష్పక విమానంలో తిరిగి వస్తున్న శ్రీరాముణ్ని- వందిమాగధులు కీర్తిగానం చేస్తుంటే పదహారు యోజనాల దూరంనుంచి మంగళవాద్యాలతో తాను భూమిపై నడుస్తూ అయోధ్యకు ఆహ్వానించాడు భరతుడు. కుటుంబగౌరవం కోసం ధర్మాన్ని కాపాడిన భరతుడికి- అన్నపై ఉన్న ప్రేమ ముందు, అధికారం, సంపదలు స్వల్పమైనవిగా కనిపించాయి. భాతృత్వం సౌభ్రాతృత్వం ప్రేమాభిమానాలే ముఖ్యమని భావించేవారికి లౌకిక సుఖాల విలువ లేనివిగానే కనిపిస్తాయి. ఈ పాత్రల్లోని నీతిని, ధర్మాన్ని కొంచెంగానైనా పాటించగలిగితే మనం నివసిస్తున్న సమాజాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. ప్రశాంతంగా మనుగడ సాగించనూవచ్చు!

- అప్పరుసు రమాకాంతరావు