ᐅశుభాకాంక్షలు



శుభాకాంక్షలు 

బంధుమిత్రులకు, ఇరుగుపొరుగువారికి పండగ పబ్బాల్లో, పర్వదినాల్లో నూతన వత్సరాదుల్లో శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకుందాం. మనం నిజంగా మనస్ఫూర్తిగా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా, లాంఛనప్రాయంగా తెలుపుతున్నామా?
శుభాకాంక్షలు పలువిధాలుగా అభివ్యక్తమవుతుంటాయి. ఆ ఒక్కరోజు ఆనవాయితీగా శుభాకాంక్షలు తెలియజేసి, ఆ తరవాత ఎదురైనా ఒకరినొకరు పలకరించుకోరు కొందరు. పలకరించినా ఏదో ముక్తసరిగా పొడిపొడి మాటలు. చిత్తశుద్ధితో, అభిమానంతో, ఆత్మీయంగా శుభాకాంక్షలు అందించేవారు ఈ సమాజంలో నేడెంతమంది ఉన్నారు?

ఇతరుల మేలును, శుభాన్ని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ప్రేమతో చేసే పలకరింపే శుభాకాంక్ష. అది కేవలం పలకరింపుల వరకే, మాటలవరకే పరిమితమైతే ఆ శుభాకాంక్షకు అర్థమే లేదు, ప్రయోజనమే లేదు. మనం ఒకరి శుభాన్ని ఆకాంక్షిస్తున్నామంటే, వారి సుఖదుఃఖాల్లో భాగస్వామ్యానికీ సంసిద్ధులం కావాలి. అవసరమైన సందర్భాల్లో వారి స్వాంతానికి సాంత్వన పలకాలి. వారి సమస్యను చొరవ తీసుకుని, తెలుసుకుని మనకు తోచిన పరిష్కారమార్గం సూచించాలి. మన శక్తిమేరకు సహకరించాలి. అప్పుడే మన శుభాకాంక్షకు అర్థం, పరమార్థం.

ముఖ్యంగా ఆంగ్లవత్సరాది వచ్చిందంటే ఎక్కడలేని సందడి. అమిత హోరు, జోరు. యువతీయువకులు ఆ రోజు పరస్పరం అభివ్యక్తం చేసుకునే తీరు వర్ణనాతీతం. వారి సంబరం, విందులు, వినోదాలు- ఇంక చెప్పనే అక్కర్లేదు. క్లబ్బులు, పబ్బులు, పార్కులు, మందులు, చిందులు, మత్తుపదార్థాల్లో మునిగిపోవడం, ఇల్లు, ఒళ్లు గుల్లచేసుకుని ఆ రోజు గడిపి, ఆ మరుసటిరోజునుంచీ ఒకరి మొహం ఒకరు చూసుకునే పనేలేదు. ఇదేమి సభ్యత, ఇదేమి సంస్కృతి? ఇటువంటి పాశ్చాత్య విషమప్రభావానికి ఎన్నాళ్లిలా దాసోహమంటూ కాలం గడపాలి? ఆ ఒక్కరోజు మనసులో లేని అభిమానాన్ని ముఖాన పులుముకుని శుభాభినందనలు తెలుపుకొని, రెండోరోజునుంచే ఎడమొహం పెడమొహంగా ఉండటం సభ్యతవుతుందా? సంస్కారమనిపించుకుంటుందా? అదే మన హైందవ నూతన వర్షశుభాగమనం రోజున ఎంతమంది శుభాకాంక్షలు తెలుపుకొంటారు? జాగ్రత్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. ఈ లాంఛనప్రాయమైన శుభాకాంక్షల సంస్కృతికి స్వస్తి చెప్పాలి. శుభాకాంక్ష మనసునుంచి రావాలి. ఆత్మీయతలో రంగరించి, అభిమానం మేళవించి, ఉపకార భావవీచికలో పరిమళించి శుభాకాంక్ష అభివ్యక్తం కావాలి.

నిజానికి ఈ సకల చరాచర సృష్టికి అసలైన శుభాకాంక్ష పరమాత్మ. మన క్షేమం కోసం, మన సుఖశాంతులకోసం మానవాళికి అన్ని వనరులూ, వసతులూ సమకూర్చిపెట్టాడు. పెడదోవనపోతున్న మన బుద్ధే వాటిని సద్వినియోగపరచుకోడంలేదు. మన అకృత్యాలతో చేజేతులా కష్టాలు, కన్నీళ్లు కొని తెచ్చుకుని, నిస్సహాయులమైన తరుణంలో నిరీశ్వరుణ్ని నిందించడం ఏమంత వివేకం! తనను తాను తెలుసుకునే ఆధ్యాత్మిక తత్వవేత్తకే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి శుభాకాంక్షలు అవగతమవుతాయి. అటువంటి ఆత్మజ్ఞానికి ప్రతి మానవుడిలోను పరమాత్మే కనిపిస్తాడు. ప్రత్యణువులోను పద్మనాభుడే ప్రత్యక్షమవుతాడు. ప్రతి మానవుడిలోను సురాసురీప్రవృత్తులు నిక్షిప్తమై ఉంటాయి. దాగివున్న గుణాల్లో మంచివన్నీ మాధవుడికి ప్రతీకలే. ఆ మంచినే మధుసూదనుడిగా భావిస్తే 'దైవం మానుషరూపేణ' అన్న ఆర్యోక్తిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. ఈ సత్యాన్ని విశ్వసించిననాడు ఎదుటివ్యక్తిని తప్పక సమాదరిస్తాం. ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని, క్షేమాన్ని కోరుకుంటాం. అప్పుడే అది నిజమైన శుభాకాంక్ష అవుతుంది.

తనలోని ప్రత్యేక విద్వత్తుకు, సాధనకు ప్రశంస లభించినప్పుడే సాధకుడి 'ఆత్మవిశ్వాసం' వృద్ధిచెంది, గమ్యానికి చేర్చడంలో తోడ్పడుతుంది. దుర్లభమైన దుస్సాధ్యమైన కార్యాలూ శుభాభినందనలవల్ల సఫలీకృతమైనట్లు పురాణాలు, చరిత్ర చెబుతున్నాయి. 'నూరేళ్లు చూస్తూ జీవిద్దాం, నూరేళ్లు వింటూ జీవిద్దాం, నూరేళ్లు ఆనందంగా జీవిద్దాం' అనే యజుర్వేద ప్రవచనాలు అత్యంత ప్రకాశవంతమై మానవాళికి శుభాకాంక్షలు వర్షిస్తూనే ఉంటాయి. ఈ మంగళాశాసనాలే మానవతాదేవికి మహోన్నతాసనాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి