ᐅఆలోచనామృతం
నశించకుండా కాపాడేది, శాశ్వతత్వాన్ని ప్రసాదించేది అమృతమని నిర్వచనం. ఇంత ఘనమైనది గనుకనే అది అత్యంత రుచికరమైనదనే వాక్ప్రయోగాన్ని మనం వింటుంటాం. 'ఆహా! ఈ పదార్థం రుచి అమృతంలా ఉంది' అంటారు. అలా అనేవారెవ్వరూ అమృతాన్ని రుచి చూసినవారు కారు. అయినా, అమృతం గురించిన భావన అంత మధురం!
త్రికరణాల్లో మొదటిది మనసు. రెండోది వాక్కు. మూడోది క్రియాకర్మ. ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. విడదీయరాని బంధం ఉంది.
గుణత్రయంగా చెప్పే సత్వరజస్తమో గుణాలు మనసుమీద గట్టి పట్టు కలిగి ఉంటాయి. సత్వగుణాన్ని దైవత్వంతో పోలుస్తారు. మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడంటారు. మిగిలిన రెండు గుణాలు మనసుని అరిషడ్వర్గాలకు అప్పజెప్పి చేతులు దులుపుకొంటాయి.
ఈ ప్రపంచంలో బహుకొద్ది మందికి మాత్రమే సత్వగుణముంటుంది. వారిలో కొద్దిమందికే శుద్ధ సత్వగుణం ఉంటుంది. ఇదెలాంటిదంటే- బంగారం, మేలిమి బంగారం అనే విభజన లాంటిది. శుద్ధసత్వ మనస్తత్వాన్ని సాధించడమే ఆధ్యాత్మిక ఆరోహణాక్రియ అసలు లక్ష్యం. ఆ స్థితికి చేరుకున్నాక అటుపైన ప్రయాణమంతా సుఖంగాను, ఆనందమయంగాను ఉంటుంది. ఎందుకంటే, మనసు దేనిపట్లా అసాధారణ అనుబంధం కలిగి ఉండదు. నిర్లిప్తత, నిరాసక్తత, సాక్షీభూతతత్వం ఆవహించి ఉంటాయి. అప్పుడు త్రికరణాలకు మొదటి మెట్టు అయిన మనసు కల్మషరహితంగా ఉంటుంది. రజస్ తమోగుణ ప్రభావాలతో మనసు పాములపుట్టగా రూపొందితే, సత్వగుణ ప్రధానమైనప్పుడది దేవాలయ సమానమవుతుంది.
మనసు సద్భావనలకు నిలయమవుతుంది. ఏవి సద్భావనలు? ఏవి సువాసనలో నఘ్రాణేంద్రియం వెంటనే చెప్పేస్తుంది. అలాగే ఏవి సద్భావనలో, ఆ వ్యక్తి పలుకులు పరిచయం చేస్తాయి. ఆచరణలు అందరినీ ఆనందింపజేస్తాయి. అలాంటి వ్యక్తిని మన వివేకం వెంటనే గుర్తిస్తుంది.
మనసు అనృతభావనలతో సతమతమవుతుంటుంది. దానికి అమృతభావనలు అందించాలి. కల్లుపాక నుంచి మరల్చి గంగాజలం వైపు నడిపించడానికి వెళ్లినట్లు, ప్రయత్నపూర్వకంగా మనసును మంచిదారి వైపు తీసుకువెళ్లాలి.
ప్రారంభంలో మనసు మొరాయిస్తుంది. వదలకుండా ప్రయత్నిస్తే లొంగిపోతుంది! లొంగింది కదాని అశ్రద్ధగా ఉంటే మళ్లీ చేజారిపోతుంది. ఒకసారి మనసు మనవశం అయ్యాక దాన్ని గట్టిగా పట్టి ఉంచాలి. మనసునంటిపెట్టుకుని ఉన్న మాలిన్యాలన్నిటినీ శుభ్రంచేశాక అది కొత్తచెంబులా తళతళలాడుతుంది. అప్పుడది క్రమంగా కలశమైపోతుంది.
మామూలు కలశం కాదు. అమృతకలశమవుతుంది. ఆ క్షణం నుంచీ ఆలోచనామృతం ఉద్భవిస్తుంది. అదే ఆధ్యాత్మిక పరమలక్ష్యం!
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్