ᐅచివరికి మిగిలేది
లోకంలో పుట్టిన ప్రతిమనిషీ బుద్ధితెలిసిన నాటినుంచి తనకోసం ఎన్నో సమకూర్చుకోవాలనుకుంటాడు. గడ్డిపోచ మొదలుకొని విలాసవంతమైన భవనాలదాకా మనిషికి అవసరంలేని వస్తువు ప్రపంచంలో ఏదీలేదు. అన్నింటినీ తనవశం చేసుకోవాలనే తపనలో అహోరాత్రాలూ హారతికర్పూరాల్లా కరిగిపోతాయి. అయినా అతడు లెక్కచేయడు. అన్నింటినీ సమకూర్చుకోవడమే అతని ధ్యేయం. ఇందుకోసం అతడు నానాగడ్డీ కరుస్తుంటాడు. ఎంతటి నీచమైన పనినైనా చేయడానికి వెనకాడడు.
మనిషి ఎక్కువగా ఇష్టపడేది డబ్బునే. ఆ డబ్బు మనిషికి అంత సులభంగా చిక్కదు. చిక్కినా దక్కుతుందనే నమ్మకంలేదు. తనవెంట పరుగులు తీస్తూ వస్తున్న మనిషిని డబ్బు ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తుంది. అది అంత సులభంగా మనిషికి లొంగదు. మాయచేస్తుంది. తప్పులు చేయిస్తుంది. పాపాలకూపాల్లో పడదోస్తుంది. తాను మాత్రం పరిహాసంగా నవ్వుకుంటుంది. డబ్బు ఆడే నాటకంలో కోటీశ్వరుడు బిచ్చగాడు కావచ్చు. బిచ్చగాడు అమాంతంగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడూ కావచ్చు. దేనికీ స్థిరత్వం లేదు. ఎంత సంపాదించినా శాశ్వతం కాదు. సంపాదన వేటలో క్షణం తీరిక లేదు. నిమిషం సేపు విశ్రాంతి రాదు. ఒక పగలు ఇక్కడా, ఒక రాత్రి అక్కడా అన్నట్లు డబ్బు దూరని చోటు లేదు. పవిత్రస్థానమనీ, అపవిత్ర ప్రదేశమనీ ఏ విచక్షణా లేదు. మహాత్ములను ఎంత ఆశ్రయిస్తుందో, హంతకులనూ అంతే ఆశ్రయిస్తుంది. దాని చంచలత్వానికి అంతంలేదు. గౌరవనీయుణ్ని బజారున పడవేయడానికి ఏమాత్రం ముందువెనకలు చూడని డబ్బు, అప్రశస్తులను అందలాలకు ఎక్కిస్తుంది. వాళ్లు మాట్లాడిందే వేదం అన్నట్లు శాసిస్తుంది. పండిత ప్రకాండులకు ఆవగింజంత అయినా విలువ ఇవ్వదు. వాళ్లను దద్దమ్మలుగా మారుస్తుంది. ఇటువంటి డబ్బును మిగిలించుకోవడానికి మనిషి ప్రతి దినం తపన పడుతుంటాడు. రోజూ మైళ్లకు మైళ్లు ప్రయాణిస్తుంటాడు. పైసా పైసా కూడబెడుతుంటాడు. వాడి వెర్రిగానీ, ఈ డబ్బు ఎంతకాలం నిలుస్తుందో ఎవడికీ తెలియదు. బొందిలో ప్రాణం ఉన్నంతదాకా సంపాదిస్తూనే ఉన్నా, వాడిపై ఏమాత్రం జాలిచూపక, ప్రాణం పోగానే, వాడికోసం కనీసం శ్మశానం దాకా కూడా వెంట వెళ్లాలనుకోదు డబ్బు. వాడి శవం ఉండగానే, మరొకరి చేతిలోనికి వెళ్లిపోతుంది. వాణ్ని దిక్కులేని వాణ్ని చేస్తుంది. ఏది తనకు దిక్కని భార్యాబిడ్డలను, మిత్రులను, బంధువులను సైతం దూరం చేసుకుంటాడో, ఆ డబ్బు అతణ్ని ఏమాత్రం పట్టించుకోకుండా చెప్పకుండానే వెళ్లిపోతుంది. చివరికి మిగలాలని ఎంత శ్రమించినా, మిగలకుండానే కనుమరుగైపోతుంది. ఇలాంటి డబ్బును తన దగ్గర మిగిలించుకోవడం కోసమేనా అందరినీ దూరం చేసుకొన్నది అని తలచుకొన్నప్పుడు- మనిషిపై ఎంతో జాలి కలుగుతుంది. ఇంతకూ చివరికి మిగిలేదేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. మనిషి జీవించి ఉన్నా, మరణించినా సుకృతఫలం ఒక్కటే మిగులుతుందన్నదే ఆ సమాధానం.
సుకృతఫలం డబ్బుతో కొంటే రాదు. డబ్బును ఇంట్లో ఉంచుకుంటే రాదు. త్యాగంతోనే వస్తుంది. భోగం ఉంటే పారిపోతుంది. త్యాగంతో లభించే సుకృతఫలం చివరిదాకానే కాకుండా శాశ్వతంగా నిలుస్తుంది.
త్యాగం మాటలతో రాదు. ప్రవచనాలతో పనిచేయదు. మనోబలంతో వస్తుంది. కారుణ్యంతో వస్తుంది. కనికరంతో వస్తుంది. సాధుస్వభావంతో వస్తుంది. సజ్జన సాంగత్యంతో వస్తుంది. భోగం ఉన్నచోట త్యాగం ఉండదు. త్యాగం చేయాలంటే భోగాలకు దూరంగా ఉండాలి. తనకోసం ఏదీ ఆశించకూడదు. నిరాడంబరంగా సమాజ సేవ చేయాలి. నిశ్చింతగా బతకాలి. అలాంటివాని సుకృతమే చివరికి మిగిలేది. మిగిలినదంతా కాలగర్భంలో కలిసిపోతుంది.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ