ᐅఅదివో... అల్లదివో!
ఎవరైనా ఏ ప్రయాణమైనా ప్రారంభించేది గమ్యాన్ని చేరుకోవడానికే. గమ్యమే లక్ష్యం, ప్రధానంగానీ- మార్గమో, గమనమో కాదు. సుఖమార్గమూ, సులభ మార్గమూ, దగ్గరి మార్గమూ ఎంచుకోవటం వరకే దానికి ప్రాధాన్యం. గమ్యం కోసం గమనం గానీ, గమనం కోసం గమ్యం కాదు. ఈ లోకంలో గమనం, మార్గం కూడా గమ్యమంత ఆనందాన్నిచ్చే పయనం ఒకటుంది. అదే ఆధ్యాత్మిక ప్రయాణం, ముక్తిమార్గం, సాధనా పథం. ఈ లోకంలో ప్రయాణంలో కూడా, సాధనా సమయంలో కూడా అత్యంత ఆనందాన్నిచ్చే అంశం పరమపద సాధన మాత్రమే. భక్తి, యోగం, సాధన... ఏదైతేనేం... ఇవన్నీ పరమపద ప్రయాణానికి వాహనాలు. సాధనాలు. భక్తి సాధనలో ఎంత ఆనందమున్నా ఆర్తీ, ఆతృతా, ఆరామమూ ఉంటాయి. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలన్నదే ఆ ఆరాటం. ఈ జన్మ ముగిసేలోగా దాన్ని పొందాలన్నదే ఆ ఆతృత. మంచిదే. కానీ, మనకు తెలీదు... మనం ఆరాటపడినంత మాత్రాన ఆందోళన చెందినంత మాత్రాన అది అందదని. ఆయన సంకల్పించాలి. అనుగ్రహించాలి. ప్రయత్నం, ప్రయాణమే మన విధి. అందుకే విజ్ఞులు సలహా ఇస్తారు. పరమపదానికై తపన పడండి. ఆర్తి చెందండి. కానీ నిదానంగా, కానీ ప్రశాంతంగా, కానీ ఆనందంగా... అని. శ్రీ రామకృష్ణులు భక్తి సాధనను ఒక ఆటగా అభివర్ణిస్తారు. 'గమ్యానికై ఆరాటపడకండి... ఆట ఆగిపోతుంది... ముందు అద్భుతమైన ఈ ఆటను ఆనందించండి' అని.
నిజమే. సాధనామార్గం, కాలం ఆసాంతం అమందానందం. ఇది ప్రతివారికీ అనుభవంలోకి వస్తున్నా గమ్యాన్ని చేరుకోవాలనే తొందరలో, ఇంకా ఎంత దూరమన్న ఆరాటంలో, అసలు చేరగలమా లేమా అన్న ఆందోళనలో ఆ ఆనందంలోని సారాన్ని ఆస్వాదించలేకపోతారు. ముందు మనం ఎంచుకున్న గమ్యమేదో పూర్ణంగా అర్థం చేసుకోవాలి. అది సంపూర్ణ ఆనంద స్వరూపం. రసమయ అనంత సాగరం. స్మరణైనా, సాధనైనా, సామీప్యమైనా, సోపాన అధిరోహణమైనా... రామకృష్ణులన్నట్లు ఈ సాధనా కాలాన్ని ఆటగా ఆనందించే అవకాశాన్ని కోల్పోరాదు. ఈ రసవంతమైన, మధురమైన క్రీడను ఆస్వాదిస్తూ మార్గాయాసం లేకుండా సాగిపోవాలి. నిజానికి ప్రయాణమే, సాధనానుభవమే ఒక క్రీడానందాన్ని ఇస్తున్నప్పుడు మార్గాయాసం, ప్రయాస లాంటివాటికి అవకాశమే లేదు.
ఒక పూదోటకు వెళ్తున్నప్పుడు అల్లంత దూరం నుంచే చల్లని సమీరాలు శరీరాన్ని సేదతీరుస్తాయి. పరిమళాలు పాకివచ్చి మనం చేరుకోబోయే చోటు ఎంత ఆహ్లాదకరమైనదో, ఆనందదాయకమైనదో చెప్పకనే చెబుతాయి. ఆ కొద్దిదూరం, ఆ చోటుకు, ఆ తోటకు చేరుకున్నంత మేరా మనసు మనోజ్ఞమై, ఆనంద పరవశమైపోతుంది. దారి యావత్తూ సుపరిమళమై, సురభిళమై గమ్యాన్నే మరిపించేంత మధురతమమై ఉంటుంది. పరమపద సోపాన పంక్తీ అంతే. మార్గ సౌందర్యమూ అంతే. గమన ఔన్నత్యమూ అంతే. గురుసేవ, జపం, ధ్యానం, శ్రవణం, స్వాధ్యాయం, యోగం, యాగం, పారాయణాలు, ప్రాణాయామాది సాధనా విశేషాలు... నిజమైన, నిజాయతీగల సాధకుడికి అద్భుతమైన ఆనందదాయకాలు. నిత్య వేడుకలు. మూసుకున్న కళ్ల వెనక ఒక అద్భుత ప్రపంచం కళ్లు తెరుస్తుంది. హృదయమనే అనంత వేదిక మీద ఆనందం నటరాజనృత్యం చేస్తుంది. ఆత్మ అరమోడ్పు కళ్లతో ఆస్వాదిస్తుంది. ఇంతకంటే సాధనకు ప్రయోజనం ఏముంది? తేనెలు స్రవించే, తుమ్మెదలు విహరించే పూలతోట... ఓటమే లేని ఒక ఆట... ఓంకారమే రచనా, రాగమూ అయిన ఒక పాట! సాధన చేద్దాం. విసుగు లేకుండా. విరామమెరుగకుండా.
- చక్కిలం విజయలక్ష్మి