ᐅజ్ఞాన గంధం... గురుశిష్య బంధం




జ్ఞాన గంధం... గురుశిష్య బంధం 

'మాతృదేవో భవ... పితృదేవో భవ... ఆచార్యదేవో భవ...' అంటూ గురువును మూడో స్థానానికి నెట్టివేసిన రుషిశ్రేష్ఠులే '... గురుస్సాక్షాత్ పరబ్రహ్మ' అని పరమోన్నత స్థానానికి చేర్చారు... ఆశ్చర్యం!!! ఈ అభిప్రాయ వైరుధ్యాన్ని మనం భాషార్థంతో కాకుండా భావార్థంతో గ్రహించాలి. సాధారణార్థంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పరమపూజ్యులు. జ్ఞానార్థంలో- జన్మ ఎవరైనా తీసుకుంటారు. ఏ జీవి అయినా తీసుకుంటుంది. పశుతుల్యంగా జీవిస్తున్న మనిషి మనసులోని, జీవితంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్నిచ్చే గురువు మహోన్నతుడు. ఒక సాధారణమైన మనిషి 'అహం బ్రహ్మాస్మి' అంటూ బ్రహ్మ స్థానానికి, స్థాయికి ఎదిగేందుకు దోహదం చేసినవాడు పరబ్రహ్మ కాక మరేమవుతాడు?!
సత్య శోధనలో, జ్ఞానసముపార్జనలో గురుశిష్యుల సంబంధానికి విశిష్టమైన స్థానం ఉంది. వారిరువురి సమష్టి కృషి ఫలితం, మేధో మథనమే జ్ఞాన నవనీతం. అది గురువు బోధనా మథనం ద్వారా వేడెక్కి, ద్రవించి శిష్యులకందేకొద్దీ ఘృతమై (నెయ్యి) మరింత పరిమళమొలుకుతుంది. మరింత ప్రయోజనకారి అవుతుంది.

గురువు జ్ఞానశ్రేష్ఠుడు. శిష్యుడు పరమ అజ్ఞాని. ఈ అంతరాన్ని శిష్యుడు ఎలా అధిగమించగలడు?

'ఓం సహనావవతు...' బ్రహ్మ మన ఇరువురినీ రక్షించుగాక. మన ఇరువురినీ పోషించుగాక. ఇరువురం శక్తిమంతులం అవుదుము గాక. మన ఇరువురికీ తేజస్సు కలుగుగాక. పరస్పర ద్వేషం లేకుండా ఉండెదము గాక... అని గురువు శిష్యునితోపాటు శాంతి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఇరువురి మధ్య అంతర రాహిత్యాన్ని, సమత్వాన్ని కోరుతున్నాడు ఆచార్యుడు. స్నేహానికి, ఆత్మీయతకు, అవగాహనకు సమానత్వం దోహదం చేస్తుంది. అది, మానసిక స్థాయీ సమత్వం. మేధో అభేదత్వం. గురువు జ్ఞాన భాస్కరుడు. మేధోనగం. ఆయన ముందు అజ్ఞాని అయిన శిష్యుడు అణుమాత్రుడు. తేరిపార కూడా చూడలేని గురు మహారాజు సమక్షం శిష్యుడికి అగమ్యగోచరం. ఆయనతో జ్ఞానాధ్యయం అంతుపట్టని వ్యవహారం. సూక్ష్మగ్రాహి అయిన గురువు ఈ అవగాహనతో, శిష్యుని పట్ల అపారమైన కరుణతో తన మేధోస్థాయి నుంచి శిష్య సమాన స్థాయికి దిగివచ్చి మనిద్దరం ఒకటే అనే విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. స్థాయీభేదాన్ని మరిపిస్తున్నాడు. అప్పుడే శిష్యుడు గురువును ధైర్యంగా అనుసరించగలడు. అధ్యయనం చేయగలడు. గురువు కోరుకుంటున్నది ఈ వాతావరణాన్నే.

తన త్యాగం, అనుభవ సారమే సమిధలుగా జ్ఞానమే యజ్ఞఫలంగా... గురువు రుత్విక్కుగా మారి, శిష్యునిచేత జ్ఞానయజ్ఞం చేయిస్తున్నాడు. ప్రపంచాన్నే కాదు- పరమాత్మనూ పరిచయం చేస్తున్నాడు. ఈ లోకంలో తల్లి లేకపోయినా జీవించవచ్చు కానీ గురువు లేకపోతే జీవించలేం. జీవించినా పశుతుల్యమే.

పూర్వం రాజులు, చక్రవర్తులు తమ పిల్లల్ని రాచభోగాల నుంచి దూరంచేసి గురుకులాలకు పంపేవారు. రెండు కళ్లతో గురుకులానికి బయలుదేరిన పిల్లలు జ్ఞాననేత్రమనే మూడోకన్నుతో తిరిగి వచ్చేవారు. భగవంతుడే మానవుడై జన్మించిన రాముడు, కృష్ణుడు కూడా గురువు అవసరాన్ని తృణీకరించలేదు. శిరోధార్యంగా విద్యను స్వీకరించి అపురూపమైన గురు దక్షిణల సమర్పణతోసహా విద్యాభ్యాసం పూర్తి చేశారు. పూర్వపు గురుశిష్యుల సంబంధం ఉదాత్తంగా ఉండేది. నేడు ఆ సంబంధం చీడ పట్టిపోయింది. ఆ అనుబంధపు గంధపు చెట్టు చెదలు తినిపోయింది. గురువులు పరిహాసానికి గురవుతున్నారు. విద్యార్థులు అత్యంత విలువైన తమ విద్యా అధ్యయన కాలాన్ని, అపురూపమైన విద్యార్థి దశను దుర్వినియోగం చేసుకుంటున్నారు- సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. దీనికి కారణం విద్యపట్ల, గురువుపట్ల విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవటమే. ఆధ్యాత్మిక గురువైనా, ఆధునిక గురువైనా ఆ స్థానం ఉద్దేశం విద్య గరపటమే, జ్ఞానాన్ని అందించడమే. ఆయనను నిరసిస్తే, నిరాకరిస్తే కోల్పోయేది మనమే. గురువు ఇచ్చేవాడు మనం స్వీకరించేవారం. దయ ఆయనది దీనులం మనం. త్యాగం ఆయనది ప్రయోజనం మనది. ఆయనను అవమానిస్తే, అగౌరవపరిస్తే, మన అవిధేయతతో, అకృత్యాలతో ఆవేదన చెంది మన జీవితంలోంచి గురువనే జ్ఞాన కల్పతరువు తప్పుకొంటే మనకు జీవితమే లేదు. ఉండదు. ఎందుకంటే జీవితమంటే జ్ఞానమే కనుక. జ్ఞానమంటే గురువు పెట్టే భిక్ష కనుక. కుమారుణ్ని చూసి ఈర్ష్యచెందే తండ్రి ఉంటాడేమోగానీ శిష్యుణ్ని చూసి ఈర్ష్యాసూయలు పొందిన గురువు కనిపించడు... ఆయన ప్రాపంచిక గురువైనా, పారమార్థిక గురువైనా. ఆయన ఆశ, ఆశయం శిష్యుడు; 'గురువును మించిన శిష్యుడు' కావాలనే. ఆ అజ్ఞాన శిశువు 'సహస్ర శీర్షా పురుషః' కావాలనేదే ఆయన ఆకాంక్ష. అలాగే వామన మాత్రంగా కనిపించే గురువులోని విరాట్ స్వరూపాన్ని దర్శించగలిగినప్పుడే శిష్యుడు పూర్ణ ప్రయోజనాన్ని పొందగలడు.

గురువును విదూషకుడిగా మలచుకుని చిలిపి సరదా చేసుకునే వికృత సంస్కృతి నిరసించదగ్గది. దీన్ని చూసి గురువును పరబ్రహ్మగా పూజించిన మన భారతీయ 'పూర్వ' సంస్కృతి సిగ్గుతో తలదించుకుంటుంది.

- చక్కిలం విజయలక్ష్మి