ᐅశరణు శరణు... గణాధిపా!
సృష్టికి ముందు ఓంకారమే గణపతి రూపంగా ప్రభవించింది. సర్వవ్యాపక ప్రణవ తేజస్విగా, విశ్వరూప దైవంగా వేదాలు ఆయనను కీర్తించాయి. మనం నివసించే భువనమంతటా ప్రకృతి స్వరూపంగా నిండి నిబిడీకృతమై అందరిచేతా పూజలు అందుకొంటున్నాడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులాది దేవతా గణాలందరికీ, సకల సృష్టిలోని జీవ గణాలకు అధిదేవత, అధినేత గణపతి. బ్రహ్మ సృష్టి మహత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందుగా గణపతిని పూజించినట్లు రుగ్వేదం చెబుతున్నది. గణశబ్దంలో 'గ' అంటే విజ్ఞానమని, 'ణ' అంటే మోక్షమని బ్రహ్మ వైవర్తన పురాణం వెల్లడిస్తోంది. అటువంటి గణాల సముదాయమే ఈ సర్వసృష్టి. అహంకారానికి సంకేతం అయిన మూషికాన్ని అధిష్ఠించి ప్రపంచాన్ని పరిపాలించే ప్రభువు ఆయన. గణపతి ఆరు రూపాల్లో పూజలు అందుకుంటాడు. అవి మహాగణపతి, హరిద్రాగణపతి, స్వర్ణగణపతి, ఉచ్చిష్టగణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి.
గణపతికి విశ్వరూప ప్రజాపతి తన కుమార్తెలు సిద్ధి, బుద్ధిని ఇచ్చి వివాహం జరిపాడు (వాటి అంతరార్థాలు తెలుస్తూనే ఉన్నాయి). వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగారు. గణపతిని ఆరాధిస్తే క్షేమం, లాభం కలుగుతుందని సంకేతార్థం... కథలు పిల్లలకోసం, అంతరార్థాలు జ్ఞానాన్వేషకులకోసం.
క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతలు వినాయకుని పూజచేయడం మరచిపోయారట. అందువల్ల అవాంతరాలు ఏర్పడ్డాయంటారు. మొదట హాలాహలం పుట్టి అందరినీ భయ విహ్వలులను చేసింది. విష్ణువు సలహాతో గణపతిని పూజించి మొదటగా పాలసముద్రంలో ఆవిర్భవించినదాన్ని ఆయనకు సమర్పించుకొంటామని మొక్కుకున్నారు. మొదట వెలువడిన లక్ష్మీదేవిని వినాయకునికి సమర్పించారు. ఆమెను ఆయన స్వీకరించి తన కుడితొడపై ఆశీనురాలిని చేసుకుని లక్ష్మీగణపతిగా దర్శనమిచ్చాడు (కొన్ని ఆలయాల్లో ఈ విగ్రహం కనిపిస్తుంది). అనంతరం ఆమెను తన పూజ చేయమని తెలిపిన విష్ణువుకు ఇచ్చాడు. ఆయన ఆమెను స్వీకరించి తన ఎడమ తొడపై ఆశీనురాలిని చేసుకున్నాడు. కుడితొడపై కూర్చున్న ఆమె కుమార్తెతో సమానమని శాస్త్రం చెబుతున్నది.
లక్ష్మీదేవిని పూజించి ధనాన్ని, సరస్వతిని పూజించి విద్యను, పార్వతిని పూజించి శక్తిని, విష్ణువును పూజించి రక్షణను, శివుని పూజించి ముక్తిని- ఇలా ఒక్కొక్కరివల్ల ఒక్కో కోర్కెను నెరవేర్చుకోగలమంటారు. కాని సకల కార్యసిద్ధులను కలిగించగలవాడు విఘ్నేశ్వరుడు మాత్రమే.
చవితినాడు పూజించవలసిన ప్రతిమ శ్వేతార్క గణపతి. ఆయనకు ఆకుపచ్చరంగు పట్టువస్త్రాలు ధరింపజేయాలి. కలశంపై ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని అలంకరించాలి.
ఈ ఆకుపచ్చరంగు ప్రకృతికి సంకేతం. ప్రకృతి హరిత పరిష్వంగంలో భాసించే అప్రాకృత దివ్యతేజో రూపం ఆయన. అందుకే భక్తులు హరితపత్రాలు, పత్రి, గరిక, దళాలు, కాయలతో పూజిస్తారు.
గణపతి ఉదరం అఖండ విజ్ఞానానికి, వివేకానికి ప్రతీక. ఆయన తొండం ప్రతి వస్తువును స్పృశించి అన్వేషించే గుణానికి సంకేతం. తొండంతో చిన్న సూదిని కూడా పట్టుకోగల శక్తి గజానికి ఉంది. అసలు గజం, విశ్వవ్యాపకతకు చిహ్నం. అల్ప జీవినుంచి బృహత్ ప్రాణివరకు సర్వత్రా ఆయన పరివ్యాప్తమై ఉన్నాడని తెలియజేయడానికే గజవదనాన్ని, మూషిక వాహనాన్ని అమర్చారని పెద్దలు చెబుతారు.
శ్వేతాంబరం ధరించినవాడు, శ్వేతచంద్రోదయ దీప్తులతో శోభిల్లేవాడు, చతుర్భుజాలతో, విశ్వమంతటా ప్రదీపించేవాడు గణపతి అని వేద రుషులు కీర్తించారు. మనిషి ఐహిక, ఆధ్యాత్మిక జీవన పుణ్యయాత్రలో ప్రసన్న వదనంతో సర్వ అవాంతరాలు తొలగించి విశ్వానికి శ్రేయం కలిగించే దైవమా... శరణు, శరణు.
- కె.యజ్ఞన్న