ᐅదురుసుతనం
కుండెడు పాలల్లో ఓ చిన్న ఉప్పుగల్లు, తళతళ మెరిసే ధవళవస్త్రంపై ఓ నల్లని మరక. అవి వాటి సహజత్వాన్ని ఎలా భంగపరుస్తాయో- ఎన్ని సుగుణాలు ఉన్నా, ప్రవర్తనలోని దురుసుతనం వ్యక్తిత్వాన్ని అలాగే మసిబారేట్లు చేస్తుంది.
దురుసుతనం మాటల్లో, చేతల్లో ప్రస్ఫుటమవుతుంది. తామస గుణానికి మరో రూపమే ఇది. దీన్ని ఆదిలోనే సరిచూసుకోకపోతే విస్తృతరూపం దాల్చి వ్యక్తిత్వాన్నే ప్రశ్నించేలా చేస్తుంది.
సౌజన్యం, శాంతస్వభావం ఉంటేనే మానవుడు మాధవుడిలా శోభిల్లుతాడు. సుగంధం వెదజల్లితేనే పువ్వులకు శోభ, పరిమళం. అప్పుడే అవి దేవుని పూజకు నోచుకుంటాయి.
వాసనలేని పువ్వులు చూసేందుకే కానీ, దేవుడి పాదాల చెంతకు చేరలేవు.
వ్యక్తిత్వ పరిమళం మాటల్లో, చేతల్లో గుబాళించాలి.
రెండు పెదవులు దాటివచ్చే మాట భూషణంలా భాసిల్లాలి. చేత, చేవ కలిగి సకల జనామోదంగా ఉండాలి.
కఠిన పాషాణాన్ని శిల్పి రమణీయమైన శిల్పంగా చెక్కుతాడు. అదే దేవతారూపంగా నిలిచి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ పొందితే సాక్షాత్తు భగవత్ స్వరూపంగా దర్శనమిస్తుంది. దాన్ని ఓ శిలగా భావించం.
శిల్పి చేతిలోని ఉలి పాషాణాన్ని తీర్చిదిద్దే ఉపకరణం. ఏకాగ్రచిత్తంతో శిల్పానికి ప్రాణం పోస్తాడు. ఏ ఒక్క కోణాన్నీ గాడి తప్పనీయడు. ఉలి, ఏకాగ్రచిత్తం మనోఫలకంపై ప్రతిష్ఠితమై ఉండే అర్చారూపం- వెరసి కనువిందు చేసే రూపం అవతరించి, పూజార్హమవుతుంది. అత్యున్నత స్థానాన్ని అలంకరిస్తుంది.
అపసవ్యంగా సాగిపోయే జీవనశైలిని మలచుకొనేందుకు భగవానుడు మనకు కూడా ఎన్నో ఉపకరణాలు కల్పించాడు.
వ్యక్తి శీలనిర్మాణానికి బుద్ధిని, ఆలోచనా జ్ఞానాన్ని ప్రసాదించాడు. అహంకారజనితమైంది, మూర్ఖత్వానికి తోడబుట్టింది- దురుసుతనం. అది సుగుణాలను మేఘంలా కప్పేస్తుంది.
విశ్వామిత్రుడు సాధారణ తపస్వి కాడు, రాజర్షి. గాయత్రీ మహా మంత్రాన్ని జగతికి అందించిన మహారుషి. పలు సందర్భాల్లో వసిష్ఠుడి శాంతస్వభావం ముందు విశ్వామిత్రుడు తలవంచక తప్పింది కాదు.
వసిష్ఠుల వారి ఉపదేశం మేరకు- తనలోని అహంకారానికి, అనాలోచిత విధానాలకు, గర్వానికి కారణభూతమైన దురుసుతనాన్ని వదిలేసి బ్రహ్మర్షిగా మారాడు.
నిండుసభలో శ్రీకృష్ణుని మహామౌనాన్ని బలహీనతగా భావించాడు శిశుపాలుడు. నోటి దురుసుతనంతో పేట్రేగిపోయాడు. మహామౌనం బద్దలైంది. శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శనం నిప్పులు కక్కింది. శిశుపాలుడు హతుడయ్యాడు.
సత్వగుణ సంపన్నులు ఉత్తములు. వారి రెండు పెదవులు దాటి వచ్చే మాట సరస్వతీ స్వరూపం. ప్రియభాషణం, శాంత స్వభావజనిత వచనాలు- ఆ వాగ్దేవికి అందించే పూజాసుమాలు.
కఠిన పరుషపదజాలం ఎదుటివారిని గాయపరుస్తుంది. మనకు చేటు కొనితెస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దురుసుతనపు మాటలు, చేతలు- మానవ సంబంధాలను దూరం చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త!!
- దానం శివప్రసాదరావు